Begin typing your search above and press return to search.

సీజ్ ఫైర్ వల్ల ఎవరికి లాభం.. ఇది తెలుసుకోవాల్సిన విషయం!

ఈ సమయంలో ట్రంప్ ముందుగా ప్రకటించారనే సమస్య ఒక్కటి కాసేపు పక్కనపెడితే... శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని ప్రపంచదేశాలు స్వాగతించాయి.

By:  Tupaki Desk   |   13 May 2025 12:23 PM IST
సీజ్ ఫైర్ వల్ల ఎవరికి లాభం.. ఇది తెలుసుకోవాల్సిన విషయం!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం... భారతీయులంతా ప్రతీకార జ్వాలతో రగిలిపోయారనే చెప్పాలి! అనంతరం చేపట్టిన.. ఆపరేషన్ సిందూర్ తో చాలా మంది సంతృప్తి చెందారని.. ప్రతీకారం తీర్చుకున్నామని భావించారు. ఈ క్రమంలో... భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.. పాక్ యుద్ధం ప్రకటించేసింది. సరిహద్దులు వేడెక్కిపోయాయి.

సరిహద్దు ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. పిల్లలను తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముసలివారిని తీసుకుని వెళ్లక తప్పని పరిస్థితి. పగలు, రాత్రి అని తేడా లేకుండా పాక్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తుంటే.. ఆ శబ్ధాలకే వణికిపోయే పరిస్థితి. ఇది సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఉండి అనుభవించేవారికి మాత్రమే తెలిసే అనుభవం.

ఈ సమయంలో ట్రంప్ ముందుగా ప్రకటించారనే సమస్య ఒక్కటి కాసేపు పక్కనపెడితే... శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని ప్రపంచదేశాలు స్వాగతించాయి. అందుకు ప్రధాన కారణం... ఇరు దేశాలు పెద్ద ఎత్తున అణ్వాయుధాలను కలిగి ఉన్నవి కావడమే!

అవును... భారత్, పాక్ లు అణ్వాయుధాలు కలిగిన దేశాలు. ఇలాంటి రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే, తప్పని పరిస్థితుల్లో, వీటిలో ఏ ఒక్క దేశ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే ఆలోచన వచ్చినా.. వెంటనే వాటిని బయటకు తీస్తుంది. అప్పుడు సుమారు 80 ఏళ్ల తర్వాత్ర ఈ ప్రపంచం తొలిసారిగా అణ్వాయుధాల దాడి, తదనంతర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది.

వాస్తవానికి.. 1945లో తొలిసారి అణుబాంబు దెబ్బ ఈ భూమి చూసింది! హిరోషిమా, నాగసాకి మీద పడిన అణుబాంబులు ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... ఆ ప్రాంతం కొన్నాళ్ల పాటు శాపగ్రస్థమైన నేలగా మిగిలిపోయింది. నీరు ఉండదు, పంట పండదు, అక్కడ నేలే కాదు.. గాలి కూడా విషతుల్యం అయిపోయింది!

ఆ ఫలితం చూసిన ప్రపంచం... ఆ తర్వాత జరిగిన ఏ యుద్ధంలోనూ అణ్వాయుధాలను బయటకు తీయాలనే ఆలోచన కూడా చేయలేదు! అంత ప్రభావం కలిగించాయి ఆ బాంబులు. అవి ఆ రెండు నగరాలపై దాడి చేసి 80 ఏళ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ దాడి కలిగించిన జ్ఞాపకాలు చరిత్ర చదివితేనే వణికిపోయేలా ఉన్నాయని అంటారు.

అయితే... ఆ విషయం తెలియక కొంతమంది, తెలిసినా మనవరకూ రాదులే అనే ధైర్యంతో ఇంకొంతమంది, అణు యుద్ధం ప్రభావం గురించి అవగాహన లేని అజ్ఞానంతో మరికొంతమంది... భారత్ - పాక్ తీసుకున్న చీజ్ ఫైర్ అంగికారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అలాంటివారికోసం అణుబాంబు ఎఫెక్ట్ ని అర్ధమయ్యేలా చెబుతున్నారు నిపుణులు!

ఇందులో భాగంగా... 1945లో హిరోషిమా, నాగసాకీలపై పడిన అణుబాంబులతో పోలిస్తే... ఇప్పుడు భారత్, పాకిస్థాన్ ల వద్ద ఉన్న అణుబాంబులు సుమారు 20 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవని చెబుతున్నారు. అలాంటి బాంబు ఒక్కటి భూమిపై పడితే.. ముందుగా అది పడిన నలుగైదు కి.మీ. విస్తీర్ణంలో ఉన్న సమస్తం బూడిదకూడా కనిపించకుండా ఆవిరైపోతుంది.

ఆ తర్వాత కొన్ని పదుల కి.మీ. వరకూ జనానికి ఘోరంగా చర్మ కాలిపోయి చనిపోతారు. అనంతరం మరో 5 కి.మీ. వరకూ మొత్తం శిథిలాలు కనిపిస్తాయి.. ఆ తర్వాత గాలివాటాన్ని బట్టి సుమారు 100 కి.మీ. వరకూ రేడియేషన్ ప్రభావం వల్ల ప్రజలకు చర్మ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు రావడంతో పాటు.. నీరు, నేల, గాలి పూర్తిగా కలుషితమైపోతుంది.

సరే... అదేదో మనమే ముందుగా పాకిస్థాన్ పై వేస్తే అనే ఆలోచన కూడా చాలా మందికి రావొచ్చు. పాకిస్థాన్ చిన్నది కాబట్టి.. దానిపై ఎక్కడ అణుబాంబు వేసినా దాని ప్రభావం భారత్ పై ఉంటుంది! ఇక భారత్ పై సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కడ వేసినా.. దాని ప్రభావం పాకిస్థాన్ పైనా ఉంటుంది. ఫైనల్ గా ఇరు దేశాలు మరో హిరోషిమా, నాగసాకీలకు ప్రతిరూపాలయ్యే అవకాశం ఉంది!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... అణ్వాయుధాలు ఉన్నవి మరో దేశం మనపై దాడి చేయకుండా చూసుకుకోవడానికే తప్ప.. మనం దాడి చేయడానికి కాదనేది.. ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగి ఉన్న ప్రతీ దేశం మదిలో పెట్టుకున్న ప్రాథమిక సూత్రం అని అంటారు! ఈ విషయం తెలియని చాలా మంది సీజ్ ఫైర్ విషయంలో ప్రభుత్వం పై ఫైర్ అయిపోతున్నారని చెబుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... భారత్ లక్ష్యం ఉగ్రవాదుల వినాశనం. దానికోసం దేశంలో నక్సలైట్స్ కోసం కూంబింగ్ చేస్తున్నట్లు.. పాకిస్థాన్ లో దాక్కొన్న ఉగ్రవాదుల గురించి సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ లు.. మనపై దాడి జరిగినప్పుడు మాత్రమే కాకుండా, వారి గురించిన నిఘా సమాచారం వచ్చిన ప్రతీసారి చేసేయ్యాలి.. దొరికనవారిని ఏరిపారెయ్యాలి!

విశ్వగురుగా పరిణమిస్తున్న భారత్ అనుసరిస్తున్న శాంతి మంత్రంలో ప్రాక్టికాలిటీ దాగి ఉందని.. అది లివ్ అండ్ లెట్ లివ్ పాలసీని కలిగి ఉందని ప్రపంచానికి చెప్పినట్లవుతుంది. సో... అణుయుద్ధం అంటే ఐపీఎల్ మ్యాచ్ కాదు.. లుంగీ కట్టుకుని, మెడచుట్టూ పౌడర్ పూసుకుని, టీవీ ముందు కూర్చుని చూడటానికి అనేది పరిశీలకుల మాటగా ఉంది!