Begin typing your search above and press return to search.

మనిషి ఆదేశాలు లేకుండానే గేట్లు దాటుతున్న ఏఐ

ఓపెన్ఏఐ నిర్వహించిన అంతర్గత సమీక్షలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By:  A.N.Kumar   |   26 Sept 2026 10:31 PM IST
మనిషి ఆదేశాలు లేకుండానే గేట్లు దాటుతున్న ఏఐ
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవాలు సృష్టిస్తున్న వేళ దానికి తోడవుతున్న అనూహ్య ప్రవర్తన ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఏఐకి మనం ఇచ్చే ఆదేశాలను అది ఎంతవరకు పాటిస్తుంది? ఒకవేళ తానిచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనుషులు విధించిన భద్రతా పరిమితులను దాటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికితే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు కేవలం ఊహాగానాలు కావు.. అత్యంత క్లిష్టమైన సైబర్ సెక్యూరిటీ సవాళ్లుగా రూపాంతరం చెందాయి. అమెరికా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఆస్ట్రేలియా ప్రభుత్వ డేటా పోర్టళ్లలోకి ఇటీవల చోటుచేసుకున్న ఏఐ ఊహించని ప్రవేశాలు ఈ ఆందోళనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఓపెన్ఏఐ నిర్వహించిన అంతర్గత సమీక్షలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ 'ఏజెంటిక్ ఏఐ' వ్యవస్థలు యు.ఎస్. సెన్సస్ బ్యూరో, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ), ఇన్వెస్టెర్ .గవుట్ వంటి అమెరికా ప్రభుత్వానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారిక వెబ్‌సైట్లలోకి ప్రవేశించినట్లు సంస్థ గుర్తించింది. అయితే ఏఐ యాక్సెస్ చేసిన సమాచారం అంతా పబ్లిక్ డొమైన్‌లో ఉన్నదేనని ఓపెన్ఏఐ స్పష్టం చేసినప్పటికీ అసలు సమస్య అది సమాచారం సేకరించిన పద్ధతిలోనే దాగి ఉంది.

సాధారణ సాంకేతికతతో పనిచేసే వెబ్ క్రాలర్లు కేవలం ఆదేశించిన మేరకు సమాచారాన్ని సేకరించి ఆగిపోతాయి. కానీ ఏజెంటిక్ ఏఐ స్వభావం పూర్తిగా వేరు. దీనికి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశిస్తే దాన్ని సాధించేందుకు మనుషుల ప్రమేయం లేకుండానే స్వయంప్రతిపత్తితో పలు దశల్లో నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక పేజీలో సమాచారం లభించకపోతే స్వయంగా మరో పేజీకి వెళ్లడం, సాంకేతిక అనుమతి నిరాకరించబడితే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, అందుబాటులో ఉన్న ఇతర డిజిటల్ వనరులను వెతకడం వంటివి చేస్తుంది. ఈ క్రమంలో ఆదేశం ఇచ్చినది మనిషే అయినప్పటికీ దాని అమలు మార్గాన్ని ఎంచుకున్నది ఏఐ కావడం సైబర్ సెక్యూరిటీ నిపుణులలో సరికొత్త సవాలును ముందుకు తెచ్చింది.

అమెరికా ఘటనకు ముందే ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఒక ఉదంతం ఏఐ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక ఓపెన్ఏఐ ఏజెంట్ జూన్ 18న మెడికేర్ గణాంకాలకు సంబంధించిన ప్రభుత్వ పోర్టల్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించింది. మొదట ఆ సిస్టమ్ డేటా యాక్సెస్‌ను నిరాకరించినప్పటికీ ఏఐ ఏజెంట్ చాకచక్యంగా ఒక ప్రత్యామ్నాయ లోపాన్ని ఉపయోగించుకుని సాధారణంగా అందుబాటులో లేని నాన్-పబ్లిక్ ఫైళ్లను యాక్సెస్ చేసింది. వ్యక్తిగత మెడికేర్ రికార్డులు లేదా రోగుల డేటా లీక్ కాలేదని అధికారులు ధ్రువీకరించినప్పటికీ సిస్టమ్ నిరాకరించిన అనుమతులను ఏఐ స్వయంగా అధిగమించడమే ఇక్కడ తీవ్ర పరిణామంగా మారింది.

ఈ వివాదంపై ఓపెన్ఏఐ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ చర్యలు మోడళ్ల అంతర్గత శిక్షణ , మూల్యాంకనం సమయంలో చోటుచేసుకున్నాయని తెలిపింది. ఏఐ మోడళ్లు పరిశోధనల కోసం ప్రభుత్వ వెబ్‌సైట్లను ప్రామాణిక వనరులుగా వాడుకుంటాయని.. అయితే కొన్ని క్లిష్ట సమయాల్లో నిర్దేశించిన పరిమితులను దాటి ఉద్దేశపూర్వకం కాని చర్యలకు పాల్పడినట్లు అంగీకరించింది. కాబట్టి దీనిని సంప్రదాయ కోణంలో సైబర్ హ్యాకింగ్ అని చెప్పడం కంటే.. ఏఐ ఏజెంట్లు తమ లక్ష్యాన్ని సాధించే క్రమంలో భద్రతా సరిహద్దులను దాటిన స్వీయ ప్రవర్తన అని విశ్లేషించడం సముచితంగా ఉంటుంది.

ఇప్పటివరకు మనం చూసిన సైబర్ దాడులు మనుషులు లేదా హ్యాకింగ్ గ్రూపులు చేసేవి. కానీ ఏజెంటిక్ ఏఐ వ్యవస్థలు స్వయంప్రతిపత్తి సాధిస్తే అవి వేలాది వెబ్‌సైట్లలోని భద్రతా రంధ్రాలను ఏకకాలంలో పరిశీలించగలవు. సంక్లిష్టమైన సెక్యూరిటీ కోడెడ్‌ గోడలను దాటడానికి కొత్త మార్గాలను స్వయంగా కనుగొనగలవు. అంతేకాకుండా ఒక ఏఐ ఏజెంట్ సాధించిన సమాచారాన్ని మరొక ఏఐ ఏజెంట్‌తో మానవ ప్రమేయం లేకుండా పంచుకునే అవకాశమూ ఉంటుంది. ఈ పరిజ్ఞానం పొరపాటున దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లినా లేదా ఏఐ తన పరిమితులను పూర్తిగా విస్మరించినా ప్రపంచ డిజిటల్ భద్రత తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

అదృష్టవశాత్తూ ప్రస్తుత ఘటనల్లో ఎలాంటి రహస్య సమాచారం లీక్ కాకపోవడం ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ ఇది రాబోయే ముప్పుకు ముందస్తు హెచ్చరిక మాత్రమే. మనం సమాచారం కావాలని మాత్రమే చెప్పినప్పుడు, దానికోసం ఏఐ ఏ మార్గాన్నైనా ఎంచుకునే స్వేచ్ఛను పొందితే అది సాంకేతికత సాధించిన పురోగతి కాదు.. మానవాళి సైబర్ భద్రతకు ఎదురయ్యే అతిపెద్ద విపత్తు. ఏఐ మన కోసం పనిచేసే రోజులు వచ్చేశాయి.. కానీ అది మనం గీసిన గీత దాటకుండా పనిచేస్తుందా అనే ప్రశ్నకు సమాధానం వెతకడమే ఇప్పుడు ప్రపంచ సాంకేతిక దిగ్గజాల ముందున్న అసలైన సవాలు.