ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది...వెరీ ఇంట్రెస్టింగ్ !
సీనియర్ ఎన్టీఆర్ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. సినీ రంగంలో రారాజు. ఆయన వేసిన పాత్రలు కానీ ఆయన తీసిన సినిమాలు కానీ ఎవర్ గ్రీన్.
By: Satya P | 29 March 2026 12:25 PM ISTసీనియర్ ఎన్టీఆర్ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. సినీ రంగంలో రారాజు. ఆయన వేసిన పాత్రలు కానీ ఆయన తీసిన సినిమాలు కానీ ఎవర్ గ్రీన్. అన్ని తరాలకు ఆదర్శప్రాయం. ఆయన లాంటి నటుడు మళ్ళీ పుడతాడా అంటే ఎవరూ చెప్పలేరు. కేవలం నటుడిగానే కాదు, దర్శకత్వం, కధ, స్క్రీన్ ప్లే ఇలా అనేక విషయాల్లో ఎన్టీఆర్ అందె వేసిన చేయి. సినీ నిర్మాణంలోనూ ఆయనకు పట్టుంది. నష్టాలు చూడని మంచి నిర్మాతగా పేరుంది. రామారావు సినిమాలు సొంతంగా తీసినా అధిక ఖర్చు హై బడ్జెట్ మోజులకు ఎన్నడూ పోలేదు, ప్రేక్షకుల అభిరుచిని గమనిస్తూనే ప్రయోగాలు చేశారు తన అభిరుంచిని కూడా అందులో రంగరించి చూపించారు.
న్యూస్ పేపర్ కూడా వద్దు :
ఇక ఎన్టీఆర్ గురించి ఆ రోజుల్లో ఎరిగిన వారు నటించిన నటులు చెప్పేది ఏంటి అంటే ఆయన మూడు షిఫ్టులు పనిచేసేవారు. ఎంతో బిజీగా ఉండేవారు. సెట్స్ లో ఆయన కనీసం న్యూస్ పేపర్ కూడా చూసేవారు కాదు, రాజకీయాల గురించి ఒక్క మాట మాట్లాడేవారు కాదు, ఆ మాటకు వస్తే అప్పట్లో మద్రాసులో సినీ పరిశ్రమ ఉండేది. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అయినా రామారావు పెద్దగా రాజకీయ ప్రముఖులను కలిసిన దాఖలాలు అయితే లేవు. ఇక తన సెట్స్ లో ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడినా ఆయన సినిమా డైలాగుల పేపర్ వల్లె వేయమనేవారు తప్పించి రాజకీయాలు మనకెందుకు బ్రదర్ అని సరిపుచ్చేవారు అని నాటి జ్ఞాపకాలను చెప్పే వారు అంటారు.
అలా బీజం పడిందా :
అయితే మద్రాస్ లో ఉండే ఎన్టీఆర్ కి తమిళ సినీ ఆరాధ్య దైవం ఎంజీఆర్ తో మంచి స్నేహం ఉంది. ఎంజీఆర్ డీఎంకేలో కీలక నేతగా ఉంటూనే సినిమాల్లో నటించేవారు. డీఎంకేతో కరుణానిధితో విభేదాల వల్ల ఎంజీఆర్ సొంతంగా అన్నా డీఎంకేను స్థాపించి 1976లో తొలిసారి తమిళనాడులో అధికారం చేపట్టారు. అలా ఆయన ముఖ్యమంత్రి అయన సీఎం అవడంతో రామారావుకు కొంత మేర రాజకీయ వాసనలు తగిలాయని చెప్పవచ్చు. ఇక 1977లో దివిసీమ ఉప్పెన వచ్చింది. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సంభవించిన ఈ ప్రళయంలో వందలాది మంది మరణించారు, వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. లక్షాలాది మంది మీద తీవ్ర ప్రభావం చూపించింది. దాంతో దివి సీమను పునరుద్ధరించేందుకు తన తోటి సినీ కళాకారులతో ఎన్టీఆర్ కలసి విరాళాలు పోగు చేశారు. ఆంధ్ర నాట ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అలా రామారావు దివిసీమ పెను విపత్తుని చూసి ద్రవించిపోయారు. బహుశా ఆనాడు ఆయనలో మొలకెత్తిన ఒక భావన ప్రజా సేవ చేయాలని అన్నది వచ్చి ఉండొచ్చు అంటారు.
దౄఢ సంకల్పంతో :
ఇక 1978 నాటికి కేంద్రంలో ఇందిరా గాంధీ పాలన ముగిసి జనతా ప్రభుత్వం వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ సమయంలో చాలా మంది మిత్రులు శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రావాలని కోరారని చెబుతారు. అయితే రామారావు దానిని సున్నితంగా తిరస్కరించినట్లుగా చెబుతారు. తాను సినిమాల్లో బిజీగా ఉన్నాను అని ఆయన చెబుతూ తప్పుకున్నారు. అలా 1978లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక ఆ ప్రభుత్వంలో వరసగా ముఖ్యమంత్రులను మార్చేస్తూ పోయారు. అలా ఎన్టీఆర్ కి గుంటూర్ లో రూమ్మేట్ గా ఉన్న భవనం వెంకట రాం సీఎం అయ్యారు. ఆయన ప్రమాణానికి మద్రాస్ నుంచి ప్రత్యేకంగా పనిగట్టుకుని హైదరాబాద్ రాజ్ భవన్ కి ఎన్టీఆర్ రావడం ఆనాడు అతి పెద్ద సంచలనంగా మారింది. దానికి కారణం రామారావుకు రాజకీయాలు అంటే అనాసక్తి అని అప్పటికే అంతా విని ఉండడం. ఇది జరుగుతున్న టైంలోనే సర్దార్ పాపారాయుడు మూవీలో ఎన్టీఆర్ నటించడం అందులో అల్లూరి సీతారామరాజు పాత్రను ఒక ప్రత్యేక సందర్భంలో పోషించడంతో ఆయనలో ఒక దృఢ సంకల్పం ఏర్పడింది. తాను ప్రజా సేవ చేయాలని కూడా బలమైన భావన కలిగింది అని అంటారు. అది ఆయన స్వయంగా ఊటీ షూటింగ్ లోనే నాటి సినీ పాత్రికేయులకు చెప్పారు కూడా.
సింపుల్ గా ప్రకటన :
ఇక 1982 మార్చి 29. చాలా సింపుల్ గా మద్రాస్ నుంచి రామారావు విమానాశ్రయం చేరుకుని హైదారాబాద్ కి వచ్చారు. అక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అతి కొద్ది మంది మిత్రుల సమక్షంలో తన పార్టీ పేరుని ప్రకటించారు. ఆ సమయం సాయంత్రం. అప్పట్లో మీడియా మాధ్యమం అంటే ఆకాశవాణి మాత్రమే. ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో పార్టీ ప్రకటన ఆ రోజు సాయంత్రం ఆరుంపావు ప్రాంతీయ వార్తలలో ప్రసారం అయింది. అంతే అది అతి పెద్ద సంచలనంగా మారింది. అంతే జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు రేపింది. అది మొదలు తొమ్మిది నెలల పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్టీఆర్ చైతన్య రధం మీద నిర్వహించిన యాత్ర టీడీపీ ఘన విజయానికి జైత్ర యాత్రగా మారింది. ఒక ప్రాంతీయ పార్టీగా పురుడు పోసుకున్న టీడీపీ సాధించిన విజయాలు ఎన్నో. రికార్డులు ఎన్నో. సంచలనాలు ఎన్నో. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు టీడీపీకి ఈ రోజూ తారక మంత్రంగా మారి నడిపిస్తున్నాయన్నది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం.
