ఆపరేషన్ సింధూర్ ...ఒక పాఠ్యాంశంగా !
ఆపరేషన్ సింధూర్ భారత్ అంటే ఏమిటో పాకిస్తాన్ కి తెలియచేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలకు తగిన గుణపాఠం నేర్పింది.
By: Tupaki Desk | 27 July 2025 7:00 AM ISTఆపరేషన్ సింధూర్ అన్నది కొద్ది నెలల క్రితం దేశంలో ఎంతటి తీవ్రమైన చర్చకు దారి తీసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతే కాదు అంతర్జాతీయంగా భారత్ పరాక్రమాన్ని తెలియచేసింది. భారత్ తన కాలు కదపకుండా ఉన్న చోటనే ఉంటూ లాహోర్ దాకా తన లక్ష్యాలను పంపించి పాక్ పీచమణించిన వైనం పట్ల అంతా ఆశ్చర్యచకితులు అయ్యారు. భారత్ రక్షణ పటిమను ప్రత్యర్ధులు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
అదే స్పూర్తిగా తీసుకుని :
ఆపరేషన్ సింధూర్ భారత్ అంటే ఏమిటో పాకిస్తాన్ కి తెలియచేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలకు తగిన గుణపాఠం నేర్పింది. భారత్ జోలికి వస్తే మామూలుగా ఉండదన్న గట్టి సందేశాన్ని పంపించింది. అంతే కాదు ఈ రోజుకీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉందని రక్షణ శాఖ ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్పూర్తిని భావి తరాలకు కూడా అందించాలన్న ఉద్దేశ్యంతో ఆపరేషన్ సింధూర్ ని ఒక పాఠ్యాంశంగా ఉన్నత తరగతులకు అందించాలని చూస్తున్నారు.
విద్యార్ధులలో దేశభక్తి కోసం :
విద్యార్ధులలో దేశభక్తిని పెంపొందించాలన్న లక్ష్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ ఈ పని మీద ప్రస్తుతం ఉంది అని అంటున్నారు. అయితే ఇది రెగ్యులర్ పాఠం గా కాకుండా ఒక కేసు స్టడీగా విద్యార్ధుల ముందుకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం అయితే జరుగుతోంది అని అంటున్నారు.
కేంద్ర మంత్రి ప్రకటన :
ఇక విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ భావాలను వారిలో కలిగించేందుకు ఆపరేషన్ సింధూర్ వంటి వాటిని పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఉందని ఈ మధ్యనే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో కేంద్రం సీరియస్ గా ఆలోచన చేస్తోంది అనడానికి ఆయన చేసిన ఈ ప్రకటన నిదర్శనం అని అంటున్నారు. దేశ పురోగతిని వివరించడం దేశం పట్ల సమాజం పట్ల సానుకూల భావనను పెంపొందినడానికే ఈ పాఠాంశాలు తీసుకుని వస్తున్నామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
పార్లమెంట్ లో చర్చ సందర్భంగా :
ఇదిలా ఉంటే ఈ నెల 28,29 తేదీలలో రెండు రోజుల పాటు పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఉంది. 28న లోక్ సభ, 29న రాజ్యసభలో జరిగే చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని విపక్షాలకు అలాగే దేశానికి కూడా తన ప్రసంగం ద్వారా వివరాలు అన్నీ అందిస్తారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠ్యాంశం గురించి కూడా కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఉగ్రవాదం గురించి చెప్పడం వారి మీద భారత రక్షణ దళాలు ఏ విధంగా పోరాటం చేపట్టాయో విద్యార్ధులకు తెలియచేయడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశ్యంగా ఉంటుందని అంటున్నారు.
