ఏఐ చేతిలో హ్యాకింగ్.. ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి ఓపెన్ ఏఐ ఏజెంట్ ఎలా వెళ్లింది?
ఈ ఘటన జూన్‌లో జరిగినప్పటికీ.. సెప్టెంబర్‌లోనే ప్రభుత్వానికి సమాచారం అందడం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది.
By: A.N.Kumar | 24 Sept 2026 1:50 PM ISTఒక రీసెర్చ్ టాస్క్.. కొన్ని ఆదేశాలు.. కానీ చివరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి అనధికార ప్రవేశం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత శక్తివంతంగా మారుతోందో చెప్పడానికి ఆస్ట్రేలియాలో జరిగిన తాజా ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. ఓపెన్ ఏఐకి చెందిన ఓ ఏఐ ఏజెంట్ ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ప్రధాని ఆంథనీ అల్బనీస్ వెల్లడించారు. ఈ ఘటన జూన్‌లో జరిగినప్పటికీ.. సెప్టెంబర్‌లోనే ప్రభుత్వానికి సమాచారం అందడం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది.
అసలు ఏం జరిగింది?
ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 18న ఓపెన్ ఏఐకి చెందిన ఓ ఏఐ ఏజెంట్ ఆస్ట్రేలియాలో ప్రజా వైద్య ఖర్చులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పరిశోధనలో భాగంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించింది. ఈ క్రమంలో మెడికేర్ స్టాటిస్టిక్స్ రిపోర్టింగ్ సర్వీసెస్ పోర్టల్ ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించింది.
మొదట సాధారణ మార్గాల్లో సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించిన ఏఐ ఏజెంట్‌కు కొన్ని చోట్ల యాక్సెస్ నిరాకరించబడింది. అయితే అక్కడితో ఆగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయత్నించడంతో.. చివరకు పోర్టల్‌లోని కొన్ని పబ్లిక్, నాన్-పబ్లిక్ ఫైళ్లను యాక్సెస్ చేసినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.
ఇక్కడే ఈ ఘటనలో అసలు ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. ఏఐకి ఇచ్చిన పని హ్యాకింగ్ కాదు. కానీ సమాచారాన్ని పొందాలనే లక్ష్యంతో అది అనుమతులు నిరాకరించబడిన తర్వాత మరో మార్గాన్ని ఎంచుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని ‘మిస్‌అలైన్డ్ బిహేవియర్’గా పేర్కొంది.
వ్యక్తిగత ఆరోగ్య సమాచారం లీక్ కాలేదు
ఈ ఘటన వినగానే ఆస్ట్రేలియాలోని కోట్లాది ప్రజల వ్యక్తిగత ఆరోగ్య వివరాలు ప్రమాదంలో పడ్డాయా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వం, ఓపెన్ ఏఐ రెండూ చెబుతున్నాయి. యాక్సెస్ అయిన పోర్టల్‌లో ప్రధానంగా సమగ్ర ఆరోగ్య గణాంకాలు, మెడికేర్, ఔషధాల వినియోగం వంటి వ్యక్తులను నేరుగా గుర్తించలేని సమాచారం ఉంది. వ్యక్తిగత మెడికేర్ రికార్డులు యాక్సెస్ అయినట్లు ఆధారాలు లేవని ఓపెన్ ఏై తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వ్యక్తిగత సమాచారం ప్రభావితమైనట్లు ఆధారాలు లేవని చెబుతోంది.
అసలు ఆందోళన ఇక్కడే..
డేటా నష్టం పరిమితంగానే ఉన్నప్పటికీ.. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడానికి కారణం వేరే ఉంది. ఒక ఏఐ ఏజెంట్‌కు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి, తనకు ఎదురైన డిజిటల్ అడ్డంకులను దాటి అనధికార మార్గంలోకి వెళ్లగలిగితే.. భవిష్యత్తులో మరింత సున్నితమైన వ్యవస్థల విషయంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ప్రభుత్వాలు, ఏఐ సంస్థల ముందుంది. ఏబీసీ విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుత ఘటన ప్రభావం పరిమితమైనదే అయినప్పటికీ భవిష్యత్తులో ఏఐ ఆధారిత సైబర్ దాడులకు ఇది ఒక హెచ్చరికగా చూడాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.
మూడు నెలల ఆలస్యం ఎందుకు?
ఈ ఘటనలో మరో కీలక అంశం నోటిఫికేషన్ ఆలస్యం. జూన్‌లో ఘటన జరగగా.. ఓపెన్ ఏఐ ఆగస్టులో ఈ ‘మిస్‌అలైన్డ్ మోడల్ యాక్టివిటీ’ గురించి తెలుసుకున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు చెబుతున్నారు. అయితే సర్వీసెస్ ఆస్ట్రేలియాకు సెప్టెంబర్ 10న మాత్రమే సమాచారం అందింది. అది కూడా సాధారణంగా పరిశోధకులు లేదా ఇతరులు భద్రతా లోపాలను తెలియజేయడానికి ఉపయోగించే ఒక పబ్లిక్ డిస్క్లోజర్ ఈమెయిల్ ద్వారా వచ్చింది.
ఈ ఆలస్యంపైనే ప్రధాని అల్బనీస్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌తో మాట్లాడారు. ఘటనపై ఆస్ట్రేలియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి సమాచారం అందించడానికి ఇంత సమయం పట్టడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏఐకి ఇక కొత్త నియమాలు అవసరమా?
ఈ ఘటన జరిగిన సమయంలోనే ఏఐ భద్రత, నియంత్రణలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏఐకి సంబంధించి అంతర్జాతీయ రక్షణ ప్రమాణాల అవసరంపై పలు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ వ్యవస్థలో ఏఐ ఏజెంట్ అనధికార ప్రవేశం చేయడం ఆ చర్చకు మరింత ప్రాధాన్యత తెచ్చింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించింది. ఆస్ట్రేలియన్ సిగ్నల్స్ డైరెక్టరేట్ సహకారంతో మరిన్ని ప్రభుత్వ వ్యవస్థలు ప్రభావితమయ్యాయా.. అసలు ఏఐ ఏజెంట్ ఎలా ఈ స్థాయి యాక్సెస్ సాధించింది, ప్రభుత్వ వ్యవస్థల్లో ఎలాంటి భద్రతా లోపాలు ఉన్నాయి అనే అంశాలను పరిశీలిస్తోంది.
ఇప్పటివరకు ఇది భారీ డేటా చోరీ ఘటనగా నిర్ధారణ కాలేదు. కానీ ఏఐకి ఇచ్చిన సాధారణ పరిశోధన పనిలోనే అది అనుమతులు లేని మార్గాన్ని ఎంచుకోవడం మాత్రం భవిష్యత్తు ఏఐ సెక్యూరిటీకి కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతోంది.
ఏఐ ఇక కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టెక్నాలజీ మాత్రమే కాదు.. వెబ్‌లో స్వయంగా చర్యలు తీసుకునే ఏజెంట్లుగా మారుతున్న సమయంలో వాటికి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి? ఎక్కడ ఆపాలి? ఆపినప్పుడు అవి నిజంగా ఆగుతాయా? ఆస్ట్రేలియా ఘటన ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
