Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ని కంటికి రెప్పలా హరిక్రిష్ణ చూసుకున్నారు

ఎన్టీఆర్ హరికృష్ణ ఒక చైతన్య రథం ఇప్పటికి నాలుగున్నర పదుల క్రితం ఉమ్మడి తెలుగు వాకిట ఒక రాజకీయ చైతన్య సునామీ.

By:  Satya P   |   4 Jun 2026 11:00 PM IST
ఎన్టీఆర్ ని కంటికి రెప్పలా హరిక్రిష్ణ చూసుకున్నారు
X

ఎన్టీఆర్ హరికృష్ణ ఒక చైతన్య రథం ఇప్పటికి నాలుగున్నర పదుల క్రితం ఉమ్మడి తెలుగు వాకిట ఒక రాజకీయ చైతన్య సునామీ. అప్పటికి మూడున్నర పదుల ఏళ్ళ నుంచి ఉమ్మడి ఏపీని పాలిస్తున్న కాంగ్రెస్ ని కూకటి వేళ్ళతో పెకిలించి వేసి మరీ సరికొత్త రాజకీయానికి నాంది పలికిన ఒక అద్భుత చరిత్ర అది. ఎన్టీ రామారావు 1982 లో వెండితెర వేలుపుగా ఉంటూ సడెన్ గా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అప్పట్లో ఆయన చేసిన రాజకీయ ప్రకటన ఒక పెను సంచలనం అయింది. ఇలా రాజకీయాల్లోకి రావడమేంటి తనదైన శైలిలో ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీలో ప్రభంజనానికి సిద్ధపడ్డారు. ఆరు పదుల వయసులో అలుపెరగని రీతిలో ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం నాలుగు చెరగులా పర్యటించారు. దానికోసం ఆయన చైతన్య రధాన్ని ఉపయోగించారు ఆ చైతన్య రథసారధిగా ఉన్నది ఎవరో కాదు ఆయన మూడవ కుమారుడు నందమూరి హరికృష్ణ.

వేలాది కిలోమీటర్ల దూరం :

చైతన్య రధం మీద ఎన్టీఆర్ ని ఉంచి తాను స్వయంగా డ్రైవింగ్ చేస్తూ నందమూరి హరి క్రిష్ణ ఉమ్మడి ఏపీలో వేలాది కిలోమీటర్లు రధ సారధిగా తిరిగారు వందల వేల సంఖ్యలో గ్రామాలను టచ్ చేస్తూ వందల సంఖ్యలో బహిరంగ సభలు అన్నీ చైతన్య రథం మీదే సాగిపోయాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ కాలి కింద ముల్లు తగిలితే తన కంట్లో నలుసు తగిలినట్లుగా హరికృష్ణ ఫీలయ్యేవారు. అంతే కాదు ఎన్టీఆర్ ని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆయన ఎక్కడ అలుపు లేకుండా హరికృష్ణ చైతన్య రధ సారథిగా ఆనాడు రాష్ట్రమంతా ప్రకటించిన తీరు ఒక సాహసం, ఒక అద్భుతం అనే చెప్పాలి. అందరూ చైతన్య రథం మీద నిలబడి ప్రసంగించిన ఎన్టీఆర్ నే చూశారు, చప్పట్లు కొట్టారు. కానీ ఆ చైతన్య రథాన్ని మారుమూల గ్రామాలకు సమయానుకూలంగా తీసుకుని వెళ్లి అందరి వద్దకు అన్న గారిని చేర్చిన ఘనత నందమూరి హరికృష్ణకే దక్కుతుంది. ఆ విధంగా చూస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ ఎనలేనిది ఎన్టీఆర్ కి చేసిన సేవ అంతకు మించినది అని చెప్పక తప్పదు.

రోడ్డు మీదనే నిద్ర :

ఇక హరిక్రిష్ణ ఎన్టీఆర్ ని తన తండ్రిగా కంటే కూడా ఒక దైవంగా చూసుకున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఎన్టీఆర్ సభ ముగించిన తర్వాత తనకు కేటాయించిన బసలో విశ్రమించేవారు కానీ హరికృష్ణ మాత్రం చైతన్య రథం పక్కన నిలిపి నేలమీద నిద్రించేవారు ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా తొమ్మిది నెలల పాటు హరికృష్ణ అలా ఎండకి వానకి తట్టుకొని తండ్రి వెనకాలే తిరుగుతూ చైతన్య రథాన్ని పరుగులు తీయిస్తూ సాగించిన ఆ శ్రమ పరిశ్రమ అంతా కూడా 1983లో ఫలించి తెలుగుదేశం ఘన విజయం సాధించింది. కానీ ఎన్టీఆర్ ప్రభుత్వంలో హరికృష్ణ కనీసం ఒక చిన్న పదవిని కూడా తీసుకోలేదు, అసలు ఏమీ ఆశించలేదు కూడా. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి ఎన్టీఆర్ వద్దకు కూడా వెళ్ళి ఏ ఒక్క సహకారాన్ని కోరలేదు. ఆయనకు ఉన్నది అంతా కూడా తన తండ్రికి సేవ చేయాలి, తన తండ్రి ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే. అందుకే అంతటి మహత్తర బాధ్యతను తలకెత్తుకున్నారు. ఇవన్నీ ఆనాడు అన్న గారి వెంట ఉన్న వారికి తెలిసిన విషయాలే. ఇపుడు ఎందుకు అంటే ఈ విషయాలన్నీ తాజాగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

హరిక్రిష్ణ నేల మీదనే :

ఎవరేమనుకున్న హరికృష్ణ ఆనాడు చేసిన పరిశ్రమ ఎనలేనిది గొప్పది అని రేణుక చౌదరి చెప్పారు అంతేకాదు చైతన్య రథం ఒక ట్రెండ్ సెట్టర్ అన్నారు. అనాడు చైతన్య రధం నడిపిన హరిక్రిష్ణ తన తండ్రి దగ్గరకు వెళ్లకుండా రోడ్డు పక్కనే తన ఆ వాహనాన్ని పార్క్ చేసి అదే నేల మీదే పడుకొని ఎన్నో రాత్రులు ఎన్నో నెలలు గడిపిన ఆ కష్టాన్ని ఆమె గుర్తు చేస్తూ తాను వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిని అని చెప్పుకొచ్చారు. నిజమే చైతన్య రధంలో ఎన్టీ రామారావు తిరిగారని ఈ రోజుకి అంతా చెబుతారు. కానీ ఆ చైతన్య రథసారథి హరికృష్ణను ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు, అంతే కాదు ఆయన త్యాగాన్ని ఎంతమంది చెప్పుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీకి పునాదిగా నిలిచిన వారు హరికృష్ణ. కానీ ఆ పార్టీలో ఆయన సంపాదించుకున్నది ఏమీ లేదు, చాలా మంది తమ రాజకీయ జీవితంలో ఎంతో కొంత సాధించారు కానీ హరికృష్ణ కేవలం తండ్రి మీద ప్రేమతో చైతన్య రధ సారధి అయ్యారు. అంతే ఒక మామూలు డ్రైవర్ గానే మిగిలిపోయారు. అది ఆయనకు తండ్రి ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం తన తండ్రి కోసం ఆయన పడిన ఆరాటం. ఇది ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన అద్భుతమైన అనుబంధం, అవ్యాజ్యమైన ఆనందం. అంతేకాదు ఒకే ఒక ఎన్టీఆర్ ఒకే ఒక చైతన్య రథం ఒకే ఒక హరికృష్ణ ఇది ఒక చరిత్ర. అంతే.