9 భాషల్లో తెరకెక్కి 8 చోట్ల సంచలనం.. యాక్సిడెంటల్ డైరెక్టర్ గొప్పతనం!
తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` విడుదలైన 21 ఏళ్లు పూర్తి చేసుకుంది.
By: Sivaji Kontham | 28 March 2026 5:00 AM ISTతెలుగు సినీ చరిత్రలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` విడుదలైన 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. సిద్ధార్థ్- త్రిష జంటగా నటించిన ఈ సినిమా 2005లో విడుదలై సంచలన విజయం సృష్టించింది. ఈ సినిమాతోనే కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడిగా పరిచయం అయ్యారు. నిర్మాత ఎం.ఎస్. రాజు పట్టుబట్టడంతో ప్రభుదేవా మెగాఫోన్ పట్టి మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యధిక భాషల్లో రీమేక్ అయిన భారతీయ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. మొత్తం 9 భాషల్లో ఈ సినిమాను పునర్నిర్మించారు. తమిళం, హిందీ, కన్నడ నుంచి మణిపురి, నేపాలీ వరకు అన్ని చోట్లా ఈ కథ అలరించింది. విశేషమేమిటంటే రీమేక్ చేసిన 9 భాషల్లో 8 చోట్ల ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.
సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇందులోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. సంపన్న యువకుడు, పల్లెటూరి అమ్మాయి మధ్య సాగే ప్రేమకథను చాలా అందంగా చూపించారు. ముఖ్యంగా హీరో పొలంలో కష్టపడే దృశ్యాలు.. క్లైమాక్స్ ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. హీరోయిన్ అన్నయ్యగా శ్రీహరి నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.
అవార్డుల పరంగా కూడా ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఒకే సినిమాకు ఏకంగా 9 ఫిలింఫేర్ అవార్డులు రావడం అప్పట్లో ఒక సంచలనం. అలాగే 5 నంది అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది. సిద్ధార్థ్‌కు టాలీవుడ్‌లో `లవర్ బాయ్` ఇమేజ్‌ను ఈ సినిమానే తెచ్చిపెట్టింది. త్రిష కెరీర్‌లో కూడా ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నేటికీ టీవీలో ఈ సినిమా వస్తే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు.
కాలం మారుతున్నా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రేమ, సెంటిమెంట్, కామెడీ కలగలిసిన ఈ చిత్రం ఎప్పటికీ ఒక `ఎవర్ గ్రీన్ క్లాసిక్`. 21 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోందంటే అది ఆ కథలో ఉన్న గొప్పతనం. మంచి కథకు భాషా భేదాలు ఉండవని.. అన్ని ప్రాంతాల వారూ ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. భారతీయ సినిమా గర్వించదగ్గ ప్రేమకథల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది.
