Begin typing your search above and press return to search.

గుండె గంటపాటు ఆగిపోయింది.. తర్వాత ఆమె నడక మరిచిపోయింది!

గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి మరణించినట్లే! ఆ ప్రక్రియ ఆగిపోగానే వైద్యులు మరణాన్ని ధృవీకరిస్తారు! అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఆశ్చర్యంగా మారింది.

By:  Tupaki Desk   |   28 Jun 2025 3:00 PM IST
గుండె గంటపాటు ఆగిపోయింది.. తర్వాత ఆమె  నడక మరిచిపోయింది!
X

గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి మరణించినట్లే! ఆ ప్రక్రియ ఆగిపోగానే వైద్యులు మరణాన్ని ధృవీకరిస్తారు! అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఆశ్చర్యంగా మారింది. హాంకాంగ్ కు చెందిన ఒలివియా చియూంగ్ కేసు వైద్య చరిత్రలో ఓ అద్భుతంగా నిలిచింది. దశాబ్ధం కింద తాను చనిపోయి మళ్లీ బ్రతికిన అనుభవాలను ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది!

అవును.. దశాబ్దం క్రితం, హాంకాంగ్‌ కు చెందిన ఒలివియా చియుంగ్ లోక్ మ్యాన్ గుండె సుమారు 63 నిమిషాలు కొట్టుకోవడం ఆగిపోయింది. దీనికి సంబంధించిన విషయాలను క్వీన్ మేరీ హాస్పటల్ వైద్యులు వివరించారు. వారి కృషి వల్ల ఆమె తిరిగి జీవించడం మొదలుపెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మళ్లీ జన్మించిందన్నమాట.

ఆ సమయంలో ఆమె 19 ఏళ్ల విద్యార్థిని కాగా.. గుండె వైఫల్యానికి కారణమయ్యే అరుదైన, తీవ్రమైన 'ఫుల్మినెంట్ మయోకార్డిటిస్' అనే అనారోగ్యంతో ఆమె బాధపడింది. క్వీన్ మేరీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోని వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ కారణంగా, ఇప్పుడు 30 ఏళ్ల ఆర్ట్ టీచర్ గా హాయిగా జీవిస్తుంది చియుంగ్.

ఈ క్రమంలో... ఇంటెన్సివ్ కేర్ చికిత్సలు, రోగుల అనుభవాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి షా ఫౌండేషన్‌ తో కలిసి ఆసుపత్రి వ్యక్తిగతంగా, ఆన్‌ లైన్ కార్యకలాపాలను అందించడానికి చియూంగ్, ఆమె వైద్యుడు సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా స్పందించిన చియుంగ్‌ కు చికిత్స చేసిన క్వీన్ మేరీ హాస్పిటల్‌ లోని క్రిటికల్ కేర్ యూనిట్ వైద్యుడు సైమన్ సిన్ వై-చింగ్... ఆమె తీవ్రమైన మయోకార్డిటిస్ తో బాధపడటం ప్రారంభించినప్పుడు ఆమె గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయిందని వెల్లడించారు. ఆ తర్వాత సుమారు 63 నిమిషాల తర్వాత తిరిగి కొట్టుకోవడానికి వారు చేసిన ప్రయత్నాన్ని వివరించారు.

ఇందులో భాగంగా... ఆమె మొదట ఆస్పత్రిలో చేరిన సమయంలో కృత్రిమ గుండె, ఊపిరితిత్తులుగా పనిచేసే ఎక్స్‌ ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్ మెషిన్ (ఈసీఎంవో) లేదని సిన్ చెప్పారు. ఆమెను బతికించడానికి క్వీన్ మేరీ హాస్పిటల్ నుండి ఈసీఎంవో మెషిన్ తో నిపుణుల బృందాన్ని తీసుకురావాల్సి వచ్చిందని అన్నారు.

వాస్తవానికి ఈ ప్రాసెస్ లో చియుంగ్ గుండె పూర్తిగా ఆగిపోయిందని తెలుసుకున్నప్పుడు బృందం ఇంకా టాక్సీలో మరో ఆసుపత్రికి ప్రయాణిస్తోందని వైద్యుడు గుర్తు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా 63 నిమిషాల తర్వాత స్పెషలిస్ట్ బృందం ఆపరేషన్ చేసి, చియుంగ్ గుండె మళ్ళీ కొట్టుకునేలా చేయగలిగిందని.. ఆ ఆపరేషన్ జరిగి దశాబ్ధం దాటిందని.. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.

ఈ సందర్భంగా స్పమించిన చియూంగ్... ఆపరేషన్ తర్వాత నేను రాయడం, నడవడం మరిచిపోయాను. వాటిని మళ్ళీ నేర్చుకోవలసి వచ్చింది, కానీ నేను చాలా త్వరగా ఆ నైపుణ్యాలను మళ్ళీ నేర్చుకున్నాను అని చెప్పింది.