వందకి 102 మార్కులు..!? శభాష్ అనాలా.. షాక్ అవ్వాలా?
ఒడిశాకు చెందిన విశ్వజీత్ అనే విద్యార్థి తన ప్లస్-2 ఫలితాలు చూసుకుని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
By: Tupaki Political Desk | 23 May 2026 9:38 AM ISTఎక్కడైనా పరీక్ష రాస్తే వందకు వంద మార్కులు రావడం విద్యార్థి ప్రతిభకు నిదర్శనం, అత్యున్నత ఘనత. కానీ, పరీక్ష రాసింది వంద మార్కులకు అయితే.. ఏకంగా 102 మార్కులు వస్తే ఏమనాలి? చదవడానికి వింతగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం..! ఒడిశా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (CHSE) నిర్వహించిన 12వ తరగతి (ప్లస్ 2) బోర్డు పరీక్షల ఫలితాల్లో ఈ చిత్రమైన ఘటన వెలుగుచూసింది.
బిత్తరపోయిన విద్యార్థి!
ఒడిశాకు చెందిన విశ్వజీత్ అనే విద్యార్థి తన ప్లస్-2 ఫలితాలు చూసుకుని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మిగిలిన సబ్జెక్టుల సంగతి పక్కన పెడితే, ఇంగ్లిష్ పేపర్‌లో అతనికి 100 మార్కులకు 102 మార్కులు వచ్చాయి. ఈ మార్కుల షీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు బోర్డు మూల్యాంకన తీరుపై సెటైర్లు వేస్తున్నారు. ఐన్‌స్టీన్‌ను మించిన మేధావి అంటూ కొందరు జోకులు పేలుస్తుంటే, విద్యార్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై ఒడిశా CHSE అధికారులు స్పందిస్తూ.. ఇది కేవలం కంప్యూటర్/డేటా ఎంట్రీ తప్పిదం మాత్రమేనని, వాల్యుయేషన్‌లో తప్పు జరగలేదని సమర్థించుకున్నారు. వారం రోజుల్లోగా ఈ పొరపాటును సవరించి, విద్యార్థికి సరైన మార్కుల జాబితాను అందిస్తామని ప్రకటించారు.
ఇలాంటి 'చిత్రవిచిత్రాలు' ఎన్నో!
ఒడిశా విద్యా మండలి వెలువరించిన ఫలితాల్లో ఇలాంటి వింతలు జరగడం ఇదే మొదటిసారి కాదు. మరికొన్ని విచిత్రమైన ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. పరీక్ష రాయకుండా గైర్హాజరైన విద్యార్థులకు కూడా కొన్ని సబ్జెక్టుల్లో పాస్ మార్కులు, మరికొన్ని చోట్ల ఫస్ట్ క్లాస్ మార్కులు వేసిన ఉదంతాలు వెలుగుచూశాయని అంటుననారు. అదేసమయంలో బాగా చదివే విద్యార్థులకు సింగిల్ డిజిట్ మార్కులు రావడం, రీ-వెరిఫికేషన్ లో వారు స్టేట్ టాపర్లుగా తేలడం వంటి నిర్వాకాలు కూడా గతంలో జరిగాయి.
ఒకే నంబర్‌తో ఇద్దరు
ఒకే రోల్ నంబర్‌పై ఇద్దరు వేర్వేరు విద్యార్థుల మార్కులు డిస్‌ప్లే కావడం, ఒకరి ఫోటో స్థానంలో మరొకరి ఫోటో రావడం వంటి సాంకేతిక లోపాలు విద్యార్థులను తరచూ అయోమయానికి గురిచేస్తూనే ఉన్నాయి. ఒడిశాలోనే కాదు.. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చివరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా బోర్డుల పొరపాట్ల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ‘సాంకేతిక లోపం’ అని అధికారులు తేలిగ్గా చెప్పేసే ఒక్క మాట వెనుక ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
