Begin typing your search above and press return to search.

మీకు ఇలాంటి ఫోన్ రావొచ్చు.. అస్సలు టెన్షన్ పడొద్దు

తాజాగా వెలుగు చూసిన ఒక మోసం. .దానికి ఒక మహిళా ఐటీ ఇంజనీర్ బాధితురాలిగా మారిన వైనం చూస్తే అయ్యో అనిపించకమానదు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:25 AM GMT
మీకు ఇలాంటి ఫోన్ రావొచ్చు.. అస్సలు టెన్షన్ పడొద్దు
X

గతంలో ఒక ఊళ్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారంటే.. ఊరు ఊరంతా ఏకమయ్యేది. విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని.. మరోసారి ఊళ్లోకి దొంగల్ని రాకుండా కావలి కాసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇళ్లకు కన్నం వేసి.. దోచుకోవాల్సిన అవసరం లేదు. పెరిగిన సాంకేతికత.. అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఫోన్ పుణ్యమా అని.. అంచనాలకు అందని రీతిలో మోసాలు చేయటం.. భయపెట్టటం.. బెదిరింపులకు పాల్పడటం.. చేయని నేరాల్ని చేసినట్లుగా గద్దించటం లాంటివి చేస్తూ.. బలవంతంగా డబ్బులు కొల్లగొడుతున్న వైనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక ఉదంతం చూసినప్పుడు.. అయ్యో అనిపించకమానదు. అయితే.. ఈ తరహా మోసాలు చాలామందికి ఎదురుకావొచ్చు. ఎవరి దాకానో ఎందుకకు.. దీన్ని చదువుతున్న మీకు కూడా ఎదురుకావొచ్చు. కాకుంటే.. అలాంటి పరిస్థితుల్లో అస్సలు తగ్గకుండా.. ధీటుగా ప్రశ్నలు వేయటం.. ఆ వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వటం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయటమే కాదు.. నేరస్తులకు చుక్కలు చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉంది.

తమ అతితెలివితో మోసాలకు పాల్పడుతున్న వారికి అవగాహనతో ప్రజలు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. తాజాగా వెలుగు చూసిన ఒక మోసం. .దానికి ఒక మహిళా ఐటీ ఇంజనీర్ బాధితురాలిగా మారిన వైనం చూస్తే అయ్యో అనిపించకమానదు. అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో తన పని తాను చేసుకుంటున్న ఉద్యోగినికి ఒక ఫోన్ వచ్చింది. అవతల వైపు గొంతు కఠినంగా ఉంది. 'మీరు.. మేఘనా దుబే కదూ?' అంటూ నిలదీసినట్లుగా ప్రశ్నించటంతో ఆమె ఒక్కసారిగా తత్తరపాటుకు గురైంది. తనతో అలా ఎవరూ అలా మాట్లాడలేదు అంతకు ముందెప్పుడు.

'నేను ముంబయి సైబర్ పోలీసు ఆఫీసర్ ను మాట్లాడుతున్నా. మీపై మేం నిగా పెట్టాం. తైవాన్ నుంచి ఎండీఎంఏ మాదకద్రవ్యాలు కొరియర్ లో తెప్పించుకున్నది మీరేనా?' అంటూ దబాయించారు. ఈ మాటతో ఆమె గుండె జారిపోయింది. తానేంటి? డ్రగ్స్ నేరంలో చిక్కుకుపోవటం ఏమిటన్న టెన్షన్ లో.. 'సర్.. నేను అలా చేయలేదు' అని ప్రాధేయపడే ధోరణిలో మాట్లాడుతుండగా.. ఆమెను తమ మాటలతో మరింతగా బెదరగొట్టేశారు.

ఆ కొరియర్ మీరే బుక్ చేశారన్న దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. వైట్ ఫీల్డ్ లో ఉంటున్న మీ పేరు మీదనే ఆ పార్సిల్ వచ్చింది.. స్కైప్ యాప్ ద్వారా మీ బెంగళూరు సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేస్తాం.. వారొచ్చి మిమ్మల్ని జైలుకు తీసుకెళతారు.. అంటూ ఇష్టారాజ్యంగా బెదిరించేయసాగాడు. దీంతో.. షాక్ తిన్న ఆమె.. భయపడిపోతూ.. తాను ఆ తప్పు చేయలేదని.. ఆ కేసు నుంచి బయటపడే మార్గం చెప్పాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన అవతల వ్యక్తి.. చూస్తుంటే మీరు అమాయకుల్లా ఉన్నారు. తక్షణం రిజర్వు బ్యాంక్ లో రూ.3.46 లక్షలు డిపాజిట్ చేయండి.. కేసును మేం విచారించి.. మీ తప్పు లేదని రిపోర్టు రాసేస్తామని పేర్కొన్నారు. ఆమెకు ఒక అకౌంట్ నెంబరు ఇచ్చి అందులో డబ్బులు వేయాలని కోరారు. దీనికి ఆమె సరేనంటూ డిపాజిట్ చేసిన తర్వాత ఫోన్ చేస్తే.. అది పని చేయటం మానేసింది. చివరకు తాను డబ్బు పోగొట్టుకున్న విషయం అర్థమై..వైట్ ఫీల్డ్ లో ఉన్న సైబర్ పోలీసుల్ని సంప్రదించగా.. మీరెలా మోసపోయారు మేడమ్ అనటంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది.

చాలామంది దీన్ని చదివిన తర్వాత అంత అమాయకంగా ఎందుకు మోసపోతారు? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి.. ఆలోచించే అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తుంటారు. ఈ తరహా ఫోన్లు కాకుంటే మరో కథను చెప్పి మిమ్మల్ని బోల్తా పడేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఫోన్లకు అస్సలు స్పందించొచ్చు.అస్సలు ఆగం కావొద్దు. కూల్ గా ఉండి.. ధీటుగా బదులిచ్చి.. ఆ వెంటనే మీరు మీకు దగ్గర్లోఉన్న పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి. అంతే తప్పించి.. మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మోసగాళ్లకు ఇవ్వొద్దు. అంతేకాదు.. సైబర్ నేరస్తులు ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ లో పడేసే ప్రయత్నం చేస్తే.. ఆ వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలి. అంతేకాదు.. https://cybervolunteer.mha.gov.in/webform/Volunteer_AuthoLogin.aspx ఈ లింకులో కంప్లైంట్ కూడా చేసే వీలుంది. సో.. బీకేర్ ఫుల్.