Begin typing your search above and press return to search.

ముసలోడే కానీ మహానుభావుడు!

ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మరో తోడు/భాగస్వామిని కోరుకునే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 5:30 PM GMT
ముసలోడే కానీ మహానుభావుడు!
X

తొలి వయసులో కంటే మలి వయసులోనే ఒక తోడు అవసరం ఉంటుంది. మలి వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, భాగస్వామి మరణించడం వంటి కారణాలతో చాలామంది ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తోంది. పిల్లలు ఉన్నా వారి ఉద్యోగ, సంసార బాధ్యతల్లో మునిగి తేలుతుంటారు కాబట్టి తమ పెద్దలకు అనుకున్నంత సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. వారితో గడపలేకపోవచ్చు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మరో తోడు/భాగస్వామిని కోరుకునే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు వృద్ధులు పెళ్లి చేసుకుంటే ఈ వయసులో ఇదేం రోగం అన్నట్టు మాట్లాడుకునేవారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మరో పెళ్లి చేసుకుంటే తప్పేముందని అనుకుంటున్నారు. పిల్లలు సైతం తమ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా బెంగళూరులో ఒక మ్యారేజీ బ్యూరో 50 ఏళ్లు పైబడినవారికి మ్యాచ్‌ మేకింగ్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. దీనికి రాయచూరుకు చెందిన ఒక గృహిణి తన వితంతువు తల్లికి సంబంధం కోసం వచ్చింది. తన తల్లికి అల్లుళ్లతో కలిసి జీవించడం కష్టంగా ఉందని.. అందుకే వేరే పెళ్లి చేయాలనుకుంటున్నానని వెల్లడించింది. ఆమె ఒంటరిగా ఉండటం తనకిష్టం లేదని తెలిపింది. అందుకే తన తల్లికి మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నానని వివరించింది.

ఈ క్రమంలో మ్యారేజీ బ్యూరో నిర్వాహకులు ఆమెకు ఒక వ్యక్తి ప్రొఫైల్‌ ను చూపించారు. ఆ వ్యక్తి ప్రొఫైల్‌ ను చూసిన గృహిణి ఆశ్చర్యపోయారు. 83 ఏళ్ల వృద్ధుడు తనకు వధువు కావాలని అప్లికేషన్‌ పెట్టుకున్నారు.

50 ఏళ్ల పైబడినవారికి నిర్వహించిన ఈ మ్యారేజీ మేకింగ్‌ ఈవెంట్‌ లో పురుషులు, మహిళలు కలిసి మొత్తం 37 మంది పాల్గొన్నారు. పాల్గొనేవారిలో కొందరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆశించారు. ఇంకొందరు సహజీవనం కోసం మంచి భాగస్వామిని వెతుకుతుండటం విశేషం.

కాగా 83 ఏళ్ల వృద్ధుడు తాను ఒంటరితనంతో బాధపడుతున్నానని.. తాను పెళ్లి చేసుకునేందుకు ఒక వధువు కావాలని వెల్లడించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. తన భాగస్వామిని వెతుక్కోవడం కోసమే ఇక్కడకి వచ్చినట్లు వెల్లడించాడు.

తన భార్య 18 ఏళ్ల క్రితం చనిపోయిందని.. పిల్లలు విదేశాల్లో నివసిస్తున్నారని ఆ వృద్ధుడు వెల్లడించాడు. దీంతో అప్పటి నుంచి తాను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని ఆ వృద్ధుడు తెలిపాడు. దీంతో తన కుమార్తె తనను ఈ ఈవెంట్‌ కు వెళ్ళమని ప్రోత్సహించిందని తెలియజేశాడు.

అయితే ఈ ఈవెంట్‌ లో 83 ఏళ్ల వృద్ధుడికి నిరాశే ఎదురైంది. ఈ మ్యారేజీ మేకింగ్‌ ఈవెంట్‌ కు కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే హాజరయ్యారు. ఈయనకు తగ్గ జోడి దొరకలేదు. ఈ విషయంలో కాస్త నిరాశ చెందిన ఆయన మరోమారు తనకు నచ్చిన భాగస్వామి కోసం ప్రయత్నిస్తానని వెల్లడించాడు.