'గోడ' దూకిన సీఎం.. ఆ రాష్ట్రంలో హీటెక్కిన అమరుల సంస్మరణ రాజకీయం
కశ్మీర్ లో రాజకీయం వేడెక్కింది. ఫలితంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆ రాష్ట్ర అమరవీరుల దినోత్సవం సాక్షిగా రగడ మొదలైంది.
By: Tupaki Desk | 14 July 2025 3:42 PM ISTభారత దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రం చాలా భిన్నం.. అసలు అక్కడ ప్రజలకు ఆధార్ కార్డు ఉండదు.. ఏమాత్రం పరిస్థితులు ఉద్రిక్తంగా మారినా ఆంక్షలు అమల్లోకి వచ్చేస్తాయి.. ఇలాంటి రాష్ట్రంలో గత ఏడాది ఎన్నికలు జరిగాయి.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న పార్టీ విజయం సాధించి.. అధికారం చేపట్టింది.
కశ్మీర్ లో రాజకీయం వేడెక్కింది. ఫలితంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆ రాష్ట్ర అమరవీరుల దినోత్సవం సాక్షిగా రగడ మొదలైంది. ఈ దినోత్సవం పాటించకుండా అధికార, ప్రితపక్ష నేతలపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆంక్షలు విధించడం వివాదానికి దారితీస్తోంది. ఈ మేరకు హౌస్ అరెస్టులు, ఆంక్షలు విధించడాన్ని కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తీరు సిగ్గుచేటని కూడా మండిపడ్డారు.
బ్రిటిష్ పాలనలో ఉండగా.. 1931 జూలై 13న అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. ఇందులో 21 మంది చనిపోయారు. వీరి సంస్మరణను ఒమర్.. మరో జలియన్ వాలాబాగ్ గా అభివర్ణించారు. ముస్లింలు అయినందుకే వారిని విలన్ లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారి సమాధులను సందర్శించే అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు.
కశ్మీర్ అమరవీరుల దినోత్సవం పాటించకుండా.. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యంత్రాంగం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయించింది. ప్రతిపక్ష నేతలను కూడా అనుమతించలేదు. జూలై 13న ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశాలిచ్చారు. రాజధాని శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మజార్-ఎ-షుహాదా (అమరుల శ్మశానవాటిక)కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
దీనిని ఉల్లంఘిస్తూ.. సీఎం ఒమర్ అబ్దుల్లా.. మజార్-ఎషుహాదా (అమరుల శ్మశాన వాటిక) గోడను దూకారు. ఆయన ప్రార్థనలు చేయడానికి వెళ్తుండగా భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో సీఎం స్వయంగా మజార్-ఎ-షుహాదా గోడ ఎక్కి లోపలకు దూకారు. అమరవీరులకు నివాళి అర్పిస్తూ ప్రార్థనలు చేశారు. ఈ మేరకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
