తొమ్మిదో రోజు ఇరాన్ మూడు ఎదురుదెబ్బలు.. ఒక మద్దతు!
ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇరాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం తొమ్మిది రోజులు పూర్తి చేసుకుంది.
By: Tupaki Desk | 22 Jun 2025 9:00 AM ISTఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇరాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం తొమ్మిది రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ఇరాన్ కు వరుసగా మూడు గట్టి దెబ్బలు కొట్టింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్). ఇందులో కీలక నేతల మరణాలతో పాటు ఇస్ఫాహాన్ అణుకేంద్రం ధ్వంసం కూడా ఉండటం గమనార్హం.
అవును... ఇజ్రాయెల్ తో శనివారం తొమ్మిదోరోజు యుద్ధంలో ఇరాన్ కు మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇందులో భాగంగా... ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐ.ఆర్.జీ.సీ)కు చెందిన ముగ్గురు కీలక కమాండర్లను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. కీలక ఇస్ఫాహాన్ అణుకేంద్రానికీ భారీగా నష్టం కలిగించింది. బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే కర్మాగారాలపై దాడులు చేసింది.
ఇందులో భాగంగా... ఇరాన్ లోని కూమ్ నగరంలో ఓ అపార్టుమెంటుపై దాడి చేసి ఐ.ఆర్.జీ.సీ సీనియర్ కమాండర్ సయీద్ ఇజాదీని మట్టుపెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శనివారం ప్రకటించారు. ఐ.ఆర్.జీ.సీ.లో శక్తిమంతమైన 'ఖుద్స్ ఫోర్స్'లో పాలస్తీనా విభాగానికి ఇజాదీ అధిపతిగా ఉన్నారని వెల్లడించారు.
ఇదే సమయంలో... పశ్చిమ ఇరాన్ లో చేసిన డ్రోన్ దాడిలో 'ఖుద్స్ ఫోర్స్'కే చెందిన ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షహర్యారిని కూడా ఐడీఎఫ్ హతమార్చింది. ఇతడు హమాస్, హెజ్ బొల్లా, హూతీ సంస్థలకు ఆయుధాల సరఫరాలో ప్రధాన పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అలాగే.. ఐ.ఆర్.జీ.సీ ఎయిర్ ఫోర్స్ కీలక కమాండర్ నూ మట్టుబెట్టినట్లు చెప్పింది.
మరోవైపు యుద్ధానికి సంబంధించి ఐడీఎఫ్ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా.. తాము సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన అధికారిక ప్రతినిధి ఎఫ్ఫీ డెఫ్రిన్... అణుకేంద్రాలను, క్షిపణి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. దీంతో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదని అంటున్నారు!
ఇరాన్ కు మద్దతుగా రష్యా!:
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో టెహ్రాన్ కు మద్దతుగా మాట్లాడారు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఏ అణ్వాయుధాలు అనే కారణంతో ఇజ్రాయెల్ దాడులు చేస్తుందో.. అందుకు తగిన సాక్ష్యాలు, ఆధారాలు లేవని తెలిపారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ కు చెప్పినట్లు వెల్లడించారు!
ఇందులో భాగంగా.. అణ్వాయుధాల తయారీకి ఇరాన్ సన్నాహాలు చేస్తోందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పేరొన్న పుతిన్.. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్ కు పలుమార్లు స్పష్టం చేసినట్లు తెలిపారు. శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్ కు ఉందని అన్నారు. ఈ విషయంలో ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
