ఇందిరాగాంధీ ధైర్యం 50 శాతం అయినా ఉంటే .... అల్టిమేట్ ఫైర్ ఎవరిది ?
ఇది అల్టిమేట్ ఫైర్. ఎవరిది అని అనుకుంటున్నారా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీది.
By: Tupaki Desk | 30 July 2025 1:07 AM ISTఇది అల్టిమేట్ ఫైర్. ఎవరిది అని అనుకుంటున్నారా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీది. ఆయన సరైన సమయం కోసం ఇంత కాలం చూసినట్లుగా ఉంది. ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయమని ఇప్పటికి చాలా సార్లు కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే వర్షాకాల సమావేశాలలో ప్రత్యేకంగా ఈ అంశం మీద చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. దాంతో రాహుల్ గాంధీ చాన్స్ తీసుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద ఒక్క లెక్కన మండిపడ్డారు.
ఇందిరమ్మతో మోడీకి పోలిక :
తన నాయనమ్మ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి పోలిక పెడుతూ లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఆపరేషన్ సింధూర్ మీద కేంద్రం చేసిన తప్పులను ఎత్తి చూపుతూనే మోడీని నేరుగా టార్గెట్ చేశారు. ఇందిరాగాంధీలో యాభై శాతం ధైర్యం అయినా ఉంటే కనుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ కి స్పష్టమైన కచ్చితమైన జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేవలం ముప్పై నిముషాలే :
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ మీద దాడికి కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశాయి. కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా తాము సమ్మతమే అని కూడా చెప్పాయని ఆయన పేర్కొన్నారు. అయితే కేవలం ముప్పయి నిముషాలలోనే పాక్ కి కేంద్రం లొంగిపోయింది అని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ కేవలం 22 నిముషాలలోనే ముగిసిపోయిందని అన్నారు. ప్రభుత్వానికి పోరాడే సంకల్పం లేదని అర్థమైంది అని ఆయన విమర్శించారు. పాక్ కి ఎయిర్ స్ట్రైక్స్ గురించి ముందే సమాచారం ఇచ్చారని ఆయన విమర్శించారు. కాల్పుల విరమణ పాటిద్దామని కేంద్రం ముందుగానే పాకిస్తాన్ ని అడిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ విధంగా సైన్యం చేతులను ప్రభుత్వం కట్టేసిందని కూడా ఫైర్ అయ్యారు.
పాక్ పీచమణిచామన్న మోడీ :
అయితే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ తిప్పికొట్టారు. తాము సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చామని కూడా ఆయన తెలిపారు. ప్రపంచాన్ని ఏకం చేశామని అంతా తమకు మద్దతుగా నిలిచారు అన్నారు. భారత్ ఉగ్రవాద శిబిరాలను తుదముట్టించిందని గుర్తు చేశారు. ఈ విషయంలో భారత్ ఘన విజయం సాధించింది అని అన్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ ని ఆపలేదని మోడీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మీద తూటాలు :
అదే సమయంలో కాంగ్రెస్ మీద మోడీ మాటల తూటాలు పేల్చారు. దేశంలో వీరులు పరాక్రమం చూపిస్తే దానికి కాంగ్రెస్ నుంచి మద్దతు లభించకపోవడం దురదృష్టకరం అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయక ప్రజల ప్రాణాలు పోతే అక్కడ కూడా తన రాజకీయాన్ని కాంగ్రెస్ వెతుక్కుంటోందని ఆయన మండిపడ్డారు. భారత్ మీద పాక్ అణు బ్లాక్ మెయిలింగ్ చేయాలని చూస్తే గట్టి బుద్ధి చెప్పామని భారత్ రక్షణ పాటవాన్ని ప్రపంచం యావత్తూ చూసిందని మోడీ అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే భారత్ పాక్ ల మధ్య యుద్ధాన్ని ఆపానని ఇప్పటిదాకా చేస్తూ వస్తున్న వ్యాఖ్యల మీద మోడీ మాట్లాడలేదని అంటున్నారు దీని మీదనే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సభ్యులు పట్టుబడుతూ ఇందిరాగాంధీ ధైర్యంతో పోలిక కూడా తెస్తున్నారు.
