Begin typing your search above and press return to search.

కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్‌ లీక్‌...ఎగసిపడుతున్న అగ్నికీలలు!

కోనసీమ జిల్లాలోని ప్రజలకు ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో... భూమిలోపల నుంచి వెళ్లే ఓఎన్జీసీ పైప్ లైన్లు అప్పుడప్పుడూ కలిగించే టెన్షన్స్ అంతకు మించి అన్నట్లుగా ఉంటాయని అంటుంటారు.

By:  Tupaki Desk   |   15 July 2023 6:45 AM GMT
కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్‌ లీక్‌...ఎగసిపడుతున్న అగ్నికీలలు!
X

కోనసీమ జిల్లాలోని ప్రజలకు ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో... భూమిలోపల నుంచి వెళ్లే ఓఎన్జీసీ పైప్ లైన్లు అప్పుడప్పుడూ కలిగించే టెన్షన్స్ అంతకు మించి అన్నట్లుగా ఉంటాయని అంటుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్‌ బయటకు వచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

అవును... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్‌, అగ్నికీలలు ఎగసిపడటం కలకలం రేపింది. రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... శివకోడులో గతంలో గ్యాస్ కోసం సెస్మిక్‌ సర్వే జరిగిందని అంటున్నారు. ఇదే సమయంలో ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదే చోట ఆరు ఏళ్ల కిందట బోరు వేశారు. అయితే అప్పుడు సమస్యలు ఏమీ రాలేదు కానీ... రెండు రోజుల కిందట ఆ బోరును మరింత లోతుకి తవ్వడంతో ఈ ప్రమాధం జరిగిందని అంటున్నారు.

ఈ బోరు మరింత లోతుకి వెయ్యడంతో భూమిలోని గ్యాస్‌ బయటికి వచ్చి నేడు మంటలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు!

అయితే ఇది భూమికింద ఉన్న గ్యాస్ పైప్ లైన్ అయితే దాన్ని అదుపులోకి తేవడం సులభమే అని అంటున్నారంట అధికారులు. అయితే ఇక్కడ నేరుగా భూమిలోంచి గ్యాస్ లీకవ్వడంతో కంట్రోల్ చేయడం కాస్త కష్టమవుతుందని అధికారులు అంటున్నారని సమాచారం. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతం అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తుంది.

కాగా... 1993లో మామిడికుదురు మండలం కొమరాడలో తొలిసారి బ్లో అవుట్ సంభవించిన సంగతి తెలిసిందే. అనంతరం 1995లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బ్లో అవుట్ పాశర్లపూడి 19 స్ట్రక్చర్ పరిధిలో దేవర్లంకలో జరిగింది. ఈ బ్లో అవుట్ సుమారు 65 రోజుల పాటు మండింది. చివరకు విదేశీ నిపుణుల సహకారంతో అదుపులోకి వచ్చింది! నాటి నుంచి భూమిలోని గ్యాస్ లీక్ అనే మాట వింటే... కోనసీమ జిల్ల ప్రజల గుండెలు అదురుతాయని అంటుంటారు!