Begin typing your search above and press return to search.

బ్యాంకు రూల్స్.. అస్తిపంజరం తీసుకెళ్లిన వ్యక్తి.. అసలు తప్పెవరిది?

ఒడిశాలోని కియోంఘర్ జిల్లాకు చెందిన జితు ముండా సోదరి కల్రా ముండా ఈ ఏడాది జనవరిలో చనిపోయింది.

By:  Madhu Reddy   |   29 April 2026 2:22 PM IST
బ్యాంకు రూల్స్.. అస్తిపంజరం తీసుకెళ్లిన వ్యక్తి.. అసలు తప్పెవరిది?
X

ఒడిశాలో జరిగిన ఒక హృదయవిదారక ఘటనపై అధికారులు స్పందించారు. తన సోదరి బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న కొద్దిపాటి సొమ్ము కోసం ఓ గిరిజనుడు పడిన ఆవేదన అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే స్పందించి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆ సహాయం అందకముందే జరిగిన పరిణామాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మూడు నెలల పాటు బ్యాంక్ చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తన చనిపోయిన సోదరి అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంక్ మెట్లు ఎక్కడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ప్రస్తుతం అతడికి అండగా నిలిచారు. ఆ వివరాలు ఇలా వున్నాయి.

శ్మశానం నుంచి బ్యాంకు దాకా కన్నీటి ప్రయాణం:

ఒడిశాలోని కియోంఘర్ జిల్లాకు చెందిన జితు ముండా సోదరి కల్రా ముండా ఈ ఏడాది జనవరిలో చనిపోయింది. ఆమె అకౌంట్‌లో ఉన్న రూ.19,300 డ్రా చేసేందుకు జితు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే బ్యాంక్ అధికారులు చనిపోయిన వ్యక్తి స్వయంగా రావాలని లేదా సరైన పత్రాలు కావాలని తిప్పించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దీంతో విసిగిపోయిన జితు, తన సోదరి అవశేషాలను మూడు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వెళ్లి బ్యాంకు ముందు ఉంచాడు. "ఇదిగో నా సోదరి వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇస్తారా?" అని ఆయన అడుగుతుంటే చూసేవారికి కడుపు తరుక్కుపోయింది.

బ్యాంక్ మేనేజర్ క్లారిటీ ఇదే:

ఈ ఘటన సంచలనంగా మారడంతో బ్యాంక్ మేనేజర్ స్పందించారు. అసలు విషయం అది కాదని, జితు ముండా బ్యాంకుకు వచ్చినప్పుడు తాగి ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వడానికి నిబంధనల ప్రకారం డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధృవీకరణ పత్రాలు అవసరమని, అవి లేనిదే డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఆ పత్రాలు తీసుకురావాలని చెప్పడంతో కోపంలో ఆయన ఇలా అస్థిపంజరాన్ని తీసుకొచ్చాడని మేనేజర్ తెలిపారు.

గిరిజనులకు అర్థం కాని నిబంధనలు:

ఈ ఘటన వెనుక ప్రధానంగా అవగాహన లోపం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి బ్యాంకు నిబంధనలు, పేపర్ వర్క్ గురించి పూర్తి అవగాహన ఉండదు. చనిపోయిన వెంటనే డెత్ సర్టిఫికేట్ ఎలా పొందాలో, నామినీ లేకపోతే డబ్బులు ఎలా డ్రా చేయాలో వారికి తెలియదు. ఇక ఇలాంటి సమయంలో బ్యాంకు అధికారులు లేదా చదువుకున్న స్థానికులు వారికి సరైన మార్గదర్శకత్వం చేయాల్సి ఉంది. అధికారులు కేవలం "రూల్స్" అని చెప్పి వదిలేయడం వల్ల ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి.

వ్యవస్థలో మార్పు రావాలి:

ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి జితు ముండాకు నచ్చజెప్పారు. ఆయనకు రావాల్సిన డబ్బులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఒక పేదవాడు తన సొంత డబ్బు కోసం శ్మశానాన్ని తవ్వాల్సి రావడం మన వ్యవస్థకే అవమానం. ఇక కేవలం నిబంధనలు అని తిప్పించుకోకుండా, గిరిజనులకు లేదా నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా ఫార్మాలిటీస్ పూర్తి చేయడంలో బ్యాంకులు సహాయం చేయాల్సిన అవసరం ఉంది.

ఒడిశా ఘటన మనందరికీ ఒక పాఠం. చదువుకున్న వారు, సామాజిక కార్యకర్తలు ఇలాంటి పేదవారికి అండగా నిలిచి బ్యాంక్ పనుల్లో సాయం చేయాలి. అధికారులు కూడా మానవత్వంతో ఆలోచించి, కేవలం రూల్స్ పేరుతో సామాన్యులను వేధించకుండా సులభమైన పద్ధతిలో సేవలు అందించాలి. ఇక అప్పుడే మళ్లీ ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు పునరావృతం కాకుండా ఉంటాయి.