సద్దాం కోసం ఇజ్రాయెల్ "ఆపరేషన్ బ్రాంబుల్ బుష్"... 1992లో ఏమి జరిగింది?
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య సుమారు వారం రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Jun 2025 9:00 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య సుమారు వారం రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ యుద్ధం తీవ్ర మవుతోంది. మరోవైపు హాస్పటల్స్, జనావాసాలపై ఇరాన్ దాడులు చేస్తోందని.. ఇది యుద్ధ నేరమని.. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తోంది. ఈ సమయంలో సద్దాం ను గుర్తు చేసింది.
ఇందులో భాగంగా... ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఇరాన్ పాలకులు గుర్తుంచుకోవాలని ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. దీంతో... గతంలో ఇజ్రాయెల్ ను తీవ్ర ఇబ్బంది పెట్టిన సద్దాం హుస్సేన్ లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఓ ఆపరేషన్ తెరపైకి వచ్చింది. తాజాగా ఆ ఆపరేషన్ ను గుర్తుకు తెస్తున్నారు పరిశీలకులు.
అవును... సద్దాం పాలనలో ఇరాక్ పలుమార్లు ఇజ్రాయెల్ పై క్షిపణి ప్రయోగాలు చేసింది. దీంతో... 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత సద్దాం హుస్సేన్ ను ఇజ్రాయెల్ తమ దేశానికి పెనుముప్పుగా పరిగణించింది. వెంటనే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ రంగంలోకి దిగింది. భారీ విధ్వంసం కోసం ఆయన ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నారని గుర్తించింది.
వెంటనే... ఈ కీలక ఇజ్రాయెల్ మిలిటరీకి చేరవేసింది. దీంతో సద్దాం హుస్సేన్ ను ఎలాగైనా తొలగించాలని ఇజ్రాయెల్ ఫిక్సయ్యింది. అందుకు వసరమైన ప్రణాళికలు మొదలుపెట్టింది. దీనికి "ఆపరేషన్ బ్రాంబుల్ బుష్" అని పేరు పెట్టింది. ఇజ్రాయెల్ అత్యంత కీలకమైన కమాండో యూనిట్ అయిన 'సయెరెట్ మట్కల్' నేతృత్వంలో దీన్ని చేపట్టాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో... ఈ అత్యంత కీలకమైన ఆపరేషన్ లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు 1992 నవంబరు 5న 'సయెరెట్ మట్కల్' టీమ్.. లైవ్ ఫైర్ రిహార్సల్స్ చేపట్టింది. దీనికోసం నెగెవ్ ఎడారి ప్రాంతాన్ని ఎంచుకుంది. అయితే.. రిహార్సల్స్ సమయంలో పొరపాటు కారణంగా ఓ కమాండో పేల్చిన క్షిపణి సొంత సైనికుల ప్రాణాలు తీసింది.
దీంతో.. ఐదుగురు సైనికులు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దెబ్బతో "ఆపరేషన్ బ్రాంబుల్ బుష్"ను ఇజ్రాయెల్ రద్దు చేసింది. అయితే... కమాండోల మృతిని మాత్రం కొన్నేళ్ల పాటు ఇజ్రాయెల్ బయటకు వెల్లడించలేదు. ఇదే సమయంలో ఆపరేషన్ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచింది. ఆ తర్వాత ఇది బహిర్గతమవడంతో అంతర్గత దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన జరిగిన దాదాపు పదేళ్ల తర్వాత 2003లో ఓ అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్న సద్దాం హుస్సేన్ ను అమెరికా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. అనంతరం ఆయనపై పలు నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేశాయి! ఆ కేసుల విచారణలో అతడు దోషిగా తేలడంతో డిసెంబర్ 30 - 2006లో ఉరిశిక్ష అమలు చేశారు.
