Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పేరుతో వంద నాణెం... విడుదల తేదీ ఎప్పుడంటే...?

ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి భవన్‌ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 12:43 PM GMT
ఎన్టీఆర్  పేరుతో వంద నాణెం... విడుదల తేదీ ఎప్పుడంటే...?
X

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ.100 నాణేన్ని ముద్రించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరుతో రూపొందించిన రూ.100 నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు.

అవును... ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణేన్ని ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి భవన్‌ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

ఈ రూ.100 నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు. 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది. వీటితోపాటు ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇక ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం ఉండగా.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం ఉందని.. ఆయన చిత్రం కింద "శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి 1923-2023" అని ముద్రించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

కాగా... చారిత్రక ఘటనలు, ప్రముఖుల గుర్తుగా నాణెలు విడుదల చేయడం ఆనవాయితీ వస్తోన్న సంగతి తెలిసిందే. 1964 నుంచి కేంద్రప్రభుత్వం ఈ రకంగా నాణేలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా... మొదటిసారి మాజీ ప్రధాని నెహ్రూ వెండి నాణెం విడుదల చేసింది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సారి ఎన్టీఆర్ పేరుతో నాణేన్ని విడుదల చేయనుంది!

ఇక అటు సినిమా రంగంలో తనదైన ముద్రవేసుకున్న ఎన్టీఅర్... రాజకీయ రంగంలోనూ చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29న తెలుగు దేశం జెండాను ఎగరేశారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోపే అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.