లోక్ సభ స్పీకర్ మీద అవిశ్వాసం...చర్చ ఎపుడంటే ?
ఇదిలా ఉంటే విపక్షాలు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే రాజ్యాంగంలోని అధికరణం 94 సీ కింద 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
By: Satya P | 11 Feb 2026 4:00 AM ISTమొత్తానికి అనుకున్నట్లుగానే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మాన నోటీసుని మంగళవారం ఇచ్చింది. ప్రతిపక్షం ఈ నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సమర్పించిందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. ఈ నోటీసును పరిశీలించి నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేస్తామని వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని మొత్తం పార్టీలకు చెందిన ఎంపీలు అంతా కలసి 118 మంది ఈ అవిశ్వాస తీర్మాన నోటీసు మీద సంతకాలు చేశాయి. దాంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వస్తోంది.
కారణాలు ఇవే :
గత నెల 28 నుంచి పార్లమెంట్ సమావేశాలు సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలలోనే బడ్జెట్ ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రాష్ట్రపతికి ధన్యవదాలు తెలిపే తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మ కధలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. నాటి నుంచి సభలో ప్రతిష్టంబన అలాగే కొనసాగుతోంది. అంతే కాదు ప్రధాని బడ్జెట్ మీద మాట్లాడేందుకు వస్తే విపక్షాలు ఆయన సీటు వద్దకు వెళ్ళి వివాదం చేస్తారు అన్న వార్తలతో వచ్చాయని లోక్ సభ వర్గాలు చెప్పడం మీద కూడా విపక్షాలు గుర్రు మీద ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కి చెందిన ఎనిమిది మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేయడం కూడా ఆగ్రహానికి దారి తీసింది. రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడం స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్న దానితోనే ఈ రోజున విపక్షాలు అన్నీ కలసి అవిశ్వాస తీర్మానం నోటీసుని ఇచ్చాయని అంటున్నారు.
నిబంధనల ప్రకారం :
ఇదిలా ఉంటే విపక్షాలు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే రాజ్యాంగంలోని అధికరణం 94 సీ కింద 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దానిని పరిశీలించి లోక్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అంటే నోటీసు ఇచ్చినా స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం మీద చరకు 14 రోజుల వ్యవధి ఉంటుంది అన్న మాట.
బడ్జెట్ తొలి సెషన్ పూర్తి :
ఇక చూస్తే కనుక పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలి విడత ఈ నెల 13తో ముగియనుంది. మలి విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ విధంగా చూస్తే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అన్నది మార్చి 9 నుంచి మొదలయ్యే మలి విడతలోనే ఉండొచ్చు అని అంటున్నారు. ఇక తీర్మానం మీద చర్చ ఒకటి లేదా రెండు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. సభలో అధికార ఎన్డీయేకు ఉన్న మెజారిటీ దృష్ట్యా స్పీకర్ మీద అవిశ్వాసం వీగిపోనుంది. కానీ విపక్షాలు ఈ తీర్మానం ద్వారా అధికార పక్షం వైఖరికి లోక్ సభ సాక్షిగా ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తాయని అంటున్నారు.
