Begin typing your search above and press return to search.

ఒంగోలులో ఆ 7 'మెడికో'ల ఆరాచకం తెలిస్తే షాకే

ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఏడుగురు వైద్య విద్యార్థులకు సంబంధించిన విషయాలు షాకింగ్ గా మారాయి

By:  Tupaki Desk   |   1 Aug 2023 5:17 AM GMT
ఒంగోలులో ఆ 7 మెడికోల ఆరాచకం తెలిస్తే షాకే
X

మిగిలిన విద్యతో పోలిస్తే వైద్య విద్యకు ఉండే గౌరవ మర్యాదల గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన మెడికోలు అందుకు భిన్నంగా ఆరాచకంగా వ్యవహరిస్తున్న వైనం వెలుగు చూసింది. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఏడుగురు వైద్య విద్యార్థులకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చి.. షాకింగ్ గా మారాయి. 2020 బ్యాచ్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరు వ్యసనాలకు బానిస కావటం ఒక ఎత్తు.. ఆ మత్తులో ఇతర విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వివిధ జిల్లాలకు చెందిన ఈ ఏడుగురు విద్యార్థులపై గత ఏడాదికి పైగా కంప్లైంట్లు వస్తున్నా.. తాజాగా మాత్రం విద్యార్థులు పెద్ద ఎత్తున సదరు ఏడుగురు విద్యార్థులపై ప్రిన్సిపల్ కు కంప్లైంట్ ఇవ్వటంతో విషయం బయటకు వచ్చింది. హాస్టల్ లో గంజాయి తాగటం.. మద్యం తాగటం.. అర్థరాత్రి వేళ గొడవ చేయటంతో పాటు.. హాస్టల్ లోని ఇతర విద్యార్థులపై చేయి చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని వారు బయటపెట్టారు.

నిజానికి గతంలో వచ్చిన ఫిర్యాదులతో ఆ ఏడుగురు విద్యార్థుల్ని హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. వారిని సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ ట్రాన్స్ ఫర్ అయ్యాక.. రెగ్యులర్ ప్రిన్సిపల్ రావటానికి కొంత టైం పట్టింది. ఆ సమయంలో ఈ ఏడుగురు మళ్లీ హాస్టల్ కు వచ్చేశారు. దీంతో.. మళ్లీ రచ్చ మొదలైంది.

తమపై కంప్లైంట్ చేసిన వారిపై చేయి చేసుకోవటం.. వారిని బూతులు తిడుతూ.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ బాబు వద్ద ప్రస్తావించగా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. అయినప్పటికీ వారిలో మార్పులు రాని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.