వెన్ను విరిగిన 'గన్ను'.. మావోయిస్టు కథ ముగిసినట్టే!
తాజాగా ఛత్తీగఢ్‌లోని మాధ్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన సీఆర్ పీఎఫ్ దళాల ఎదురు కాల్పుల్లో దాదాపు 27 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు.
By: Tupaki Desk | 21 May 2025 6:00 PM ISTగన్నుతోనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని.. సామాన్యులకు మేలు జరుగుతుందని నమ్మి.. ఉద్యమ బాట పట్టిన మావోయిస్టుల కథ దాదాపు పరిసమాప్తమైంది. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' దూకుడుకు మావోయిస్టు అగ్రనాయకులు ఒక్కొక్కరుగా కాదు.. పదుల సంఖ్యలోనే తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. తాజాగా ఛత్తీగఢ్‌లోని మాధ్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన సీఆర్ పీఎఫ్ దళాల ఎదురు కాల్పుల్లో దాదాపు 27 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు.
వీరిలో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కర్త,కర్మ,క్రియ అనదగిన రీతిలో మావోయిస్టులకు సారథ్యం వహించిన నంబాల కేశవరావు కూడా ఉండడంతో ఇక,మావోయిస్టులకు ఉనికి లేకుండా పోయిందని ఉద్యమ కారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో(మావోయిస్టులకు శత్రు దుర్బేధ్యంగా ఉన్న ప్రాంతం ) చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో కూడా.. దాదాపు 45 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు.
తాజా పరిణామంతో గన్నుకు వెన్ను విరిగిపోయిందని పలువురు ఉద్యమకారులు వ్యాఖ్యానిస్తున్నారు. ''ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇక, మావోయిస్టుల చరిత్ర.. అంతమైనట్టే'' అని హైదరాబాద్‌కు చెందిన ఓ మావోయిస్టు మాజీ ఉద్యమ కారుడు వ్యాఖ్యానించారు. అయితే.. మరోవైపు తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని చెబుతున్నా.. కేంద్రం పట్టించుకోకుండా.. ఎదురు కాల్పులు జరపడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి.
అయితే.. లొంగిపోవడం తప్ప.. వారితో చర్చలకు సమయం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. లొంగిపోయే అవకాశం ఉన్నా.. మావోయిస్టులు భీష్మించుకున్నారని.. అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం జరుగుతున్న 'ఆపరేషన్ కగార్' మావోయిస్టులను తుదముట్టించేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
