వెబ్‌సైట్ల హ్యాకింగ్.. ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఆపేసిన ఓపెన్ ఏఐ
ఏఐ ఏజెంట్ల ప్రవర్తనపై వస్తున్న వరుస నివేదికల నేపథ్యంలో ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఏఐ మోడళ్ల ట్రైనింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
By: A.N.Kumar | 27 Sept 2026 4:53 PM ISTమనకు పని చేసి పెట్టాల్సిన ఏఐ.. ఇప్పుడు తనంతట తానే పనులు చేస్తే..? వెబ్‌సైట్లలోకి చొరబడే స్థాయికి ఏఐ ఏజెంట్లు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఏఐ ఏజెంట్ల ప్రవర్తనపై వస్తున్న వరుస నివేదికల నేపథ్యంలో ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఏఐ మోడళ్ల ట్రైనింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆదేశాలు దాటి అడుగులు..
ఏఐ ఏజెంట్లను ఒక నిర్దిష్ట పని పూర్తి చేయడానికి రూపొందిస్తారు. అయితే తాజాగా కొన్ని సందర్భాల్లో అవి అప్పగించిన పనిని దాటి అదనపు చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది. ముఖ్యంగా వెబ్‌సైట్లను యాక్సెస్ చేయడం.. ఊహించని విధంగా వ్యవహరించడం వంటి పరిణామాలు ఏఐ భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఆస్ట్రేలియా, అమెరికా ప్రభుత్వాలకు సంబంధించిన వెబ్‌సైట్లను ఏఐ ఏజెంట్లు యాక్సెస్ చేసిన ఘటనలు ఈ ఆందోళనలను మరింత పెంచాయి. అయితే ప్రజలకు అందుబాటులో లేని అత్యంత సున్నితమైన సమాచారం లేదా విలువైన రహస్య డేటాను ఏఐ ఏజెంట్లు సేకరించలేదని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారాన్నే యాక్సెస్ చేసినట్లు తెలిపింది.
‘ముందు భద్రత.. తర్వాతే అభివృద్ధి’
ఏఐ మోడళ్ల సామర్థ్యాలను పెంచడంలో పోటీ పడుతున్న సంస్థలకు ఇప్పుడు మరో పెద్ద సవాలు ఎదురైంది. మోడల్ ఎంత శక్తివంతంగా ఉంటే అంతే స్థాయిలో దాని చర్యలను నియంత్రించే భద్రతా వ్యవస్థలు కూడా ఉండాలనే వాదన బలపడుతోంది. ఈ నేపథ్యంలో అదనపు సెక్యూరిటీ ఫీచర్లు సమర్థంగా పనిచేస్తున్నాయనే నమ్మకం కలిగే వరకు ట్రైనింగ్‌ను తిరిగి ప్రారంభించబోమని ఓపెన్ ఏఐ చెబుతోంది. ఇటీవల ఏఐ మోడళ్లు ఊహించని రీతిలో వ్యవహరించిన ఘటనలను కూడా సంస్థ సమీక్షిస్తోంది.
మూడు నెలల్లో రెండోసారి..
ఇది ఓపెన్ ఏఐకి సాధారణ నిర్ణయం కాదు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏఐ మోడళ్ల అభివృద్ధి ప్రక్రియను నిలిపివేయడం ఇది రెండోసారి. జులైలో ఏఐ స్టార్టప్ హగ్గింగ్ ఫేస్ ను ను ఏఐ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించిన నేపథ్యంలోనూ ఓపెన్ ఏఐ కొంతకాలం ట్రైనింగ్‌ను నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది.
ఏఐ కి స్వేచ్ఛ ఎంత వరకు?
ఏఐ అభివృద్ధి ఇప్పటివరకు “మరింత తెలివైన మోడల్” అనే దిశలో సాగింది. కానీ ఏఐ ఏజెంట్ల రాకతో ప్రశ్న మారుతోంది. “మోడల్ ఎంత తెలివైనది?” కంటే “దానికి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి?” అనేదే కీలకంగా మారుతోంది. ఒక వెబ్‌సైట్‌ను చదవడం, సమాచారాన్ని సేకరించడం వంటి సాధారణ పనుల నుంచి.. ఇతర వ్యవస్థలను యాక్సెస్ చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వరకు ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలు విస్తరిస్తున్నాయి. అదే సమయంలో వాటి చర్యలను ముందుగానే అంచనా వేయడం కష్టమవుతోంది.
చట్టసభల ఒత్తిడి
ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా వ్యవహరించడం, వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం, గోప్యత గల సమాచారాన్ని బహిర్గతం చేసే అవకాశం వంటి అంశాలపై అమెరికా చట్టసభ సభ్యులు ఇప్పటికే ఏఐ కంపెనీలపై భద్రతా చర్యలు పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. ఓపెన్ ఏఐ ప్రత్యర్థి ఆంథ్రోపిక్ కు చెందిన నిపుణులు సైతం ఏఐ అభివృద్ధికి అవసరమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
అసలు సమస్య ఇప్పుడు ఇదే..
ఏఐని మరింత శక్తివంతంగా తయారు చేయడం సాంకేతికంగా సాధ్యమవుతోంది. కానీ ఆ శక్తిని ఎక్కడ ఆపాలి? ఏ పని చేయడానికి అనుమతించాలి? ఏ పనిని పూర్తిగా నిషేధించాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవు. అందుకే ఓపెన్ ఏఐ తాజా నిర్ణయం కేవలం ట్రైనింగ్ నిలిపివేతగా చూడాల్సిన విషయం కాదు. ఏఐ అభివృద్ధిలో “వేగం కంటే భద్రత” అనే కొత్త దశ మొదలైందనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది.
రేపటి ఏఐ మరింత తెలివిగా ఉండొచ్చు. కానీ అది ఎంత తెలివిగా ఉన్నా.. మన ఆదేశాల పరిధిలోనే పనిచేసేలా చేయగలమా? అనేదే అసలు పరీక్ష.
