Begin typing your search above and press return to search.

ఒమన్ తీరం వద్ద అమెరికా ‘దాడి’.. నౌక సేఫ్‌.. కానీ ‘సోషల్ మీడియా సైనికులు’ ఫుల్ బిజీ

ముఖ్యంగా మన ‘సోషల్ మీడియా నిపుణులు’ ఏ చిన్న గ్యాప్ దొరికినా చాలు.. దాన్ని ప్రపంచ యుద్ధం స్థాయికి తీసుకెళ్లడానికి క్షణం కూడా ఆలస్యం చేయరు.

By:  A.N.Kumar   |   13 Jun 2026 11:10 AM IST
ఒమన్ తీరం వద్ద అమెరికా ‘దాడి’.. నౌక సేఫ్‌.. కానీ ‘సోషల్ మీడియా సైనికులు’ ఫుల్ బిజీ
X

ఈ రోజుల్లో నిజం నిలకడగా నడుచుకుంటూ వెళ్లేలోపే అబద్ధం అర్ధరాత్రి పూట హైవేపై స్పోర్ట్స్ కార్ వేస్కెల్లినంత స్పీడ్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా మన ‘సోషల్ మీడియా నిపుణులు’ ఏ చిన్న గ్యాప్ దొరికినా చాలు.. దాన్ని ప్రపంచ యుద్ధం స్థాయికి తీసుకెళ్లడానికి క్షణం కూడా ఆలస్యం చేయరు. తాజాగా ఒమన్ తీరం వద్ద ప్రయాణిస్తున్న భారతీయ సిబ్బంది ఉన్న ‘లైకీ ఫ్రీడమ్’ నౌక విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.

కొద్దిసేపు సముద్రంలో సిగ్నల్స్ లేక నౌక నుంచి కమ్యూనికేషన్ కట్ అయింది. అంతే భూమ్మీద ఉన్న నెటిజన్ల బుర్రల్లో ‘క్రియేటివిటీ’ కోరలు చాచింది. "అమెరికా దాడి చేసింది!", "నలుగురు భారతీయ నావికులు మరణించారు!" అంటూ క్షణాల్లో బ్రేకింగ్ న్యూస్‌లు పుట్టుకొచ్చాయి. కొందరైతే ఏకంగా నౌక మునిగిపోయిందని శ్రద్ధాంజలి ఘటించేశారు. మరికొందరు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ విశ్లేషకులుగా మారిపోయి.. "ఇక మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే రాసి పెట్టుకోండి!" అంటూ యూట్యూబ్ థంబ్‌నైల్స్‌తో హడావుడి సృష్టించారు.

సీన్ కట్ చేస్తే.. అసలు నిజం ఇదీ..

ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్న తరుణంలో.. భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. నౌక మాస్టర్‌తో నేరుగా ఫోన్లో మాట్లాడి "అక్కడ అంతా ప్రశాంతం బాస్!" అని క్లారిటీ ఇచ్చింది. నౌక సురక్షితంగా ఉందని, సిబ్బంది అంతా క్షేమంగా చాయ్ తాగుతున్నారని స్పష్టం చేయడంతో అప్పటివరకు వైరల్ అయిన 'బ్రేకింగ్ న్యూస్'లన్నీ ఒక్కసారిగా 'ఫేకింగ్ న్యూస్'లుగా మారిపోయి బోర్లా పడ్డాయి.

ట్విస్ట్ ఏంటంటే ఈ గ్యాప్‌లో అమెరికా కూడా ఒక ప్రకటన వదిలింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌లను తాము కూల్చేశామని, నిబంధనలు పాటించని తొమ్మిది నౌకలను నిలిపివేశామని చెప్పింది. ఈ గందరగోళాన్ని మనవాళ్లు 'లైకీ ఫ్రీడమ్' నౌకకు లింక్ చేసి వండివార్చేశారన్నమాట!

సోషల్ మీడియా మేధావులకు విన్నపం

సముద్రంలో నౌక ప్రయాణించిన వేగం కంటే ఇంటర్నెట్‌లో పుకార్లు ప్రయాణించిన వేగమే ఈ ఘటనలో హైలైట్. కమ్యూనికేషన్ కట్ అయితే దాడి జరిగిందని స్పందన ఆలస్యమైతే యుద్ధం మొదలైందని డిసైడ్ చేసేసే మన ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ప్రోఫెసర్లకు ఈ ఘటన ఒక గుణపాఠం.