Begin typing your search above and press return to search.

వన్ నేషన్ - వన్ ఎలక్షన్.. దేశానికి రూ. 7 లక్షల కోట్ల లాభం!

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై జాయింట్ పార్లమెంటు కమిటీ సంచలన లెక్కలు విడుదల చేసింది.

By:  Tupaki Political Desk   |   20 May 2026 6:00 PM IST
వన్ నేషన్ - వన్ ఎలక్షన్.. దేశానికి రూ. 7 లక్షల కోట్ల లాభం!
X

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై జాయింట్ పార్లమెంటు కమిటీ సంచలన లెక్కలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటూ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం నిరంతరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల పాలన కుంటుపడటమే కాకుండా వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందనే వాదన వినిపించింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ విధానంపై అధ్యయనం చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్మన్ పి.పి. చౌదరి ఆసక్తికర సమాచారం విడుదల చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశానికి ఏకంగా రూ. 7 లక్షల కోట్లు ఆదా అవుతాయన్న ఆసక్తికర సమాచారాన్ని వెల్లడించారు.

ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం

గుజరాత్ పర్యటనలో ఉన్న జేసీపీ చైర్మన్ పీపీ చౌదరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఆసక్తికర సమాచారం తెలియజేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల కేవలం ఖర్చులు తగ్గడమే కాకుండా, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కూడా 1.6 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్ మాటిమాటికీ అమలులోకి రావడం వల్ల పరిశ్రమల ఉత్పత్తి నిలిచిపోవడం, కార్మికుల వలసలు, జీఎస్టీ వసూళ్లు తగ్గుతున్నాయని చెప్పారు. అదేవిధంగా పర్యాటక రంగం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్త సమస్యలకు ఒకేసారి ఎన్నికలతో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ధీమా వ్యక్తం చేశారు.

రూ. 7 లక్షల కోట్లు లాభం

ఒకే దేశం - ఒకే ఎన్నిక విధానం ద్వారా ఆదా అయ్యే సుమారు 7 లక్షల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని దేశంలో మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించవచ్చని పి.పి. చౌదరి తెలిపారు. ఈ నిధులను పేదల సంక్షేమం, నాణ్యమైన విద్య, అత్యాధునిక వైద్య సేవలు, ఇతర ప్రజా ఉపయోగకరమైన పనుల కోసం కేటాయించడం ద్వారా దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరంతరం ‘ఎన్నికల మోడ్’లో ఉండే దేశం, ఈ సంస్కరణతో పూర్తి స్థాయిలో ‘అభివృద్ధి మోడ్’లోకి మారుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పనితీరులో మార్పు

వ్యూహాత్మకంగా ఈ సంస్కరణ ద్వారా ప్రభుత్వాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందని అంటున్నారు. పదే పదే ఎన్నికల విధుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను, అధికారులు రక్షణ సిబ్బందిని మళ్లించాల్సిన అవసరం తప్పుతుందని విశ్లేషిస్తున్నారు. ఫలితంగా విద్య, పరిపాలన సజావుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన సుమారు 18 వేల పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం మొదట లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించి, ఆ తర్వాత 100 రోజుల్లోపు పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ బిల్లులపై ఏర్పాటైన జేపీసీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ, అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసం ఈ చారిత్రాత్మక సంస్కరణ అమలు కావాల్సిన అవసరం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.