Begin typing your search above and press return to search.

ఆపరేషన్ అజయ్ స్టార్ట్... ఈ రోజు ఫస్ట్ ఫ్లైట్ వచ్చే అవకాశం!

ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌ లైన్‌ లను ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 4:24 AM GMT
ఆపరేషన్  అజయ్  స్టార్ట్... ఈ రోజు ఫస్ట్  ఫ్లైట్  వచ్చే అవకాశం!
X

ఇజ్రాయెల్‌ సేనలు, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ ఈ యుద్ధం మరింత తీవ్రంగా జరుగుతుందని అంటున్నారు. మరోపక్క లెబనాన్‌, సిరియాలు సైతం ఇజ్రాయేల్ పై దాడి షురూ చేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ లో చిక్కుకున్న భారతీయులను మన దేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే... ఆపరేషన్ అజయ్!

అవును... ఇజ్రాయిల్‌, హమాస్ ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో... పరిస్థితి దారుణంగా తయారైంది. భారతీయ విద్యార్థులు పలువురు బంకర్లలో దాక్కున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. ఈ సమయంలో... ఇజ్రాయిల్‌ నుండి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఇండియా సిద్ధమైంది.

దీనికోసం ఆపరేషన్‌ అజయ్‌ ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ లో పోస్ట్‌ లో వెల్లడించారు. ఇజ్రాయేల్ లో చిక్కుకున్న భారత పౌరులను తిరిగి తీసుకురావడానికి చార్టర్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో గురువారం భారతీయులతో కూడిన మొదటి విమానం మన దేశానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌ లైన్‌ లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో... అక్కడి భద్రతా బలగాల సాయంతో ఆపరేషన్ అజయ్‌ ను నిర్వహిస్తున్నారు.

అవును... ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం హెల్ప్‌ లైన్‌ లను ఢిల్లీ, టెల్‌ అవీవ్‌, రమల్లాల్లో ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా... ఢిల్లీ కంట్రోల్‌ రూం నంబర్లు, ఈ మెయిల్‌ చిరునామా వివరాలు.. 1800 118 797 (టోల్‌ఫ్రీ), +91- 11 - 23012113, +91 - 11 - 23014104, +91 - 11 - 23017905, +91 99682 91988, situationroom@mea.gov.in

ఇక భారత రాయబార కార్యాలయాలు టెల్‌ అవీవ్‌, రమల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ వివరాలు +97235226748, +972543278392, cons1.telaviv@mea.gov.in... +970592916418, rep.ramallah@mea.gov.in