Begin typing your search above and press return to search.

అమెరికా కలలకు కొత్త మార్గం!

1990లో ప్రవేశపెట్టిన యూఎస్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ కింద ఈ వీసా అందుబాటులోకి వచ్చింది. ఇది సాధారణ వీసా కాదు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 11:12 PM IST
అమెరికా కలలకు కొత్త మార్గం!
X

అమెరికాలో స్థిరపడాలనే కలలు కనేవారికి ఇప్పుడు ఓ సరికొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ప్రారంభమైన కఠిన వలస విధానాల మధ్య కూడా 'ఓ-1' వీసా భారతీయ వృత్తి నిపుణులను విపరీతంగా ఆకర్షిస్తోంది. హెచ్‌-1బీ వీసాకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా మారుతున్న ఈ వీసాపై దేశీయ నిపుణులు ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

- ఏంటి ఈ ఓ-1 వీసా?

1990లో ప్రవేశపెట్టిన యూఎస్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ కింద ఈ వీసా అందుబాటులోకి వచ్చింది. ఇది సాధారణ వీసా కాదు. అసాధారణ ప్రతిభ, అద్భుత నైపుణ్యాలు కలిగినవారికి మాత్రమే ఈ వీసా మంజూరు చేస్తారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెటిక్స్ (O-1A) విభాగాల్లో అలాగే ఆర్ట్స్, సినిమాలు, టీవీ రంగాలలో (O-1B) అంతర్జాతీయ గుర్తింపు పొందినవారికి ఇది వర్తిస్తుంది.

- అర్హతలు ఏమిటి?

ఓ-1 వీసా దరఖాస్తుదారులు ఎనిమిది నిర్దిష్ట ప్రమాణాలలో కనీసం మూడు తీరినట్లయితే అర్హత పొందవచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి .. అంతర్జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం.. శాస్త్రీయ పబ్లికేషన్లు కలిగి ఉండటం.. ప్రముఖ సంస్థలలో సభ్యత్వం.. మీడియా కవరేజీ.. ఇతరులకు శిక్షణ ఇచ్చిన అనుభవం కలిగి ఉన్న వారికి అమెరికాలో ఈ వీసా లభిస్తుంది.

-లాటరీ విధానం లేదు.. మంజూరు రేటు ఎక్కువ

ఓ-1 వీసా యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇది హెచ్‌-1బీ వీసాలా లాటరీ ఆధారంగా మంజూరు కాదు. దరఖాస్తుదారుల్లో సుమారు 93% మందికి వీసా మంజూరవుతోంది. ఇది హెచ్‌-1బీ వీసా (37% మాత్రమే)తో పోలిస్తే చాలా అధిక శాతం. మొదట మూడేళ్లపాటు వీసా ఇచ్చినా.. ఆ తర్వాత అనేకసార్లు పొడిగించుకునే అవకాశం ఉంది.

-ఓ-1 వీసా ఖర్చులు

ఇంత ప్రభావవంతమైన వీసా కావడంతో దాని ఖర్చు కూడా ఎక్కువే. ఓ-1 వీసా దరఖాస్తు ఖర్చు $10,000 నుంచి $30,000 వరకు ఉండవచ్చు. ఇది సాధారణ హెచ్‌-1బీ దరఖాస్తు ($970 నుంచి $7,775) కంటే ఎక్కువే అయినప్పటికీ మంజూరు అయ్యే అవకాశం అధికంగా ఉండటంతో అభ్యర్థులు ఈ దిశగా మొగ్గుచూపుతున్నారు.

-భారతీయుల సంఖ్య పెరుగుతోంది

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం, 2020లో 487 మంది భారతీయులు ఈ వీసా పొందగా, 2023 నాటికి ఆ సంఖ్య 1418కి పెరిగింది. బ్రిటన్, బ్రెజిల్ తర్వాత భారత్ ఈ వీసా ఎక్కువగా పొందుతున్న దేశంగా నిలిచింది.

టెక్ దిగ్గజాల నుండి విశ్వవిద్యాలయాల వరకు ఆదరణ

గూగుల్, టెస్లా, ఓపెన్ఏఐ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఓ-1 వీసా ద్వారా నియామకాలు చేపడుతున్నాయి. హార్వర్డ్, కొలంబియా వంటి పేరెన్నికగల విశ్వవిద్యాలయాలు కూడా ఫ్యాకల్టీ, రీసెర్చర్లను ఈ వీసా ద్వారా నియమించుకుంటున్నాయి.

ఓ-1 వీసా ఇప్పుడు అమెరికా కలలను నిజం చేసుకోవాలనుకునే వృత్తి నిపుణులకు ఆశాజ్యోతి లాంటి మార్గం. లాటరీ లేకుండా, మంజూరుకు అధిక అవకాశం ఉండటం, పొడిగించుకునే వీలుండటం వంటివి ఈ వీసా యొక్క ప్రత్యేకతలు. ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ఈ వీసా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా ప్రవేశ ద్వారాలు మూసుకుపోతున్న తరుణంలో, ఓ-1 వీసా మాత్రం అవకాశాల చెరువుగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.