16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ విజేత.. 15 రోజుల్లోనే మిస్ వరల్డ్ బరిలో థాయ్‌లాండ్ సుందరి!
ప్రపంచవ్యాప్తంగా అందం, వ్యక్తిత్వానికి పట్టం కట్టే 72వ మిస్ వరల్డ్ - 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 10:30 PMప్రపంచవ్యాప్తంగా అందం, వ్యక్తిత్వానికి పట్టం కట్టే 72వ మిస్ వరల్డ్ - 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో3 దాదాపు 120 దేశాల నుండి అందమైన యువతులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ 2025గా ఎన్నికైన ఓపాల్ సుచాత చువాంగ్ శ్రీ ఇటీవల హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణం సింఘానియాస్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తన 'ఓపాల్ ఫర్ హెర్' అనే సామాజిక బాధ్యత కార్యక్రమానికి మద్దతుగా ఆమె సింఘానియాస్ ప్రత్యేక చీరలు, లెహంగాలను ధరించారు. ఈ సందర్భంగా తన స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని, మిస్ వరల్డ్ పోటీల కోసం తక్కువ సమయంలో ఎలా సిద్ధమయ్యారో మీడియాతో పంచుకున్నారు.
ఓపాల్ సుచాత కేవలం అందాల పోటీదారు మాత్రమే కాదు.. ఆమె ఒక నిజమైన పోరాట యోధురాలు. కేవలం 16 సంవత్సరాల వయస్సులో ఆమె ప్రాణాంతకం కానప్పటికీ, రొమ్ము కణితితో బాధపడ్డారు. ఆ సమయంలో ఆమె అనుభవించిన భయం ఆమెపై తీవ్రమైన ప్రభావం చూపాయి. అయితే, ఓపాల్ ఆ కష్టాన్ని అధిగమించి తన అనుభవాన్ని ఇతరులకు సహాయం చేసే శక్తిగా మార్చుకున్నారు. 'ఓపాల్ ఫర్ హెర్' అనే పేరుతో ఆమె ఒక దేశవ్యాప్త రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆమె ప్రజలకు విద్య, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యత, ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని అందిస్తున్నారు. సమాజంలో నెలకొన్న అపోహలు, అవగాహన లేకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది మహిళలు తమ సమస్యలను బయటకు చెప్పడానికి వెనుకాడుతున్నారని ఆమె గ్రహించారు.
మిస్ థాయ్‌లాండ్‌గా ఎన్నికైన తర్వాత మిస్ వరల్డ్ వేదికకు సిద్ధం కావడానికి ఆమెకు కేవలం 15 రోజులు మాత్రమే సమయం దొరికింది. ఇది నిజంగా ఒక అద్భుతం అని ఆమె భావిస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద అవకాశం రావడం తన అదృష్టమని ఆమె అన్నారు. మిస్ వరల్డ్ వేదికపై విజయం సాధించడమే తన దేశానికి తాను ఇచ్చే గొప్ప బహుమతి అని ఆమె దృఢంగా నమ్ముతున్నారు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో పుట్టి పెరిగిన ఓపాల్, అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం ఆమె బ్యాంకాక్‌కు వచ్చారు. అక్కడి నుంచే ఆమె ఫ్యాషన్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
16 ఏళ్ల వయస్సులో రొమ్ము కణితికి శస్త్రచికిత్స చేయించుకున్న అనుభవం ఆమెకు ఉంది. ఆ సమయంలో ఆమె అనుభవించిన బాధ, ఆందోళన ఆమెను రొమ్ము క్యాన్సర్ పట్ల మరింతగా అవగాహన పెంచుకునేలా చేశాయి. అందుకే ఆమె తన 'ఓపాల్ ఫర్ హెర్' కార్యక్రమం ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోవడం ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెబుతున్నారు. ఈ మహమ్మారిపై అవగాహన కల్పించడమే తన జీవిత లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. మిస్ థాయ్‌లాండ్‌గా తనకున్న వేదికను ఉపయోగించి, ఆమె తన స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇలాంటి సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. థాయ్ ప్రజలకు స్ఫూర్తినిస్తూ, ప్రపంచానికి సేవ చేయాలనేదే ఆమె ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో ఆమె తల్లి ఆమెకు గొప్ప స్ఫూర్తిగా నిలిచారు.