Begin typing your search above and press return to search.

యవ్వనంగా చేస్తామని చెప్పి.. చివరకు ఏం చేశారంటే..!

అయితే.. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని కొంత మంది సాధ్యం కాని పనిని కూడా తాము చేస్తాం అంటూ ముందుకొస్తుంటారు. మీ సమస్యను మేము పరిష్కరిస్తాం అంటూ నమ్మిస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   24 Sept 2024 1:00 AM IST
యవ్వనంగా చేస్తామని చెప్పి.. చివరకు ఏం చేశారంటే..!
X

యవ్వనంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదండి. వయసు పెరుగుతున్నా ఆ వయసు తన శరీరంలో కనిపించొద్దు అనే కలలు కంటారు. దానికి కొందరు ఏవేవో క్రీములు వాడడం.. ఏవేవో ట్రీట్‌మెంట్ తీసుకోవడం సైతం చేస్తుంటారు. ఇంకొంత మంది ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. లేదంటే మెడికల్ పరంగా డాక్టర్లను నమ్మి ఏవేవో ప్రయోగాలకు దిగుతుంటారు. అయితే.. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని కొంత మంది సాధ్యం కాని పనిని కూడా తాము చేస్తాం అంటూ ముందుకొస్తుంటారు. మీ సమస్యను మేము పరిష్కరిస్తాం అంటూ నమ్మిస్తూ ఉంటారు.

సరిగా.. ప్రజలు ఎలాంటి కోరికను అయితే ఓ జంట ఆసరాగా చేసుకుంది. ప్రజలను నమ్మించి మోసం చేయాలని నిర్ణయించుకుంది. దాంతో కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 కోట్లను ఆ జంట కొల్లగొట్టింది. ఇంజ్రాయెల్ యంత్రం ఆక్సిజన్‌తో థెరపీ చేయడం వల్ల వృద్ధులు సైతం యువతగా మారిపోతారని ప్రజలను నమ్మించారు. చాలా మంది వారిని నమ్మారు. దాంతో ఆ మెషిన్‌లో ఆక్సిజన్ థెరపీ చేయించుకున్నారు. కానీ.. ఎవరిలోనూ ఫలితాలు కనిపించలేదు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్వరూప్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజీవ్ దూబే, అతని భార్య రష్మీ దూబే సాకేత్ నగర్లో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. మెషిన్ ద్వారా 60 ఏళ్ల వారిని 25 ఏళ్ల యువకుల వారిగా మారుస్తామంటూ నమ్మబలికారు. దీంతో దొంగ పథకాన్ని నమ్మిన వేలాది ప్రజలు మొత్తంగా రూ.35 కోట్లు డిపాజిట్ చేశారు. కొందరి నుంచి రూ.6వేలు తీసుకోగా.. మరికొందరి నుంచి రూ.90,000 వరకూ తీసుకున్నారు.

అయితే.. అందరిపై ప్రయోగం చేసినప్పటికీ ఎవరికీ ఫలితాలు కనిపించకపోవడంతో వారంతా ఆ దంపతులను నిలదీశారు. దాంతో వారు పారిపోయారు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచం ఏఐ టెక్నాలజీతో దూసుకుపోతుంటే ప్రజలు ఇంకా ఇలాంటి దొంగల మాటలను నమ్మడంపై పోలీసులు పలు సూచనలు చేశారు. ప్రకృతి సహజసిద్ధంగా జరిగే పరిణామాలను ఎవరూ మార్చలేరని, ఇలాంటి వారి మాటలు నమ్మి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.