భారత్ కొత్త యుద్ధం ‘ఆపరేషన్ కెల్లర్’... రిజల్ట్ వచ్చేసింది!
ఈ సమయంలో తాజాగా జమ్మూకాశ్మీర్ లో "ఆపరేషన్ కెల్లర్" చేపట్టింది భారత్ సైన్యం. పక్కా సమాచారంతో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ లో రిజల్ట్ వచ్చిందని ఆర్మీ ప్రకటించింది.
By: Tupaki Desk | 13 May 2025 2:39 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జమ్మూకాశ్మీర్ లో "ఆపరేషన్ కెల్లర్" చేపట్టింది భారత్ సైన్యం. పక్కా సమాచారంతో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ లో రిజల్ట్ వచ్చిందని ఆర్మీ ప్రకటించింది.
అవును... పాక్ లో చివరి ఉగ్రవాది అంతమయ్యే వరకూ ఆపరేషన్ సిందూర్ ఆగదన్నట్లుగా చెబుతున్న భారత్.. ఈ క్రమంలో మరికొన్ని ఆపరేషన్స్ ని షురూ చేస్తుంది. ఇందులో భాగంగా... తాజాగా మంగళవారం పోషియన్ లోని జిన్ పథర్ కెల్లర్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది.
ఈ ఎన్ కౌంటర్ లో కనీసం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ ప్రకటించింది. అందులో ఒక ఉగ్రవాది స్థానిక నివాసి అయిన షాహిద్ అని గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ నుంచి వచ్చిన పక్కా నిఘా సమాచారం మేరకు సైన్యం ఎన్ కౌంటర్ స్థలం పేరు మీద "ఆపరేషన్ కెల్లర్"ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా స్పందించిన ఆర్మీ... రాష్ట్రీయ రైఫిల్స్ ఇచ్చిన పక్కా నిఘా సమాచారం ఆధారంగా ఇండియన్ ఆర్మీ ఒక సెర్చ్, విధ్వంస ఆపరేషన్ ప్రారంభించిందని.. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులకు సైన్యానికి జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించింది.
మరోవైపు... పహల్గాం దాడికి కారణమని భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులు.. ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హషీం మూసాల కోసం "టెర్రర్ ఫ్రీ కాశ్మీర్" పోస్టర్లను భద్రతా సంస్థలు ఏర్పాటు చేశాయి. పోషియన్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు అతికించబడ్డాయి. వీరికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు.