Begin typing your search above and press return to search.

స్పీకర్ దూరం...లోక్ సభను ఎవరు నడిపిస్తారు ?

దీంతో డిప్యూటీ స్పీకర్ కూడా లేని లోక్ సభను ఎవరు నడిపిస్తారు అన్న చర్చ ఉత్పన్నం అవుతోంది. సాధారణంగా లోక్ సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉంటారు.

By:  Satya P   |   10 Feb 2026 11:50 PM IST
స్పీకర్ దూరం...లోక్ సభను ఎవరు నడిపిస్తారు ?
X

పార్లమెంట్ లో అధికార విపక్షాల మధ్య ఎత్తుకు పై ఎత్తు వ్యూహాలతో సభా కార్యక్రమాలకు తీవ్ర ప్రతిష్టంబన కొనసాగుతోంది. దీంతో ప్రతీ రోజూ వరసబెట్టి సభ వాయిదా పడుతూనే ఉంది. సభలో గందరగోళ పరిస్థితి యధాతధంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఇవన్నీ కలసి ఏకంగా స్పీకర్ మీదనే ఆవిశ్వాస అస్త్రాన్ని విపక్షాలు ప్రయోగించేలా చేశాయి. స్పీకర్ మీద మాకు విశ్వాసం లేదని మొత్తం సభలో అయిదవవంతు ఎంపీలు నోటీసు ఇచ్చారు. ఇది నిజంగా స్పీకర్ చెయిర్ లో ఉన్న వారికి ఇబ్బందికరమైన అంశమే.

కఠిన నిర్ణయం :

ఈ పరిణామాల నేపధ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన మీద అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు పెట్టిన నేపథ్యంలో నైతికంగా తాను చెయిర్ లో కూర్చోవడం భావ్యం కాదని భావించి ఆయన ఆయన లోక్ సభకు కొంత కాలం విరామం ప్రకటించారు లోక్ సభలో తన మీద విపక్షాలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసుల మీద చర్చ జరిగి ఫలితం తేలేంతవరకూ తాను సభా కార్యక్రమాలకు దూరంగా ఉండదలచినట్లుగా ఆయన పేర్కొంటున్నారు.

డిప్యూటీ స్పీకర్ లేరు :

దీంతో డిప్యూటీ స్పీకర్ కూడా లేని లోక్ సభను ఎవరు నడిపిస్తారు అన్న చర్చ ఉత్పన్నం అవుతోంది. సాధారణంగా లోక్ సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉంటారు. 2014 నుంచి 2019 మధ్యలో లోక్ సభలో ఇద్దరూ ఉండేవారు. అయితే 2019 నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. అప్పట్లో ఈ పదవిని మిత్రులకు ఇస్తారని ప్రచారం సాగినా అది జరగలేదు, ఇక 2024 ఎన్నికల తరువాత కూడా అదే పరిస్థితి ఏర్పడింది. గత ఇరవై నెలల కాలంలో డిప్యూటీ స్పీకర్ మిత్రులకు ఇస్తారని లేదా బీజేపీ నుంచే ఉంటారని ప్రచారం సాగినా ఆ దిశగా అయితే ఎవరినీ ప్రక్రియ సాగలేదు.

ప్యానల్ స్పీకర్లతోనే :

సభా కార్యక్రమాలను రోజు మొత్తం స్పీకర్ ఒక్కరే నడిపించడం కష్టం. అందుకే డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఆ తరువాత వివిధ పార్టీల నుంచి ప్యానల్ స్పీకర్లను కూడా నియమిస్తారు. వారు కూడా సభను కొంత సేపు నడిపిస్తారు. అయితే ముఖ్యమైన తీర్మానాలు కీలక చర్చలు జరిగేటపుడు స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ మాత్రమే సభలో చెయిర్ లో ఉంటారు.

అవిశ్వాస తీర్మానం వేళ :

ఇక స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అంటే ఇది చిన్న విషయం కాదు, ఎంతో కీలకమైనది, మామూలుగా అయితే డిప్యూటీ స్పీకర్ సభలో చెయిర్ లో ఉండి ఈ మొత్తం తీర్మానం మీద చర్చతో పాటు ఓటింగ్ ని నిర్వహించి అంతా సజావుగా సాగేలా చూస్తారు, స్పీకర్ మీదనే అవిశ్వాసం కాబట్టి ఆయన చెయిర్ కి దూరంగా ఉంటారు, అదే నైతికం కూడా. ఇపుడు చూస్తే తమ మీద అవిశ్వాస తీర్మానం ఫలితం తేలేంతవరకూ సభకు దూరంగా ఉండాలని ఓం బిర్లా నిర్ణయించిన నేపథ్యంలో సభకు సారధ్యం వహించేది ఎవరు అన్నదే పెద్ద చర్చగా ఉంది. ఇది ఎవరూ ఊహించనిది, ఇటీవల కాలంలో ఎపుడూ స్పీకర్ల మీద అవిశ్వాసం పెట్టిన సందర్భాలు కూడా లేవు, మరి ప్యానల్ స్పీకర్లలో ఒకరికి ఈ బాధ్యత అప్పగిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.