'బంకర్ బస్టర్ బాంబు విధ్వంసం చూడండి'.. వైట్ హౌస్ వీడియో పోస్టు!
సుమారు 400 కిలోమీటర్ల దూరం నుంచి, ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా అత్యంత ఖచ్చితత్వంతో ఈ డాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది.
By: Tupaki Desk | 27 Jun 2025 2:00 PM ISTఇరాన్ వద్ద ఉన్న అణుకేంద్రాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధంలో.. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా ఫినిషింగ్ టచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 400 కిలోమీటర్ల దూరం నుంచి, ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా అత్యంత ఖచ్చితత్వంతో ఈ డాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది.
ఇదే సమయంలో... ఇది తమ సైనికుల విజయమని చెప్పిన ట్రంప్... చరిత్రలో నిలిచిపోయే దాడుల్లో ఇది ఒకటని తెలిపారు! ఆ స్థాయిలో బీ-2 స్పిరిట్ బాంబర్లు సుమారు 36 గంటలు అవిరామంగా ప్రయాణించి.. ఇరాన్ లోని అణుకేంద్రాలను కచ్చితమైన లక్ష్యంతో నాశనం చేసింది. ఈ సమయంలో.. దాడికి ముందు పరీక్షించిన వీడియోలను అమెరికా విడుదల చేసింది.
అవును... అత్యంత శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ పై దాడికి ముందు పరీక్షించిన వీడియోలను వైట్ హౌస్ తాజాగా విడుదల చేసింది. ఈమేరకు పెంటగాన్ కు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ దాడితో ఆయా కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ కు నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు!
కాగా... ఇరాన్ పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో భాగంగా ఫోర్డో అణుకేంద్రంపై ఏకంగా 12 బంకర్ బస్టర్లను, మరో అణుకేంద్రం నతాంజ్ పై రెండు వాడినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే... వీటివల్ల పెద్దగా నష్టం జరగలేదంటూ పలు అమెరికా పత్రికలు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో.. రక్షణశాఖ ఈ వీడియోలను బహిర్గతం చేయడం గమనార్హం.
ఫోర్డోలోని అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడానికి జీబీయూ-57 ఏ/బీ బాంబులను ప్రయోగించిన అమెరికా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ భారీ బంబర్ బ్లస్టర్ బాంబుకున్న బరువు (13,600 కిలోలు) వల్ల.. అది నేలను తాకగానే పెద్దమొత్తంలో గతిశక్తి ఉత్పన్నమై బంకర్లను ఛేదించగలుగుతుంది. ఆ తర్వాత సుమారు 2,400 కిలోల పేలుడు పదార్థం విస్ఫోటం చెందుతుంది.
వాటిని దృష్టిలో ఉంచుకునే బంకర్ బ్లస్టర్ బాంబులు!:
ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో వాడిన బంకర్ బస్టర్ బాంబులను కేవలం ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్ అణుకేంద్రాల నిర్మాణాలను దృష్టిలో ఉంచుకొనే తయారుచేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డాన్ కెయిన్స్ వెల్లడించారు. సుమారు 15 ఏళ్లుగా ఈ కేంద్రాలపై తమకు అందుతోన్న నిఘా సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించామని తెలిపారు.
ఇరాన్ పర్వతాల్లో రహస్యంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని అందిన రహస్య సమాచారంతోనే జీబీయూ-57 ఎ/బి తయారైనట్లు డాన్ కెయిన్స్ పేర్కొన్నారు. ఇక.. ఈ ఫోర్డో కేంద్రంలో మూడు సొరంగ మార్గాలున్నాయని చెప్పిన కెయిన్స్.. వీటిల్లో ఒకటి ప్రధానమైంది కాగా.. మిగిలిన రెండు చెరోవైపు వెంటిలేషన్ కోసం నిర్మించారని తెలిపారు. అయితే.. తాము దాడి చేస్తామని తెలిసి ఈ షాఫ్ట్ లపై కాంక్రీట్ ను వేశారని చెప్పారు.
ఈ క్రమంలో... ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కోసం ఏడు బి-2 స్టెల్త్ విమానాలు 14 బాంబులతో బయల్దేరాయని చెప్పారు. వీటిలో ముందుగా ఫోర్డోలో ప్రధానంగా ఉన్న మార్గంపై కాంక్రీట్ ను తొలగించేందుకు ఒకటి, తర్వాత అక్కడే మరో ఐదు బాంబులు వాడామన్నారు. ఇక మిగిలిన రెండు వెంటిలేషన్ సొరంగాలపై ఆరు బంకర్ బస్టర్లను ప్రయోగించినట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే ఎందుకైనా మంచిదని భావించి అదే ప్లేస్ లో మరొకటి ప్రయోగించినట్లు చెప్పారు. ఆ విధంగా ఫోర్డోపై మొత్తం 12 బంకరు బస్టర్లు వాడినట్లు తెలిపారు. ఇదే క్రమంలో.. నతాంజ్ అణు కేమ్రంపై రెండు జారవిడిచామని వెల్లడించారు.
