నిబంధనల పేరుతో ప్రజలకు ఇక్కట్లు.. ఏకంగా అస్తిపంజరంతో బ్యాంకుకి వెళ్ళిన వ్యక్తి!
తన సోదరి అకౌంట్‌లో ఉన్న కొద్దిపాటి డబ్బుల కోసం ఒక అన్న పడిన ఆవేదన, చివరకు శ్మశానంలో ఉన్న సోదరి అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంకు మెట్లు ఎక్కేలా చేసింది.
By: Madhu Reddy | 28 April 2026 4:04 PM ISTమనుషుల కోసం నిబంధనలు ఉండాలి కానీ, నిబంధనల కోసం మనుషులు బలికాకూడదు. కానీ ఒడిశాలో జరిగిన ఒక ఘోరమైన ఘటన బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. తన సోదరి అకౌంట్‌లో ఉన్న కొద్దిపాటి డబ్బుల కోసం ఒక అన్న పడిన ఆవేదన, చివరకు శ్మశానంలో ఉన్న సోదరి అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంకు మెట్లు ఎక్కేలా చేసింది. ఈ హృదయవిదారక దృశ్యం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి ..
నిబంధనల పేరుతో వేధింపులు:
ఒడిశాలోని కియోంఘర్ జిల్లాకు చెందిన జితు ముండా అనే గిరిజనుడి కథ ఇది. ఈయన సోదరి కల్రా ముండా ఈ ఏడాది జనవరిలో చనిపోయింది. ఆమె అకౌంట్‌లో ఉన్న రూ.19,300 డ్రా చేసేందుకు జితు మూడు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. సోదరి చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ చూపించినా, బ్యాంకు వాళ్ళు మాత్రం "ఖాతాదారుడు స్వయంగా రావాల్సిందే" అని నిబంధనల పేరుతో అతడిని తిప్పించుకున్నాడు.
శ్మశానం నుంచి బ్యాంకు దాకా:
ఇక చనిపోయిన మనిషి ఎలా వస్తుందని అడిగినా అధికారులు కనికరించలేదు. దిక్కుతోచని ఆ అన్న, తన సోదరిని భౌతికంగా చూపిస్తేనే గానీ వీళ్లు డబ్బులు ఇవ్వరని భావించి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. శ్మశానంలో పూడ్చిపెట్టిన తన సోదరి అవశేషాలను తవ్వి తీసి, సుమారు 3 కిలోమీటర్ల దూరం ఆ అస్థిపంజరాన్ని భుజాన మోసుకుంటూ ఒడిశా గ్రామీణ బ్యాంక్‌కు వెళ్లాడు.
అందరినీ కలిచివేసిన దృశ్యం:
బ్యాంకు ప్రాంగణంలో ఆ అస్థిపంజరాన్ని ఉంచి, "ఇదిగో నా సోదరి వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇస్తారా?" అని జితు అడుగుతుంటే అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఆ గిరిజనుడి కళ్ళలోని ఆవేదన, ఆ నిస్సహాయత చూసి చుట్టుపక్కల వారు కన్నీరుమున్నీరయ్యారు. ఒక పేదవాడు తన సొంత డబ్బు కోసం ఇంతటి దారుణమైన పని చేయాల్సి రావడం మన వ్యవస్థకే అవమానమని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రజల ఆగ్రహం.. ఇదేం వ్యవస్థ:
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జనం తీవ్రంగా స్పందిస్తున్నారు. అధికారులకు కనీస బాధ్యత లేదా? చనిపోయిన మనిషిని తీసుకురమ్మని ఎలా అడుగుతారు?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "కార్పొరేట్ సంస్థలు రూల్స్ ఉల్లంఘించిన పట్టించుకోని బ్యాంకులు, ఒక పేదవాడు తన అవసరానికి దాచుకున్న డబ్బుల కోసం ఇలాంటి వింత నిబంధనలతో వేధించడం ఏంటని?" ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మొండితనం వల్లే ఆ అన్న అంతటి ఘోరానికి ఒడిగట్టాడని జనం వాపోతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జితు ముండాకు నచ్చజెప్పారు. ఆయనకు అండగా ఉంటామని, డబ్బులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. మానవత్వం లేని అధికారుల తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
డబ్బు ఉండి కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ అన్న వేదన వర్ణనాతీతం. ఆకలి కోసమో, అవసరం కోసమో ఆ కొద్దిపాటి సొమ్ము కోసం అస్థిపంజరాన్ని మోయాల్సి రావడం ఎంతో బాధాకరం. ఇక ఇప్పటికైనా బ్యాంకింగ్ వ్యవస్థలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సరళమైన నిబంధనలు తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు.
