Begin typing your search above and press return to search.

నాన్ స్టాప్ గా 23 ఏళ్లుగా సీఎం.. భారీ రికార్డును సాధించినా సింగిల్ యాడ్ లేదు

చిన్న విజయాలకే పొంగిపోయే ముఖ్యమంత్రుల్ని చూస్తున్నాం. అయినదానికి కానిదానికి భారీ ఎత్తున యాడ్స్ ఇచ్చేయటం.. తమను తాము గొప్పగా చెప్పుకోవటం చూస్తున్నదే. సొంత రాష్ట్రంలో సరిపోనట్లు సంబంధం లేని రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించే సర్కార్లు ఎన్నో ఉన్నాయి

By:  Tupaki Desk   |   23 July 2023 4:46 AM GMT
నాన్ స్టాప్ గా 23 ఏళ్లుగా సీఎం.. భారీ రికార్డును సాధించినా సింగిల్ యాడ్ లేదు
X

చిన్న విజయాలకే పొంగిపోయే ముఖ్యమంత్రుల్ని చూస్తున్నాం. అయినదానికి కానిదానికి భారీ ఎత్తున యాడ్స్ ఇచ్చేయటం.. తమను తాము గొప్పగా చెప్పుకోవటం చూస్తున్నదే. సొంత రాష్ట్రంలో సరిపోనట్లు సంబంధం లేని రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించే సర్కార్లు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వేళలోనూ.. నాన్ స్టాప్ గా 23 ఏళ్ల 141 రోజులు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ.. దేశంలో ఇంతదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేతగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.

వచ్చే ఏడాది వరకు ఒడిశా సీఎంగా గడువు ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నేతల్లో సిక్కింకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పవన్ కుమార్ చామ్లింగ్ ఉన్నారు. ఆయన 24 ఏళ్ల 166రోజులు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన రికార్డుకు దగ్గరగా ఉన్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కమ్యునిస్టు నేత జ్యోతిబసు 23 ఏళ్ల 139 రోజుల పాటు వ్యవహరించారు. దేశంలో అతి దీర్ఘకాలం సీఎంగా పని చేసిన రికార్డు జ్యోతిబసు పేరు మీద ఉండేది.

ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేశారు ఒడిశా ముఖ్యమంత్రి. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆయన.. సీఎంగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు వరుస ఎన్నికల్లో విజయాన్ని సాధించటం ఆయనకే చెల్లుతుంది. వచ్చే ఏడాది (2024)లో ఆ రాష్ట్రానికి మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ నవీన్ పట్నాయక్ విజయం సాధిస్తే.. చామ్లింగ్ పేరు మీద ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోవటం ఖాయమంటారు. ఇంతటి రికార్డును క్రియేట్ చేసిన తర్వాత కూడా సింగిల్ యాడ్ ను ఆయన ప్రభుత్వం కానీ.. ఆయన పార్టీ కానీ ఇచ్చింది లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని ఏ రాజకీయ అధినేత ఇలాంటి రికార్డును సాధించినా.. ఎంతటి హడావుడి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2000 మార్చి ఐదో తేదీని తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా ఐదుసార్లు విజయం సాధించి.. సీఎం సీట్లో కూర్చున్నారు. అది మొదలు ఇప్పటివరకు ఆయనే సీఎంగా కొనసాగుతున్నారు. మొదట్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత అందులో నుంచి బయటకు రావటం.. ఆ తర్వాత ఎన్సీపీతో చేతులు కలిపినా.. అది కూడా తాత్కాలికమే.

గడిచిన రెండు దఫాలుగా సింగిల్ గానే పోటీ చేస్తూ.. విజయం సాధిస్తున్న సీఎం నవీన్ కు చెందిన కొన్ని విషయాలు.. విశేషాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తక్కువగా మాట్లాడటం.. పెద్దగా పరిచయాలు లేకపోవటం.. రాజకీయ స్నేహితులు లేకపోవటంతో పాటు.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఒడిశా ప్రజలు మాట్లాడే ఒరియా సైతం ఆయన మాట్లాడటం రాదు. రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేకుండా గోదాలోకి దిగిన ఆయన.. నాన్ స్టాప్ సీఎంగా ఇంతకాలం రావటం ఒక ఎత్తు అయితే.. సమీప భవిష్యత్తులోనూ ఆయనకు పోటీ వచ్చే వారు కనిపించని పరిస్థితి. ఇంత సుదీర్ఘకాలం అధికారంలో ఉండి కూడా హడావుడి.. హంగు.. ఆర్భాటాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ముఖ్యమంత్రిగా నవీన్ నిలుస్తారు.