Begin typing your search above and press return to search.

కాడెద్దులుగా ప్రేమికుల్ని మార్చి కొడుతూ షాకింగ్ శిక్ష!

వారే చేసిన తప్పల్లా.. ప్రేమించి పెళ్లి చేసుకోవటమే. అది కూడా ఎవరో కాదు. సొంత అత్త కూతుర్ని ప్రేమించి పెళ్లాడాడు.

By:  Tupaki Desk   |   12 July 2025 9:45 AM IST
కాడెద్దులుగా ప్రేమికుల్ని మార్చి కొడుతూ షాకింగ్ శిక్ష!
X

వారే చేసిన తప్పల్లా.. ప్రేమించి పెళ్లి చేసుకోవటమే. అది కూడా ఎవరో కాదు. సొంత అత్త కూతుర్ని ప్రేమించి పెళ్లాడాడు. అదే తీవ్రమైన నేరమైంది. తమ మాటను కాదని,. ఊరి కట్టుబాటుకు భిన్నంగా ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రేమికులకు ఆ ఊరి పెద్దలు విధించిన శిక్ష షాకింగ్ గా మారటమే కాదు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తమ మాటకు భిన్నంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమికులను కాడెద్దులుగా మార్చి. కొడుతూ.. పొలాన్ని దున్నించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దారుణం ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని కంజామఝిరా అనే ఊరికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన తన అత్త కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఈ గ్రామంలో అత్త కూతురు వరస అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నిషేధం.

అంటే. మరదల్ని ఆ ఊరి సంప్రదాయం ప్రకారం పెళ్లాడకూడదు. ఆ ఊళ్లో అత్త వరస అయ్యే వారి కుమార్తెల్ని పెళ్లి చేసుకోకూడదు. ఈ సంప్రదాయానికి భిన్నంగా వారు ప్రేమ పెళ్లి చేసుకోవటంతో ఆగ్రహించిన గ్రామస్థులు.. ఆ జంటను ఒక నాగలికి కాడెద్దలుగా కట్టారు. వారిని కర్రలతో కొడుతూ.. ఈడ్చుకుంటూ పొలాన్ని దున్నించారు.

అనంతరం వారిని ఊళ్లోని గుడికి తీసుకెళ్లి శుద్ధి కర్మలు చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ కావటం.. అది కాస్తా వైరల్ కావటంతో పోలీసులు ఈ అంశంపై స్పందించారు. ఈ వీడియో తమవరకు వచ్చిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.