చంద్రబాబు మదిలో 'కూటమి' ఖుషీ.. !
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 12న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంతో రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమైంది.
By: Tupaki Desk | 12 Jun 2025 6:53 AMరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 12న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంతో రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమైంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్..లు ప్రమాణం చేశారు. అయతే.. ఈ ప్రభుత్వం ఏర్పడేందుకు మూడు పార్టీలు కలిసి పనిచేశాయన్న సంగతి తెలిసిందే. బీజేపీ-జనసేన-టీడీపీలు సంయుక్తంగా ఎన్నికలకు వెళ్లి ఏకంగా 94 శాతం స్ట్రయిక్ రేట్‌ను దక్కించుకుని 60 శాతం ఓటు బ్యాంకుతో విజయం దక్కించుకున్నాయి.
సాధారణంగా రాజకీయ కూటమి అంటేనే.. చెదురుమొదురు అలకలు.. ఇబ్బందులు కామన్‌గానే ఉంటాయి. ఇక, ప్రజల ఆకాం క్షల మేరకు కూటమి పార్టీలు కలిసి నడవడం కూడా కత్తులపై నడకనే తలపిస్తుంది. అయితే.. ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా మూడు పార్టీల మధ్య కలయిక.. పొందిక ఇప్పటి వరకు బాగానే ఉంది. ఎక్కడైనా చిన్న పొరపాటు తెరమీదికి వస్తోందని గుర్తించి నా.. వెంటనే అధినేతలు.. రంగంలోకి దిగడం.. కూటమి బలానికి.. భవిష్యత్తుకు కూడా కీలకంగా మారింది. ఇది కూటమి పార్టీల ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు సంతోషాన్ని కలిగిస్తోంది.
ఇక, కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం విషయం కూడా.. చంద్రబాబుకు మరింత ఆనందాన్నే కలిగించిందని చెప్పాలి. కీలకమైన విషయాల్లో చంద్రబాబుకు కేంద్రం నుంచి సహకారం బాగానే లభించింది. కొన్ని చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ.. ఏడాది పాలనా కాలంలో కేంద్రం నుంచి రావాల్సిన సొమ్ములను బాగానేరాబట్టుకున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతికి రూ15 వేల కోట్ల మేరకు రుణాన్ని సాధించారు. అదేసమయంలో 1500 కోట్ల వరకు గ్రాంటుగా తెచ్చుకున్నారు. అదేవిధంగా పోలవరం పూర్తి చేసే బాధ్యతను కూడా కేంద్రం తీసుకునేలా చంద్రబాబు ఒప్పించారు. ఇది కూటమి తరఫున ఆయన సాధించిన ప్రధాన విజయాలు.
వీటితోపాటు విశాఖలో రైల్వేజోన్ కేటాయించడం.. అదేవిధంగా కాట్పాడి-చిత్తూరు మధ్య రైల్వే డబుల్ లైన్ ఇవ్వడం, విశాఖ ఉక్కు కర్మాగారానికి 11400 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక, కీలకమైన బనకచర్ల ప్రాజెక్టు విషయంపైనా కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆపేసిన కేంద్ర ప్రాయోజిత పథకాలను తిరిగి ప్రారంభించారు. తద్వారా 73 కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు సాధించారు. దీనివల్ల.. గ్రామీణ, పట్టణాల్లో కూడా అభివృద్ది పనులకు అవకాశం ఏర్పడిం ది. ఇలా.. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఏర్పడడం కూడా.. చంద్రబాబు ఖుషీ కావడానికి కారణమైంది. మొత్తంగా కూటమి హయాంలో చంద్రబాబు మదిలో ఖుషీ నెలకొందనే చెప్పాలి.