ఒడిశాలో అవినీతి బండారం బహిర్గతం… డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్
ఒడిశాలో ఓ ప్రభుత్వ అధికారి అవినీతి లీలలు చూసి సామాన్యులు షాక్‌కు గురవుతున్నారు. కేవలం 30 వేల రూపాయల లంచం కేసులో మొదలైన విచారణ, ఏకంగా కోట్ల రూపాయల గుట్టును రట్టు చేసింది.
By: Madhu Reddy | 25 Feb 2026 10:30 PM ISTఒడిశాలో ఓ ప్రభుత్వ అధికారి అవినీతి లీలలు చూసి సామాన్యులు షాక్‌కు గురవుతున్నారు. కేవలం 30 వేల రూపాయల లంచం కేసులో మొదలైన విచారణ, ఏకంగా కోట్ల రూపాయల గుట్టును రట్టు చేసింది. కటక్ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులకు అల్మారా నిండా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. రాష్ట్ర చరిత్రలోనే ఒక అధికారి వద్ద ఈ స్థాయిలో నగదు దొరకడం ఇదే మొదటిసారి కావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
తీగ లాగితే డొంక కదిలింది:
ఒడిశా గనుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న దేబబ్రత మహంతి అవినీతి బండారం చాలా నాటకీయంగా బయటపడింది. ఒక బొగ్గు వ్యాపారి నుంచి లైసెన్స్ విషయంలో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడితో అయిపోయింది అనుకుంటే పొరపాటే.. ఆయన భువనేశ్వర్‌లోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లి సోదాలు చేసిన అధికారులకు కళ్ళు బైర్లు కమ్మే సన్నివేశలు కనిపించాయి. అల్మారాల్లో దాచి ఉంచిన సుమారు 4 కోట్ల రూపాయల నగదును చూసి అధికారులు సైతం విస్తుపోయారు.
అధికారులకే మైండ్ బ్లాక్:
సాధారణంగా అవినీతి అధికారులు బంగారమో, ఆస్తుల రూపంలోనో సంపాదనను దాచుకుంటారు. కానీ మహంతి మాత్రం ఏకంగా నగదునే గుట్టలుగా పేర్చారు. భువనేశ్వర్‌లోని ఆయన నివాసంలో లభించిన 4 కోట్లతో పాటు, ఆఫీసు టేబుల్‌లో మరో రూ. 1.20 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా 130 గ్రాముల బంగారం, భువనేశ్వర్‌లో ఒక రెండంతస్తుల ఇల్లు కూడా గుర్తించారు. విజిలెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, ఒడిశా రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఇదే తొలిసారి.
కేవలం ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి వద్ద ఇన్ని కోట్లు దొరికాయంటే, గనుల శాఖలో ఇంకెంత అవినీతి జరుగుతోందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేబబ్రత మహంతిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయన వెనుక పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒక సామాన్య వ్యాపారిని లంచం కోసం వేధించడం వల్లే ఈ అక్రమ సామ్రాజ్యం బయటపడింది. ఈ ఘటన ప్రభుత్వ ఆఫీస్ లో జరుగుతున్నా అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది.
లంచం తీసుకోవడం నేరం అని తెలిసినా, అధికారుల అత్యాశ ఇలాంటి నేరాలకు దారితీస్తోంది. ఇలాంటి ఘటనలు బయటపడటం వల్ల వ్యవస్థలో మార్పు రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు.
