పునరుత్పత్తి కోసం 51 రోజుల్లో 1000కి.మీ. జర్నీ చేసిన తాబేలు
మాతృత్వ మధురిమ అని చెప్పలేం కానీ.. తన సంతానాన్ని క్షేమంగా చూసుకునేందుకు ఒక తల్లి పడే ఆరాటంలో భాగంగా ఈ ప్రక్రియను చెబితే బాగుంటుంది.
By: Tupaki Desk | 17 May 2025 1:00 PM ISTమాతృత్వ మధురిమ అని చెప్పలేం కానీ.. తన సంతానాన్ని క్షేమంగా చూసుకునేందుకు ఒక తల్లి పడే ఆరాటంలో భాగంగా ఈ ప్రక్రియను చెబితే బాగుంటుంది. ఆలివ్ రిడ్లే తాబేళ్ల జీవన విధానం భిన్నంగా ఉండటం తెలిసిందే. పునరుత్పత్తిలో భాగంగా గుడ్లు పెట్టేందుకు వీలుగా.. అనువైన ప్రదేశాన్ని ఎంచుకునేందుకు వందలాది కిలోమీటర్లు అలుపు ఎరగని రీతిలో ప్రయాణించే వైనం తెలిసిందే. ఈ తాబేళ్ల మీద పరిశోధనలు చేస్తున్న కొందరు తాజాగా కొన్ని ఆసక్తికర అంశాల్ని గుర్తించారు.
ఆలివ్ రిడ్లేల జీవన విధానంపై పరిశోధనలు చేస్తున్న టీం.. వాటికి జియో ట్యాగ్ లు కట్టటం ద్వారా.. అవి ఎప్పుడు ఎక్కడకు ఎలా ప్రయాణిస్తున్నాయి? లాంటి అంశాల్ని పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలో ఒక తాబేలు ఒడిశాలోని కేంద్రపడ జిల్లా గహీర్ మర్ వద్ద సముద్రంలో ప్రయాణాన్ని షురూ చేసింది. 51 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అది ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది. ఇందుకోసం సదరు తాబేలు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించటం గమనార్హం
ఒడిశాలో తన జర్నీ మొదలు పెట్టిన ఈ తాబేలు.. శ్రీలంక.. తమిళనాడు.. పుదుచ్చేరి మీదుగా ఆంధ్రప్రదేశ్ కు చేరినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. నాలుగేళ్ల క్రితం మరో తాబేలుకు జియో ట్యాగ్ చేయగా.. సదరు తాబేలు పునరుత్పత్తి (గుడ్లు పెట్టేందుకు) కోసం 3500 కి.మీ. ప్రయాణించి ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి వచ్చినట్లుగా గుర్తించారు. ఈ వివరాల్ని ఆలివ్ రిడ్లేలపై పరిశోధన చేస్తున్న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ప్రేమ్ శంకర్ ఝూ వెల్లడించారు. పునరుత్పత్తి విషయంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎంతగానో శ్రమిస్తాయన్న సంగతి తెలిసిందే.
