Begin typing your search above and press return to search.

పాతబస్తీ మెట్రో స్టేషన్లు నాలుగే!

ఇప్పుడున్న రూట్ లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమాకు మెట్రోను విస్తరిస్తారు. వీటి మధ్య దూరం 5.5 కి.మీ. కాగా.. ఇప్పటికే మూసీలో 0.3కి.మీ. మేర రివర్సల్ ఉంది.

By:  Tupaki Desk   |   12 March 2024 9:30 AM GMT
పాతబస్తీ మెట్రో స్టేషన్లు నాలుగే!
X

పాతబస్తీకి వడివడిగా మెట్రో రైల్ ను తీసుకెళ్లాలని రేవంత్ సర్కారు తలపోస్తోంది. అదే సమయంలో.. మజ్లిస్ సైతం పాతబస్తీకి మెట్రో ఉండాలన్న పట్టుదలతో ఉంది. గతంలో అభ్యంతరం తెలిపిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు అందుకు భిన్నంగా త్వరగా మెట్రోను పూర్తి చేయాలని కోరుతున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో పాతబస్తీకి మెట్రోను పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇప్పుడున్న రూట్ లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమాకు మెట్రోను విస్తరిస్తారు. వీటి మధ్య దూరం 5.5 కి.మీ. కాగా.. ఇప్పటికే మూసీలో 0.3కి.మీ. మేర రివర్సల్ ఉంది.

ఈ నేపథ్యంలో మరో 5.2 కి.మీ. మెట్రో ట్రాక్ ను నిర్మిస్తే సరిపోతుంది. ఈ కారణంగా తొలుత అనుకున్న దాని కంటే తక్కువ వ్యయం అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. తొలుత ప్లాన్ ప్రకారం ఆరు స్టేషన్లు ఉండాలి. కానీ.. ఇప్పటివరకు తమకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఆరు స్టేషన్ల స్థానే నాలుగింటికే పరిమితం చేయనున్నారు. తొలుత అనుకున్న శంషేర్ గంజ్, జంగమ్మెట్ స్టేషన్లను మినహాయిస్తున్నారు.

దీంతో పాతబస్తీ మెట్రో కేవలం నాలుగు స్టేషన్లు మాత్రమే ఉండనున్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం.. చార్మినార్.. శాలిబండ.. ఫలక్ నుమా స్టేషన్లు మాత్రమే ఉంటాయి. అంతేకాదు తొలిదశలో మాదిరి మెట్రో స్టేషన్లు పెద్దవిగా ఉండవని.. ఈసారి స్టేషన్ల సైజ్ ను సైతం చిన్నవిగా చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ మార్పుల కారణంగా వ్యయం తగ్గనుంది. ఇప్పుడు అనుకున్న అంచనాకు మించి తక్కువలోనే ప్రాజెక్టు పూర్తి అయ్యే వీలుంది. ప్రస్తుతం రూ.2వేల కోట్లు అనుకుంటున్నారు. తాజా మార్పులతో అంతకంటే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తి అవుతుందని భావిస్తున్నారు.

తాజా లెక్కల ప్రకారం ప్రతి ఏడాది రూ.500కోట్లు పాతబస్తీ మెట్రోకు కేటాయిస్తే.. ప్రాజెక్టు అనుకున్న షెడ్యూల్ నాటికి పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇబ్బందిగా మారిన ఆస్తుల సేకరణ విషయంలో మజ్లిస్ మద్దతుతో త్వరగా పూర్తి చేయగలమని భావిస్తున్నారు. దాదాపు 1100 ఆస్తుల్ని సేకరించాల్సి ఉంటుంది. గతంలో వీటి విషయంపై మజ్లిస్ అభ్యంతరం పెట్టింది. మారిన పరిస్థితుల్లో ఈ ఆస్తుల సేకరణకు ఆ పార్టీ అధినేత అసద్ అనుకూలంగా ఉన్నారు. పాతబస్తీ మెట్రో పూర్తి అయితే.. పర్యాటకంగా మరింత డెవలప్ అయ్యే వీలుందని చెబుతున్నారు. చార్మినార్ కు వచ్చే సందర్శకుల సంఖ్య మరింత పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.