Begin typing your search above and press return to search.

వచ్చేసారి లోక్‌సభ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!

అంతకుముందు మధ్యంతరాలతో వేర్వేరుగా జరిగినా.. 1999 నుంచి ఉమ్మడి ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిసే జరిగాయి.

By:  Tupaki Desk   |   18 Jun 2025 11:00 AM IST
వచ్చేసారి లోక్‌సభ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!
X

అంతకుముందు మధ్యంతరాలతో వేర్వేరుగా జరిగినా.. 1999 నుంచి ఉమ్మడి ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిసే జరిగాయి. 2004లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లగా కేంద్రంలోని బీజేపీ వాజ్‌పేయీ ప్రభుత్వమూ ముందస్తుకు వెళ్లింది. ఫలితాల పరంగా మాత్రం చేదు అనుభవం ఎదురైంది. 2009లోనూ లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిసే జరిగాయి. 2014లో ఏపీ, తెలంగాణ విడిపోయినా.. దానికి ముందుగానే ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాలు మాత్రం విడివిడిగా ఏర్పడ్డాయి. ఈ లెక్కన ఏపీ, తెలంగాణలో విభజన అనంతరం తొలి ఎన్నికలు 2019లో జరగాలి. కానీ, తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సారథి కేసీఆర్‌ ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. విజయఢంకా మోగించారు. ఆ తర్వాత 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏపీలో మాత్రం 2019, 2024లో లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఐదేళ‍్ల పాలనా కాలం ప్రకారం చూస్తే తెలంగాణలో వచ్చే ఎన్నికలు 2028లో జరగాల్సి ఉంది. కానీ, ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు జరుగుతాయని అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’. ఇదే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని అంటున్నారు. కాగా, ఒకే దేశం-ఒకే ఎన్నికను దేశవ్యాప్తంగా రెండు దశల్లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

కేంద్రం ఆలోచనలో.. దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలని ఉంది. ఇక 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి ఎన్నికలు చేపడుతుంది. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ప్రయత్నంలో తొలి అడుగు ఇది అనుకోవచ్చు. రెండు దఫాలుగా అయితే లక్ష్యం తేలిక అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో తొలిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను జమిలిలో కలిపి నిర్వహిస్తారని పేర్కొంటున్నారు.

కాగా, బీజేపీ లక్ష్యం అయిన ఒకే దేశం-ఒకే ఎన్నిక తొందరగా తేలేది కాదు. ఇదే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉంది. నిరుడు లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంటే 25 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విడిగానే జరిగినట్లు అన్నమాట. ఇలా మిగిలిన రాష్ట్రాల‍్లో ఎన్నికలు ముందు, లేదంటే వెనుక జరిగాయి. బిహార్‌, అసోం, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పుదుచ్చేరి, పంజాబ్‌, తమిళనాడు, యూపీ, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌లో 2021-2022 మధ్య ఎన్నికలు నిర్వహించారు.

ఢిల్లీలో జనవరిలో, బిహార్‌లో సెప్టెంబరు-అక్టోబరులో ఎన్నికలున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందుగానీ, ఏడాది తర్వాత గానీ ప్రాతిపదికన అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను ఒక విభాగంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ప్రకారం 2028, 2029లో ఎన్నికలున్న రాష్ట్రాలను తొలి విడతగా తీసుకోనున్నారు. ఈ మేరకు 2028లో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీ్‌స్‌గఢ్‌, రాజస్థాన్‌, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, మిజోరం అసెంబ్లీ ఎన్నికలున్నాయి.

-2029లో ఏపీ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం, హరియాణా, జార్ఖండ్‌, మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి.. ఈ 16 రాష్ట్రాలకు 2029 లోక్‌సభ ఎన్నికలతో కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు. మిగిలినవి ఈ పరిధిలోకి వస్తాయా? అని చూస్తున్నారు. లేనివాటిని 2034 నాటికి ఒకే దేశం-ఒకే ఎన్నిక పరిధిలోకి తేవాలని కేంద్రం యోచిస్తోందని పేర్కొంటున్నారు.