ఏఐ టాలెంట్‌కు ‘బంగారు’ కిరీటం.. సగటు వేతనం ₹13.4 కోట్లు!
ఒకప్పుడు సాఫ్ట్ వేర్ నౌకరీ అంటే లక్షల జీతాలు.. ప్లాట్లు, కార్లు.. లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అడ్రస్.
By: A.N.Kumar | 1 Jan 2026 5:00 AM ISTఒకప్పుడు సాఫ్ట్ వేర్ నౌకరీ అంటే లక్షల జీతాలు.. ప్లాట్లు, కార్లు.. లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అడ్రస్. అయితే టెక్నాలజీ మారింది. ఏఐ వచ్చేసింది. దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పిట్టల్లా రాలుతున్నాయి. దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. ఇదే సమయంలో ‘ఏఐ’ మేనియా ఇప్పుడు ప్రపంచమంతా మొదలైంది. చాట్ జీపీటీ మొదలుపెట్టిన ఈ ఏఐ సునామీ ఇతర కంపెనీలకు విస్తరించింది. ఏఐ టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కాసుల పంట కురిపిస్తోంది.
టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ నామస్మరణే వినిపిస్తోంది. అయితే ఈ ఏఐ విప్లవం కేవలం సాంకేతికతకే పరిమితం కాలేదు. ఉద్యోగుల జీతభత్యాల విషయంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. చాట్ జీపీటీ సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’ తన ఉద్యోగులకు ఇస్తున్న వేతన ప్యాకేజీలు చూస్తుంటే సామాన్యులే కాదు.. టెక్ దిగ్గజాలు సైతం నోరెళ్లబెడుతున్నారు.
రూ.13.4 కోట్ల సగటు ప్యాకేజీ!
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఓపెన్ ఏఐ లో పనిచేసే ఒక్కో ఉద్యోగి సగటున ఏడాదికి 1.5 మిలియన్ల డాలర్లు (రూ.13.48 కోట్లు) విలువైన వేతనాన్ని అందుకుంటున్నారు. ఇది కేవలం నగదు రూపంలోనే కాకుండా ప్రధానంగా స్టాక్ ఆధారిత వేతనం రూపంలో ఉండడం విశేషం. టెక్ స్టార్టప్ చరిత్రలో ఒక సంస్థ తన ఉద్యోగులకు ఈ స్థాయిలో సగటు ప్యాకేజీని ప్రకటించడం ఇదే తొలిసారి.
గూగుల్ రికార్డులు కనుమరుగు..
ఒకప్పుడు టెక్ రంగంలో అత్యధిక జీతాలు ఇచ్చే సంస్థగా గూగుల్ పేరొందింది. గూగుల్ తన ఐపీఓకి వెళ్లకముందు ఉద్యోగులకు ఇచ్చిన స్టాక్ ఆప్షన్లతో పోలిస్తే ప్రస్తుతం ఓపెన్ ఏఐ ఇస్తున్న ప్యాకేజీ 7 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దీనిని బట్టి చూస్తుంటే ఏఐ రంగంలో నిపుణులకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మెటా వర్సెస్ ఓపెన్ ఏఐ : టాలెంట్ కోసం యుద్ధం
ఈ భారీ ప్యాకేజీల వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ఏఐ టాలెంట్ కోసం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీ ఆఫర్లతో ఓపెన్ ఏఐ ఇంజనీర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఏఐ రంగంలో అత్యున్నత నైపుణ్యం కలిగిన రీసెర్చర్లు, డెవలపర్లు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నవారినే కాపాడుకోవడానికి ఓపెన్ ఏఐ ఈ ‘గోల్డెన్ హ్యాండ్ షేక్’ మంత్రాన్ని అనుసరిస్తోంది. ‘ఏఐ టాలెంట్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వనరుగా మారింది. నైపుణ్యం ఉన్న ఒక్కో ఇంజినీర్ విలువ వందల కోట్లకు చేరింది’ అని విశ్లేషకులు అంటున్నారు.
వేతనం కాదు.. భవిష్యత్తులో భాగస్వామ్యం
ఓపెన్ ఏఐ తన ఉద్యోగులకు ఇస్తున్న స్టాక్ ప్యాకేజీలు వారిని కేవలం జీతగాళ్లుగా కాకుండా.. సంస్థ ఎదుగుదలలో భాగస్వాములను చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏఐ రంగం మరింత విస్తరిస్తే.. ఈ స్టాక్స్ విలువ పదింతలు అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రూ.13 కోట్లుగా కనిపిస్తున్న సగటు ప్యాకేజీ.. భవిష్యత్తులో ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చే అవకాశం ఉంటుంది.
మొత్తానికి ఓపెన్‌ఏఐ సృష్టించిన ఈ రికార్డు టెక్ ఇండస్ట్రీకి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. రాబోయే కాలంలో ఏ కంపెనీ విజయాన్నైనా నిర్ణయించేది వారి దగ్గర ఉన్న సర్వర్లు కాదు.. వారి దగ్గర ఉన్న ఏఐ మేధావులే అని స్పష్టమవుతోంది.
