అమరావతిలో ఐకానిక్ విగ్రహం.. ఎన్టీఆర్ స్మారకం ఎత్తు ఎంతో తెలుసా?
అమరావతిలో దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంతో ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
By: Tupaki Desk | 14 Sept 2025 9:57 AM ISTఅమరావతిలో దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంతో ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాజధానిలో టీడీపీ ముద్ర స్పష్టంగా తెలియజేసేలా.. చిరకాలం గుర్తిండిపోయేలా ఈ ప్రాజెక్టును చేపడుతోందని అంటున్నారు. రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద నిర్మించనున్న ఎన్టీఆర్ విగ్రహం గుజరాత్ లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్నా పెద్దగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుపై తాజాగా సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవం చాటిచెప్పేలా ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్రకు పెద్దపీట వేయాలని, అంతేకాకుండా పర్యాటకంగా కూడా ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశంగా చెబుతున్నారు. దాదాపు 182 మీటర్ల ఎత్తులో నిర్మించే విగ్రహ నమూనాలను శనివారం చంద్రబాబు పరిశీలించారు.
రాష్ట్ర రాజధానిలో ఇప్పటికే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 58 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఈ మధ్య కాలంలోనే ఆవిష్కరించారు. ఇక ఎన్టీఆర్ విగ్రహంతోపాటు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని స్థాపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విగ్రహాలన్నీ తెలుగు ప్రజల భావోద్వేగానికి ప్రతీకగా నిలవాలని భావిస్తున్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం పేరుతో ఎన్టీఆర్.. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు.. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు వెలుగుగా అల్లూరి సీతారామరాజు ఆయా కాలాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక వారి చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా అమరావతిలో స్మారక చిహ్నాలు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతి వనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ ను తీర్చిదిద్దనున్నారు. ప్రత్యేకించి పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదేవిధంగా అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ ఉండనున్నాయి.
