Begin typing your search above and press return to search.

ఆయన మన్మోహనం.. ఈయన సమ్మోహన తారకం.. భారత రత్నాలే కదా?

అయితే.. 2019లో చివరిసారిగా ఈ అవార్డును భూపేస్ హజారికాకు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లు మౌనంగా ఉంది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 9:25 AM GMT
ఆయన మన్మోహనం.. ఈయన సమ్మోహన తారకం.. భారత రత్నాలే కదా?
X

'భారత రత్న’ దేశ అత్యున్నత పౌర పురస్కారం. దేశానికి ఎనలేని సేవలందించిన వారిని అత్యున్నతంగా గౌరవించే పురస్కారం. అయితే.. 2019లో చివరిసారిగా ఈ అవార్డును భూపేస్ హజారికాకు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లు మౌనంగా ఉంది. ఎన్నికల ముంగిట ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి భారత రత్న ఇచ్చింది. అందులో ఒకరు తెలుగు రత్నం పాములపర్తి వెంకట నరసింహారావు. తొలుత కర్పూరీ ఠాకూర్ (బిహార్ మాజీ సీఎం), ఎల్ కే ఆడ్వాణీ (మాజీ ఉప ప్రధాని)లకు భారత రత్న ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు పీవీ, మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ విప్లవ పితామహుడు స్వామినాథన్ లను ఎంపిక చేసింది. మరి.. తెలుగు నేలను ఉర్రూతలూగించిన నట రత్నం నందమూరి తారక రామారావు భారత రత్నం కాదా..? పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు సారథ్యం వహించిన మన్మోహన్ సింగ్ భారత రత్న కాదా? వీరిద్దరూ అర్హులే కదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అన్నకు అందేదెప్పుడో?

జీవిత చరమాంకంలో చోటుచేసుకున్న కొన్ని పరిస్థితులు తప్ప నందమూరి తారక రామారావు అనే పేరు ఇప్పటికీ చిరస్మరణీయమే. మూడున్నర దశాబ్దాల పాటు చిత్ర రంగాన్ని ఏలి.. మూడున్నర దశాబ్దాల నుంచి ఉమ్మడి ఏపీని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీని తొమ్మిది నెలల్లోనే పడగొట్టిన తెలుగు దేశాధినేత ఆయన. రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించిన ప్రయోగశీలి ఆయన. సమున్నత వ్యక్తిత్వం.. అంతకుమించిన క్రమశిక్షణ.. దాన్నిమించిన పట్టుదల.. ఎన్టీఆర్ అనే పేరుకు సొంతం. మూడుసార్లు ఉమ్మడి ఏపీ సీఎంగా, కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ సారథిగా రాజకీయంగానే ఆయనది అంతే గొప్ప ప్రస్థానం. కోట్లాదిమంది తెలుగువారికి రాముడు, క్రిష్ణుడు ఆఖరికి రావణాసురుడు కూడా ఎన్టీఆరేనంటే ఆయన ఎంతగా మనసుల్లో పాతుకుపోయారో తెలుసుకోవచ్చు. మరి అలాంటి ఎన్టీఆర్ మరణించి 27 ఏళ్లు అవుతోంది. ఆయన భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటికే కొన్ని వందలసార్లు కేంద్రానికి చేరింది. కానీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కీలక పాత్ర పోషించిన థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏవీ పట్టించుకోలేదు.

ఆ పన్మోహనుడికి..

భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు డాక్టర్ మన్మోహన్ సింగ్. సరిగ్గా నిన్నటితో ఆయన రాజకీయ జీవితం కూడా పూర్తయింది. 91 ఏళ్ల మన్మోహన్ ఇక ప్రజా జీవితంలో లేనట్లే. ఇన్నేళ్ల జీవితంలో ఆయన ఓ గొప్ప ఆర్థికవేత్తనే కాదు.. ఉత్తముడైన ప్రధాని. అవినీతి మరకలేని నాయకుడు. అన్నిటికీ మించి భారత్ వంటి ఒక అతిపెద్ద దేశాన్ని ఆర్థిక సంస్కరణలు అనే ప్రగతి రథం ఎక్కించిన గొప్ప సారథి. మన దేశం 30 ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పటితరానికి తెలిసి ఉండదు. కానీ, వారి చేతిలో ఉన్న సెల్ ఫోన్, ఇంట్లో ఉన్న కంప్యూటర్, ఇంటికే వస్తున్న ఆన్ లైన్ సర్వీసులు.. మార్కెట్లో దొరుకుతున్న విదేశీ సరుకులు ఇవన్నీ మన్మోహన్ చేపట్టిన సంస్కరణల ఫలితమే. అందుకే ఆయన భారత రత్నకు అర్హుడు.

కొసమెరుపు: పీవీ సహా ఐదుగురికి ఈ ఏడాది భారత రత్న ప్రకటన తర్వాత ఎన్టీఆర్, మన్మోహన్ ల ప్రస్తావన వస్తోంది. వాస్తవానికి మన్మోహన్ ను దేశానికి పరిచయం చేసిందే పీవీ. అలాంటి పీవీకి ఈసారి ఎట్టకేలకు భారత రత్న దక్కింది. మరి ఎన్టీఆర్ అంటే.. తమిళుల ఆరాధ్య నటుడు ఎంజీఆర్ సమకాలీనుడు. కీర్తి ప్రతిష్ఠల్లో ఆయనకు ఏమాత్రం తగ్గనివారు. అయినా ఎంజీఆర్ కు ఆయన చనిపోయిన ఏడాదికే భారత రత్న దక్కింది. మన తెలుగువారి ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ కు మాత్రం ఇంతవరకు అందనేలేదు.