ఓ అధికారి కుమార్తె హత్య కేసులో బయటపడ్డ ఆన్‌లైన్ గేమింగ్ చీకటి కోణాలు!
చదువులో మంచి మార్కులు సాధించిన యువకుడు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.
By: Tupaki Desk | 24 April 2026 4:11 PM ISTచదువులో మంచి మార్కులు సాధించిన యువకుడు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఢిల్లీలోని అమర్ కాలనీలో జరిగిన ఈ ఘటన వింటుంటే.. ఆన్‌లైన్ గేమ్స్, అప్పుల ఊబి ఒక మనిషిని ఎంతటి క్రూరత్వానికి నెట్టగలవో అర్థం చేసుకోవచ్చు. ఒతన కుటుంబం, బంధువులకు గర్వకారణంగా ఉన్న రాహుల్ (23) నేడు దేశం అసహ్యించుకునే నేరస్తుడిగా నిలబడ్డాడు. టెన్త్‌లో 73 శాతం, ఇంటర్ లో 90 శాతం మార్కులు సాధించిన తెలివైన విద్యార్థి, కిరాతక హంతకుడిగా మారడం వెనుక ఉన్న చీకటి ప్రస్థానం వెలుగులోకి వచ్చింది. ఒక సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై లైంగిక దాడి చేసి, ప్రాణాలు తీసిన ఈ ఉదంతం కేవలం ఒక నేరం మాత్రమే కాదు.., అది ఒక తరం పెడదారి పడుతున్న తీరుకు నిదర్శనం.
మేధావి నుంచి హంతకుడిగా..
రాహుల్ నేపథ్యం పరిశీలిస్తే ఎవరూ అతను ఇంతటి ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుకోరు. 12వ తరగతిలో 90 శాతం మార్కులు సాధించడం అంటే అది సామాన్య విషయం కాదు. కానీ, అదే సమయంలో అతనికి ఆన్‌లైన్ గేమింగ్, జూదం అలవాటైంది. తీన్ పత్తి, లూడో వంటి ఆన్‌లైన్ ఆటలకు బానిసైన రాహుల్, వాటి కోసం తన మార్కు షీట్‌ను సైతం కుదువ పెట్టాడంటే అతని వ్యసనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లోని ఫోన్లు, బైక్, ఇతర సామాన్లు అమ్మి జూదంలో పోగొట్టాడు.
హత్య వెనుక కుట్ర..
జూదంలో లక్షల రూపాయలు పోగొట్టుకున్న రాహుల్, అప్పులు తీర్చలేక మళ్లీ ఢిల్లీ బాట పట్టాడు. గతంలో ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనిమనిషిగా పనిచేసిన రాహుల్, అక్కడ డబ్బులు దొంగిలిస్తున్నాడని, అప్పులు అడుగుతున్నాడని యజమాని అతడిని ఉద్యోగం నుంచి తొలగించాడు. దీంతో పగ పెంచుకున్న యువకుడు మే 22, 2026 ఉదయం, ఆ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి ప్రవేశించాడు. యూపీఎస్సీకి సిద్ధమవుతున్న సదరు అధికారి కుమార్తెను పాశవికంగా హింసించాడు. లైంగిక దాడికి పాల్పడి, మొబైల్ ఛార్జింగ్ వైరుతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఇంట్లోని రూ. 2.5 లక్షల నగదు, బంగారం ఎత్తుకెళ్లాడు.
ఆన్‌లైన్ గేమ్స్.. ఒక సైలెంట్ కిల్లర్..!
ఈ కేసులో ప్రధానంగా చర్చించాల్సిన అంశం ‘ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం’. యువత తమ మెదడును ఆన్‌లైన్ జూదానికి తాకట్టు పెడుతున్నారు. గెలవాలనే తపనతో మొదలయ్యే ఈ ప్రయాణం, చివరకు నేరాల వైపు నడిపిస్తోంది. పోలీసులు రాహుల్‌ను అరెస్ట్ చేసినప్పుడు, అతను ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ‘ఆమె డబ్బు ఇచ్చి ఉంటే నేను చంపేవాడిని కాదు’ అని వ్యాఖ్యానించడం అతని మానసిక స్థితిని తెలియజేస్తోంది.
రాజస్థాన్ లోనూ నేరం?
రాహుల్ కేవలం ఢిల్లీలోనే కాకుండా, అంతకు ముందు రోజు తన స్వస్థలమైన రాజస్థాన్‌లోని అల్వార్‌లో కూడా ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంటే, ఒక వరుస క్రమంగా అతను నేరాలకు పాల్పడుతున్నాడని స్పష్టం అవుతోంది.
చదువు కేవలం మార్కుల కోసం కాదు.., అది సంస్కారాన్ని ఇవ్వాలి. 90 శాతం మార్కులు వచ్చినప్పటికీ, రాహుల్ తన జీవితాన్ని జూదానికి బలిచ్చాడు. ఆన్‌లైన్ గేమ్స్, జూద నియంత్రణపై కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే, ఇళ్లలో పనివారలను పెట్టుకునేటప్పుడు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తన బంగారు భవిష్యత్తును వెతుక్కుంటున్న ఒక యువతి, ఒక వ్యసనపరుడి చేతిలో బలికావడం ఈ వ్యవస్థకే అవమానం.
