200 ఏళ్ల నాటి కండోమ్ పిక్ వైరల్... దేనితో తయారు చేశారంటే..?
నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఉన్న ప్రఖ్యాత రిజ్క్స్ మ్యూజియంలో ఈ పురాతన కండోమ్ ను ప్రదర్శించారు.
By: Tupaki Desk | 8 Jun 2025 5:00 AM ISTసుమారు 200 ఏళ్ల నాటి పురాతన కండోమ్ తాజాగా దర్శనమిచ్చింది. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఉన్న ప్రఖ్యాత రిజ్క్స్ మ్యూజియంలో ఈ పురాతన కండోమ్ ను ప్రదర్శించారు. శృంగార కళాకృతులతో అలంకరించిన ఈ కండోమ్ 1830 నాటిదని గుర్తించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి!
అవును... సుమారు 200 ఏళ్ల నాటి కండోమ్ తాజాగా ప్రదర్శనకు వచ్చింది. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఉన్న ప్రఖ్యాత రిజ్క్స్ మ్యూజియంలో దీనిని ప్రదర్శనకు ఉంచారు. దీనిని గొర్రెల పేగు ద్వారా తయారు చేసినట్లు భావిస్తున్నారు. దీనిపై ఉన్న చిత్రాన్ని ఓ సన్యాసిని, ముగ్గురు మతాధికారులను సూచించేదిగా భావిస్తున్నారు.
దీంతో... 19వ శతాబ్ధంలోనే లైంగికత, గర్భనిరోధకంపై ప్రజలకు ఉన్న అవగాహనను ఇది తెలియజేసుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా రిజ్స్క్ మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ స్పందిస్తూ... ఈ కండోమ్ ను యూవీ కాంతితో తనిఖీ చేస్తే.. అది ఉపయోగించబడలేదని నిర్ధారించుకున్నట్లు తెలిపారు. ఇది మంచి స్థితిలోనే ఉందని ఆమె అన్నారు.
ఇదే సమయంలో... దీనిని ప్రదర్శనకు ఉంచినప్పటి నుంచి మ్యూజియం యువకులు, వృద్ధులతో నిండిపోయిందని.. ప్రతిస్పందన అద్భుతంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కండోమ్ ఫ్రాన్స్ లోని ఒక వేశ్యాగృహం నుంచి వచ్చిన లగ్జరీ సావనీర్ అని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై ఫ్రెంచ్ లో "ఇది నా ఎంపిక" అని రాసి ఉన్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా... తమకు తెలిసినంతవరకూ ప్రింటెడ్ కండోమ్ ఉన్న ఏకైక ఆర్ట్ మ్యూజియం తమదే అని చెప్పిన జెలెన్... తమ సంస్థ ఈ కళాఖండాన్ని ఇతర మ్యూజియంలకు అద్దెకు ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే.. ఈ కండోమ్ చాలా సున్నితంగా ఉందని అన్నారు. ఇది నవంబర్ చివరి వరకూ ప్రదర్శనలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు!
