చరిత్రలో నిలిచిపోయేలా.. ప్రధాని మోదీ కీలక అడుగులు
ఎన్నికల సమయంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులకే పరిమితం కావాల్సి వస్తుంది.
By: Tupaki Political Desk | 11 July 2026 1:41 PM ISTదేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంస్కరణలకు రంగం సిద్ధమవుతోంది. 2029 నాటికి 'ఒక దేశం - ఒకే ఎన్నిక' (జమిలి ఎన్నికలు)ను సాకారం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి తాజాగా చేసిన ప్రకటన కేంద్రం ప్రయత్నాలను స్పష్టం చేస్తోందని చెబుతున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జమిలితోపాటు మహిళా రిజర్వేషన్, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారని చెబుతున్నారు. గత సమావేశాల్లో 2/3 వంతు మెజార్టీ లేకపోవడంతో ఈ బిల్లులు వీగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో వచ్చే సమావేశాల్లో ఈ మూడు బిల్లులను ఆమోదించుకునేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు.
వ్యూహాత్మక అడుగులు
'ఒక దేశం - ఒకే ఎన్నిక' బిల్లు కోసం తీసుకువస్తున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏకాభిప్రాయ సాధన కోసం జేపీసీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, మేధావుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు నిర్వహించిన సంప్రదింపుల్లో దాదాపు 99 శాతం మంది ఈ ప్రతిపాదనను సమర్థించారని జేపీసీ చైర్మన్ చౌదరి వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిగిలిన పార్టీలు స్వచ్ఛందంగా అంగీకరిస్తే, 2029 నాటికే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
జమిలి ఎన్నికల వల్ల దేశానికి ఆర్థికంగా ఎంతో మేలు ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా పాలనలో వేగం పుంజుకుంటుందని చెబుతున్నారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 7 లక్షల కోట్ల భారం పడుతోందని అంచన వేస్తున్నారు. తరచూ ఎన్నికల వల్ల ఎన్నికల నిర్వహణ వ్యయం పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పర్యాటకం, వాణిజ్యంపై ఎన్నికల కోడ్ ప్రభావం పడటంతో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులకే పరిమితం కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు అంతరాయం కలగడం వల్ల, ప్రభుత్వ విద్యపై ఆధారపడే పేద విద్యార్థులు నష్టపోతున్నారు. జమిలి ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు నిరంతరాయంగా సమయం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక అజెండాను పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు.
చరిత్రలో ప్రధాని మోదీ ముద్ర
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పంలో 'ఒక దేశం - ఒకే ఎన్నిక' అనేది ఒక కీలక సంస్కరణ. ఒకవేళ ఈ బృహత్తర కార్యాన్ని ప్రభుత్వం పూర్తి చేయగలిగితే, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రధాని మోదీ పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది. జమిలి ఎన్నికలు దేశ సమగ్రతను, ఆర్థిక పురోగతిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. 2029 ఎన్నికల కల్లా ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి కేంద్రం తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తోంది. విస్తృత ఏకాభిప్రాయ సాధన ద్వారా, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ సంస్కరణలను అమలు చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలుగా చెబుతున్నారు.
