Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వైఎస్సార్ ఎప్పటికీ రాజకీయ అస్త్రాలేనా ?

చంద్రబాబు మీద వైసీపీ నేతలు తరచూ చేసే ఆరోపణ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారు అని.

By:  Satya P   |   10 April 2026 9:15 AM IST
ఎన్టీఆర్ వైఎస్సార్ ఎప్పటికీ రాజకీయ అస్త్రాలేనా ?
X

ఉమ్మడి తెలుగు రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసిన వారు ఆ ఇద్దరూ. వారు మరణించినా జన హృదయాలలో ఇప్పటికీ జీవించి ఉన్నారు. వారి పట్ల పార్టీలకు రాజకీయాలకు అతీతమైన అభిమానం ఉంది. తెలుగు జాతికి ఈ ఇద్దరూ గుర్తిండిపోయే నేతలుగా ఉన్నారు. అయితే చిత్రంగా ఈ ఇద్దరిని అంటిపెట్టుకుని రెండు ప్రాంతీయ పార్టీలు కూడా కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో కాదేదీ విమర్శలకు అతీతం అన్నట్లుగా పరస్పర రాజకీయ విమర్శల హోరులో భీకర పోరులో దివంగతులు అయిన ఈ ఇద్దరు నేతల పేర్లను కూడా తరచూ ముందుకు తెస్తున్నారు. దాంతో రాజకీయాలను పక్కన పెట్టి ఈ మహా నాయకులను అభిమానించే వారంతా నొచ్చుకోవడం జరుగుతోంది.

దివంగతులైనా కూడా :

ఎన్టీఆర్ మరణించి మూడు దశాబ్దాలు అయింది. వైఎస్సార్ గతించి 17 ఏళ్ళు అవుతోంది. అయినా సరే ఈ ఇద్దరి ప్రస్తావన తెలుగు రాజకీయాల్లో తప్పనిసరిగా ఉంటోంది. అది మంచికి అయితే ఫరవాలేదు కానీ విమర్శలకు ఎదుటి వారిని ఇరుకున పెట్టేందుకు వీరి పేర్లను వాడుకోవడమే రాజకీయ విడ్డూరం. విషాదం అని అంటున్నారు. నిజాలు కానివి నిందలుగా ఉన్నవి కూడా విమర్శలు అస్త్రాలుగా మారిపోతూంటాయి. ఆ విధంగా భౌతికంగా జీవించి ఉన్న వారి మీద విమర్శలు చేస్తే వారి నుంచి సరైన కౌంటర్లు ఉంటాయి. అయితే మరణించిన వారిని ముందు పెట్టి చేసే విమర్శలలో సహేతుకతను పక్కన పెడితే నైతికత ఎంతవరకూ అన్నది మరో చర్చ. వారు తమ మీద ఆరోపణలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది కదా అంటున్నారు. అంతే కాదు భౌతిక కాయాన్ని ఈ పంచ భూతాలకు అప్పగించేసి దివికేగిన వారి మీద విమర్శలు చేయడం ఏ మేరకు సబబు అన్నది కూడా మేధావుల నుంచి చర్చగా ముందుకు వస్తోంది.

వ్యక్తిత్వ హననం ఆయుధం :

ఇక రాజకీయాల్లో గతంలో లేని ధోరణి వ్యక్తిత్వ హననం. గతంలో ఒకరి మీద ఆరోపణ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. కొన్ని సార్లు ఆధారాలు ఉన్నా వాటిని జన బాహుళ్యంలో చర్చకు పెట్టడానికి వెరచి ఊరుకునేవారు. దానికి కారణం ఏమిటి అంటే ప్రజలలో ఇలాంటి విషయాలకు చర్చకు వెళ్తే ఏ రకమైన పర్యవసానాలు వస్తాయో ఏ పర్యవసానాలు చోటు చేసుకుంటాయో అన్న విచఖణ ఉండడమే అని అంటారు. కానీ ఇపుడు ఆధారాలు లేకపోయినా గాలిలో విమర్శలు చేయడం అలవాటు అయింది. ఎందరో కొందరు జనాలు నమ్ముతారు కదా అని విమర్శించే ధోరణి పెరిగింది. దాంతో అటూ ఇటూ శిబిరాలలో కూడా ఈ పెడ ధోరణి ప్రబలి ప్రజలకు రాజకీయాల పట్ల ఉన్న అభిప్రాయం కూడా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది అన్నది విశ్లేషకుల మాట.

వెన్నుపోటు...సంతకం పోటు :

చంద్రబాబు మీద వైసీపీ నేతలు తరచూ చేసే ఆరోపణ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారు అని. అయితే టీడీపీ నేతలు దానికి చెప్పేది ఏమిటి అంటే ప్రజాస్వామ్య యుతంగానే అధికార మార్పిడి జరిగింది అని. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో బాబు నాయకత్వాన్ని అంతా కోరుకున్నారు అని. అయినా అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా కూడా చూడాలి. ఇక ఒక ఎన్నిక వరకూ దాని మీద విమర్శలు చేసినా చంద్రబాబు 1999లో గెలిచారు. 2014, 2024లో మరో రెండు సార్లు గెలిచారు. ముఖ్యమంత్రిగా తానుగా మూడు సార్లు ఆ పదవిని జనామోదంతో అందుకున్నారు. కాబట్టి ప్రజా కోర్టులో నెగ్గని ఆ తరహా విమర్శలు చేయడం ఏ మేరకు సబబు అనేది ప్రశ్న.

ఇవి కూడా వీగిపోయినట్లే :

ఇక జగన్ తన తండ్రి శవం పక్కన ఉంచుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ జరిపారు అన్నది టీడీపీ నుంచి చేసే ప్రధాన ఆరోపణ. ఇదే ఘాటు విమర్శ కూడా. ఇక ఇది మరింతగా పరాకాష్టకు చేరి వైఎస్సార్ మరణం నిర్ధారణ కాకుండానే జగన్ సీఎం పదవి కోసం పైరవీలు చేశారు అని మరో విమర్శ ఒక మంత్రిగారు చేశారు. దాంతో వైసీపీ దీని మీద మండిపడుతోంది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అయితే వెక్కి వెక్కి ఏడ్చేశారు. అసలు రాజకీయాల్లో ఈ తరహా విమర్శల వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది అన్నది అంతా ఆలోచించాలి. జగన్ ని కూడా ఈ ఆరోపణలు ఎన్ని చేసినా 2019లో జనాలు గెలిపించారు అన్నది గుర్తు పెట్టుకుంటే ప్రజా కోర్టులో ఇవి కూడా వీగిపోయినట్లే అనుకోవాల్సి ఉంటుంది. సిధాంతపరంగా విమర్శలు చేసుకోవడం పాలనలో తప్పులను ఎత్తి చూపడానికి ప్రజా ప్రయోజనాల కోసం చర్చలు జరపడానికి రాజకీయ పార్టీలు సిద్ధపడినపుడే ఈ తరహా పెడ ధోరణులకు ముగింపు పడుతుంది. కానీ ఆ ఆశ ఎండమావిగానే ఉందా అన్నదే అందరి సందేహంగా ఉంది.