Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. మంచిదేనా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన పోల‌వరం-మ‌ల్ల‌న్న సాగ‌ర్ లేదా బ‌న‌క‌చ‌ర్ల ఎత్తి పోత‌ల ప‌థ‌కానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

By:  Garuda Media   |   8 Aug 2026 5:00 PM IST
పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. మంచిదేనా?
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన పోల‌వరం-మ‌ల్ల‌న్న సాగ‌ర్ లేదా బ‌న‌క‌చ‌ర్ల ఎత్తి పోత‌ల ప‌థ‌కానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 130 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో రూపొందించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక‌(డీపీఆర్‌)ను కేంద్రానికి రాష్ట్ర ప్ర‌భుత్వం రెండు నెల‌ల కింద‌టే పంపించింది. అయితే.. తాజాగా ఈ డీపీఆర్‌ను కేంద్ర జ‌ల సంఘం వెన‌క్కి పంపించింది.

ఇది తెలంగాణ‌లో హ‌ర్షాతిరేకాలు నింప‌గా.. ఏపీలో విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. కానీ, కేంద్రం ఇలా వెన‌క్కి పంప‌డ‌మే మంచిదైంద‌ని.. నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సీఎం చంద్ర‌బాబు సైతం దీనిని స్వాగ‌తిస్తున్నారు. తొలి ద‌శ‌లోనే డీపీఆర్ వెన‌క్కి రావ‌డం ఒక‌ర‌కంగా ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే అయినా.. సుప్రీంకోర్టు వ‌ర‌కు ఈ వ్య‌వ‌హారం వెళ్ల‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం మంచి ప‌ని చేసింద‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎందుకు?

పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ లేదా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టును తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది.ఈ ప్రాజెక్టుతో పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు గండిప‌డుతుంద‌ని.. మ‌హ‌బూబాబాద్ స‌హా.. ప‌లు జిల్లాలు నీటి ఎద్ద‌డిని ఎదుర్కొంటాయ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. ముఖ్యంగా గోదావ‌రి నీటిని ఏపీ మ‌ళ్లించేస్తే.. తెలంగాణ‌లో స‌గం జిల్లాలు ఎడారిగా మారే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును అడ్డుకున్నారు.

మ‌రోవైపు.. విభ‌జిత తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జ‌ర‌పాల‌ని.. ఉమ్మ‌డి రాష్ట్రంలో చేసిన నీటి కేటాయింపులే ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం వాదిస్తోంది. ఈ క్ర‌మంలో ఎలాంటి నీటి కేటాయింపు లేకుండానే ఏపీ ప్ర‌బుత్వం బ‌న‌క‌చ‌ర్ల‌కు ముందుకు రావ‌డాన్ని త‌ప్పుబ‌డుతోంది. మ‌రోవైపు.. స‌ముద్రంలో క‌లిసే 2 వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీల‌నే తాము వాడుకుంటామ‌ని ఏపీ చెబుతోంది. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ అంగీక‌రించ‌లేదు.

మ‌రోవైపు.. ఏపీ పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతోంది. సీమ‌కు నీరిచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే డీపీఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపించింది. దీనికి ఓకే అంటే.. తాము సిద్ధ‌మేన‌ని చెప్పింది. అయితే.. కేంద్రం క‌నుక డీపీఆర్‌ను ఆమోదిస్తే.. సుప్రీం కోర్టుకు వెళ్లాల‌ని తెలంగాణ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో డీపీఆర్‌ను కేంద్రం తిర‌స్క‌రించింది.

అస‌లు నీటి కేటాయింపులు లేకుండా ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌డం స‌రికాద‌ని తెలిపింది. సుప్రీంకోర్టుకు తెలంగాణ వెళ్తే..అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని అంచ‌నా వేసింది. దీంతో వెన‌క్కి పంపించ‌డం గ‌మ‌నార్హం. నీటి కేటాయింపుల త‌ర్వాత‌.. దీనిని మ‌రోసారి పంపించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. అయితే.. దీనిని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. చంద్ర‌బాబు నాన్‌ప్లాన్ బెడిసికొట్టింద‌ని ప్ర‌చారంచేస్తుండ‌డం గ‌మ‌నార్హం.