32 ఏళ్ల సర్వీసు.. రూ.వందల కోట్లు.. 115 ప్లాట్లు.. ఎవరీ అధికారి!
ఈ సెర్చ్ ఆపరేషన్ లో ముగ్గురు డీఎస్పీలు, 10 మంది ఇనిస్పెక్టర్లు, ఇతర సహాయక సిబ్బంది పాల్గొన్నారు.
By: Tupaki Desk | 22 July 2025 9:25 AM ISTఆదాయనికి ఆస్తులు సంపాదించడం మొదలు పెడితే తనకంటే బాగా ఎవరూ సంపాదించలేరన్నట్లుగా ఓ ప్రభుత్వ అధికారి వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది! గత రికార్డులను చెరిపేస్తూ ఆయన వందకు పైగా ప్లాట్లు కలిగి ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా 32 ఏళ్ల సర్వీసులో వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇతని ఆస్తుల వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి!
అవును... ఒడిశా విజిలెన్స్ అధికారులు ఒక ప్రధాన ఆపరేషన్ లో భాగంగా.. కెండు లీఫ్ డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌వో) నిత్యానంద నాయక్ తో సంబంధం ఉన్న ఏడు ప్రదేశాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. అంగుల్, కియోంఝర్, నయాఘర్ జిల్లాల్లో ఈ దాడులు జరిగాయి!
ఈ సెర్చ్ ఆపరేషన్ లో ముగ్గురు డీఎస్పీలు, 10 మంది ఇనిస్పెక్టర్లు, ఇతర సహాయక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ.ఎఫ్.వోకి సంబంధించిన నివాస, కార్యాలయం, ఇతర ప్రాంగణాలను క్షుణ్ణంగా స్కాన్ చేసిందని అంటున్నారు. ఈ సమయంలో అతడితో పాటు అతని కుటుంబ సభ్యులపై ఉన్న మొత్తం 115 ప్లాట్లను విజిలెన్స్ అధికారులు గుర్తించారని అంటున్నారు.
ఇందులో భాగంగా... 53 నిత్యానంద నాయక్ పేరు మీద, 42 ఆయన భార్య పేరు మీద, 16 ఆయన కుమారుల పేరు మీద, 4 ఆయన కుమార్తె పేరు మీద ఉన్నాయని అధికారులు గుర్తించారు. మరోవైపు అంగుల్ లోని తురంగలో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు అంతస్తుల ఇల్లు, రూ. 1.55 లక్షల నగదు కూడా దొరికాయని చెబుతున్నారు.
విజిలెన్స్ వెలికితీసిన ఇతర ఆస్తులలో టేకు కళాఖండాల నిధితో పాటు 200 గ్రాముల బంగారం, రెండు కార్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. అంగుల్, కియోంఝర్, నయాఘర్ జిల్లాల్లోని ఏడు ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. ఇటీవలి కాలంలో జరిగిన దాడుల్లో బయటపడిన అత్యధిక ప్లాట్లు ఇవేనని చెబుతున్నారు.
గత ఏడాది ఆగస్టులో కియోంఝర్ లోని ఆనంద్ పూర్ బ్యారేజ్ ప్రాజెక్ట్ చీఫ్ కనస్ట్రక్షన్ ఇంజనీర్ కు చెందిన 105 ప్లాట్లు అక్రమ ఆస్తుల కేసులో బయటపడినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా... నాయక్ 1992లో ఫారెస్ట్ రేంజర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరగా.. తర్వాత అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్), డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్), డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) వంటి వివిధ హోదాల్లో పనిచేశారు.
