ఆ ఉత్తరం చూసి కలత చెందిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ సీఎం గా ఉండగా ఆయన బంధువుల కుర్రాడు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ అబ్బాయి పదవ తరగతి చదువుతున్నాడు.
By: Satya P | 30 May 2026 12:00 AM ISTఎన్టీఆర్ కి తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది. ఆయన అందుకే పౌరాణిక చిత్రాలలో అద్భుతమైన పాత్రలను వేయగలిగారు. ఆయన వాచకం కూడా అంత బాగుంటుంది. డైలాగ్ డిక్షన్ విషయంలోనూ ఎన్టీఆర్ ది ప్రత్యేక శైలి. ఆయన చిన్న నాటి నుంచే తెలుగు మీద మక్కువతో ఎన్నో పుస్తకాలను చదివారు. సాహిత్యం అంటే ఆసక్తి కూడా ఉంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలుగు భాష కోసం భావి తరాలకు తెలుగు వెలుగులను పంచడం కోసం ఎంతగానో తపించారు. స్వయంగా ఈ విషయంలో తాను జోక్యం చేసుకుని ప్రాథమిక విద్యలో తెలుగు ఏ విధంగా ఉండాలన్న దాని మీద నిపుణులతో పుస్తకలు కొత్త సిలబస్ ని తయారు చేయించారు.
ఆ ఉత్తరం చూసి :
ఎన్టీఆర్ సీఎం గా ఉండగా ఆయన బంధువుల కుర్రాడు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ అబ్బాయి పదవ తరగతి చదువుతున్నాడు. ఆ ఉత్తరంలో చిరంజీవి పెద నాన్న గారికి ఆశీస్సులతో అని మొదలుపెడతారు. ఎన్టీఆర్ దానిని చూసి పెద్దలను ఎలా సంభోదించాలో కూడా పిల్లలకు తెలియడం లేదని అలాంటి చదువులు మనం అందిస్తున్నామని విద్యా నిపుణుల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు. మనం నేర్పుతున్న చదువులు సంస్కృతి సంప్రదాయాలను ఆచారాలను ఏ మాత్రం తెలియ చెప్పడం లేదని కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ తీవ్రంగా మధనపడ్డారు.
తెలుగు వాచకాలను మార్చి :
దాంతో ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాధమిక వాచకాలను మార్చాలని. వాటిని కొత్తగా తయారు చేయాలని, తెలుగు జాతి చరిత్రకు సంప్రదాయలాకు ఆచారాలకు అద్దం పెట్టేలా కొత్త వాచకాలు ఉండాలని రామారావు నిపుణులకు దిశా నిర్దేశం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా ఇంద్రా రెడ్డి ఉన్నారు. ఆయనతో చర్చించడమే కాదు తెలుగు భాషలో దిట్టలు అయిన మధురాంతకం రాజారాం, నాగభైరవ కోటేశ్వరరావు, విద్యావేత్త డాక్టర్ ఎన్. మంగాదేవి, కేతవరపు రామకోటి శాస్త్రి, హిందీ రచయిత వేమూరి రాధాకృష్ణమూర్తి లతో విద్యాశాఖ సెక్రటరీ కె. సుజాత రావు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు.
పూర్తి అధ్యయనం తరువాత :
ఇక ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులు మేధావులు తల్లి దండ్రులు విద్యా వేత్తలు పాత్రికేయుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఒక నెల పూర్తి అవకుండానే కొత్త సిలబస్ ని తయారు చేసి సీఎం ఎన్టీఆర్ ముందు ఉంచింది. ఆ మీదట వర్క్ షాప్ ని కూడా నిర్వహించి తెలుగు వాచకాలను తయారు చేయించారు ఎన్టీఆర్. వాటికి తెలుగు భారతి అని పేరు కూడా ఆయనే స్వయంగా పెట్టి తెలుగు పట్ల మమకారం చాటుకున్నారు. ఇక ఈ తెలుగు వాచకాల పుస్తకాలలో ప్రతీ దానికీ ముందు మాట రాసి మరీ తన తెలుగు భాష అభిమానాన్ని ఎన్టీఆర్ చాటుకోవడం గొప్ప విషయం. అందులో ఆయన పిల్లలను సంభోదించిన విధానం చూస్తే ముచ్చట వేస్తుంది. మీరు తెలుగు జాతి పండించుకున్న అదృష్ట ఫలాలు అని ఎన్టీఆర్ అభివర్ణించారు చదువుతో జ్ఞానం వస్తుందని అలా మంచి పౌరులుగా మారి దేశాన్ని తీర్చి దిద్దాలని బాలలను కోరుతూ ఎన్టీఆర్ సందేశం ఇచ్చారు. ఎన్ టీఆర్ 103వ జయంతి తాజాగా జరిగిన సందర్భంగా ఆయన గురించిన తీపి గురుతులను అంతా ఈ విధంగా నెమరేసుకుంటున్నారు.
