జిల్లా గ్రాఫ్: ఎన్టీఆర్.. 'దానికి' కేరాఫ్‌గా మారిందా ..!
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జిల్లాల్లో అభివృద్ది సాకారం అవుతుందన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
By: Tupaki Desk | 7 July 2025 8:45 AM ISTకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జిల్లాల్లో అభివృద్ది సాకారం అవుతుందన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవానికి అలానే జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు.. జిల్లాల్లోని ప్రధాన పట్టణాల్లోనూ.. రహదారులు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్క జిల్లా పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉంది. అంటే.. అబివృద్ధి విషయంలో కాదు.. అభివృద్ధిని తమకు అనుకూలంగా మలుచుకునే విషయంలో నాయకులు చేస్తున్న రాజకీయాలు తేడాగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా మరింత వెనుకబడిందన్న ప్రచారం జరుగుతోంది.
గత వారం సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్ష చేసినప్పుడు.. ఎన్టీఆర్ జిల్లాలో అబివృద్ధి పనులు జరుగుతున్నా.. దీనిని ప్రచారం చేసుకోవడంలో మాత్రం నాయకులు వెనుకబడి ఉన్నారన్నది ఆయన గుర్తించారు. ఈ విషయంపై ఆయన జిల్లా ఇంచా ర్జ్ మంత్రిని ప్రశ్నించారు కూడా. అయితే.. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లాలో అభివృధ్ధి ఎలా ఉన్నా.. దానికి తగిన విధంగా నాయకులు మాత్రం లేరన్నది వాస్తవం. ఎంపీ కేశినేని శివనాథ్‌తో అంతర్గత వివాదాలు కొనసాగిస్తున్న నాయకులు.. ప్రజల మధ్యకు రావడం లేదు. అభివృద్ధిని వివరించడం లేదు.
ఉదాహరణకు.. జిల్లాలోనికొండ ప్రాంతవాసులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పట్టాలు అందుతున్నాయి. కానీ.. అధికారులు నేరుగా వారికి ఇస్తున్నారు. అదేసమయంలో 2003-2005 మధ్య కొన్ని కాలనీలు ఏర్పాటు చేసి.. ఎక్కడెక్క డ నుంచో జనాలను తరలించారు. వీటిలో రాజరాజేశ్వరి పేట, వాంబేకాలని, ఉడా కాలనీ వంటివి ఉన్నాయి. వాటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పట్టాలు ఇవ్వడం ప్రారంభించింది. ఇది చాలా మెరుగైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. కానీ, ఎమ్మెల్యేలు.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోలేక పోయారు.
అదేవిదంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు. విజయవాడ, మైలవరం, తిరువూరు వంటి నియోజకవర్గాల్లో.. శివారు ప్రాంతాల్లో కొత్తగా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు.. మా నియోజకవర్గంలో ఇంత మంది లబ్ధిదారులు ఉన్నారు.. వారికి ఇళ్లు ఇవ్వండి అని చెప్పిన ఎమ్మెల్యే ఒక్కరు కూడాలేరంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇచ్చేందుకు ప్రభుత్వం.. తీసుకునేందుకు లబ్ధిదారులు ఉన్నా.. మధ్యలో ఎమ్మెల్యేలు చేయాల్సిన పనిని వారు చేయడం లేదు.
దీంతో జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నా.. కూటమికి మాత్రం క్రెడిట్ దక్కడం లేదన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. మరో విషయం ఏంటంటే.. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన భంగ పడిన వారు.. మరింత మౌనంగా ఉన్నారు. దీంతో వారు కూడా ప్రజల మధ్యకు రావడం లేదు. ఇలా.. ఎన్టీఆర్ గ్రాఫ్.. నాయకుల సమన్వయం లేకపోవడానికి.. ప్రచారం చేసుకోవడంలో వెనుబడి ఉండడానికి మాత్రమే కేరాఫ్ గా మారిందన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
